రుణ విముక్తి సరే..బ్యాంకు నోటీసుల సంగతేంటి?
సంతమాగులూరు: ‘రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసిందని సదస్సులు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు చెబుతున్నారు సరే..ఇప్పుడు కూడా బంగారం కుదువపెట్టి తీసుకున్న రుణాలు కట్టకపోతే వేలం వేస్తామని బ్యాంకులు నోటీసులు పంపుతున్నాయి..వాటి సంగతేంటి’ అని రైతు సాధికారత సదస్సులకు వెళ్లిన అధికారులను రైతులు నిలదీస్తున్నారు. మండలంలోని పుట్టవారిపాలెం, మామిళ్లపల్లి, పరిటాలవారిపాలెం, కొమ్మాలపాడు, కుందుర్రు, మక్కెనవారిపాలెం గ్రామాల్లో శుక్రవారం రైతు సాధికారత గ్రామసభలు నిర్వహించారు. అన్ని గ్రామాల్లో రైతులు అధికారులను నోటీసుల సంగతి తేల్చాలని నిలదీశారు.
కుందుర్రుల్లో తహశీల్దార్ బీ గంగాధరరావు పర్యవేక్షణలో నిర్వహించిన సభలో రైతులు వేదిక వద్దకు వచ్చి అధికారులను నిలదీశారు. ‘అన్ని రోగాలకు ఒకటే మందన్నట్లుగా మీరేమో బంగారు రుణాలను కూడా ఐదు భాగాలు చేసి ఐదో వంతు జమ చేస్తారంటున్నారు. ఇలా అయితే బంగారంపై అప్పు పోయేదె ప్పుడు.. వారు మాకు బంగారు నగలు ఇచ్చేదెప్పుడు’ అని ప్రశ్నించారు. ఈవిషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తహశీల్దార్ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అక్కడే ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బ్యాంకు నిబంధనల ప్రకారం రుణం పొందిన తరువాత రెండేళ్ల వరకే గడువు ఉంటుందని..ఆ తరువాత వేలం నోటీసులు ఇస్తామన్నారు. 300 మంది గడువు మీరిన వారికి నోటీసులు జారీ చేశామని చెప్పారు.