కరెన్సీ కోసం కిడ్నాపర్ల కొత్త ప్లాన్
ఘజియాబాద్: పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత కరెన్సీ సమస్య ఏర్పడటంతో కిడ్నాపర్లు డబ్బులు డిమాండ్ చేయడానికి కొత్త మార్గం ఎంచుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 16 ఏళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు బాధితుడి కుటుంబ సభ్యులకు బ్యాంకు ఎకౌంట్ నెంబర్ పంపి డబ్బు ట్రాన్సఫర్ చేయాల్సిందిగా బెదిరించారు. బ్యాంక్ ఖాతా నెంబర్ ఆధారంగా పోలీసులు.. ఖాతాదారుడి (కిడ్నాపర్) స్వస్థలాన్ని, ఫోన్ నెంబర్‌ను తెలుసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
ఘజియాబాద్ సమీపంలోని ఇందిరాపురంలో మణిభూషణ్ చౌదరి అనే వ్యాపారి కొడుకు రెండు నెలల క్రితం అదృశ్యమయ్యాడు. మతిస్థిమితంలేని బాలుడు స్కూలుకు వెళ్లడం లేదు. ఇటీవల ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాలుడి తండ్రికి ఫోన్ కాల్ వచ్చింది. మీ కొడుకు తమ దగ్గర ఉన్నాడని, విడుదల చేయాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. పెద్ద నోట్ల రద్దు వల్ల తమ దగ్గర కరెన్సీ లేదని బాధితుడి కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో కిడ్నాపర్ బ్యాంకు ఖాతా నెంబర్ చెప్పి అందులోకి 50 వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలని, లేకుంటే మీ కొడుకును హతమారుస్తామని బెదిరించాడు. కొడుకు అదృశ్యమైనపుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన మణిభూషణ్.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కిడ్నాపర్లు బెదిరించిన విషయాన్ని చెప్పాడు. పోలీసులు బ్యాంకు ఖాతా నెంబర్ ఆధారంగా ఆరా తీయగా కిడ్నాపర్ మీరట్‌కు చెందినవాడిగా గుర్తించారు. పోలీసులు అతని మొబైల్ ఫోన్ నెంబర్‌ను తెలుసుకుని కాల్ చేయగా, స్విచాఫ్ చేసుకున్నాడు. మీరట్‌కు పోలీసుల బృందాన్ని పంపి కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు.