అప్పుతీర్చకపోయారో..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: తెలంగాణ నుంచి విలీనం చేసుకున్న మండలాలలోని రైతులకు రుణమాఫీ అమలు కావడం లేదు. వారు రుణం తీసుకున్న బ్యాంకులు తెలంగాణ పరిధిలో ఉండటంతో అటు తెలంగాణ ప్రభుత్వం గాని, ఇటు ఆంధ్రా ప్రభుత్వం కాని పట్టించుకోవడం లేదు. తాజాగా అప్పు తీర్చాలని లేనిపక్షంలో ఆస్తులు వేలం వేస్తామంటూ బ్యాంకర్లు నోటీసులు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. విలీన మండలాల విషయంలో ప్రభుత్వం మొదటి నుంచి సవతి ప్రేమ చూపిస్తోంది. అసలు తాను పదవీ బాధ్యతలు చేపట్టనని మొండికేయడంతో ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారని పదేపదే సీఎం తమను వంచించారంటూ ఆగ్రహం చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ మండలాల ప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆర్ అండ్ ఆర్, పునరావాసం విషయంలో వారికి నష్టం జరుగుతూనే ఉంది. ఈ మండలాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదు.
మరోవైపు వారికి రుణమాఫీ విషయంలో కూడా అన్యాయం జరిగింది. అసలు తాము ఏ రాష్ట్రానికి చెందినవారమో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు రైతులకు రుణమాఫీ ప్రకటించిన ముఖ్యమంత్రి తమకు రుణ ఉపశమన పత్రాలను అందించి ఊరుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తమ ఖాతాలో నగదు జమచేయకుండా మోసగించారని కుక్కునూరు మండలంలోరి చీరవెల్లి గ్రామానికి చెందిన రైతులు వాపోయారు. తీసుకున్న రుణాలను వెంటనే చెల్లించాలని లేదా రెన్యూవల్ చేయించుకోవాలని బ్యాంకుల నుంచి సుమారు 50 మంది రైతులకు నోటీసులు అందడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేస్తున్న తమను వంచించిన చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు.
వడ్డీ కొండలా పెరిగింది
నేను వ్యవసాయానికని భద్రాచలం ఎస్బీఐలో రూ 50 వేలు రుణం తీసుకున్నాను. చంద్రబాబు రుణమాఫీ అంటూ వాగ్దానాలు చేయడంతో రుణం కట్టకుండా వదిలేశాను. దాంతో తీసుకున్న అసలుతో పాటు వడ్డీ కలిపి రూ.1.20 లక్షలు రుణాన్ని చెల్లించాలంటూ బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయి. రూ.50 వేల రుణానికి వడ్డీ రూ. 70 వేలు అయి కూర్చుంది. చంద్రబాబును నమ్ముకున్నందుకు రైతులందరం నట్టేట మునిగాం.
చేకూరి సూర్యనారాయణరాజు,
రైతు, చీరవెల్లి, కుక్కునూరు మండలం
రుణమాఫీ జరగలేదు
నేను బ్యాంకులో రూ. 40 వేలు రుణం తీసుకున్నాను. నేను తీసుకున్న రుణానికి వడ్డీతో కలిపితే రూ.1.20 లక్షలు కంటే ఎక్కువ అయి ఉండదు. రూ.1.50 లక్షల లోపు రుణాన్ని మొత్తం మాఫీ చేస్తామన్న చంద్రబాబు నాకు ఇంతవరకు రుణమాఫీ చేస్తున్నట్లు కనీసం రుణఉపశమన పత్రాన్ని కూడా అందించలేదు.
కుండా రమణ, రైతు, చీరవెల్లి, కుక్కునూరు