మళ్లీ తెరపైకి ఓపెన్జైలు ప్రతిపాదన
న్యూఢిల్లీ: జైలు వ్యవస్థను సంస్కరించడంలో భాగంగా బాప్రోలా ప్రాంతంలో ఓపెన్ జైలు నిర్మించాలన్న సుదీర్ఘకాల ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఇటీవల నిర్వహించిన అత్యున్నతస్థాయి సమావేశంలో దీనిపై విస్తృత చర్చ జరిగింది. ఇందుకోసం బాప్రోలాలో స్థలాన్ని సేకరించాలని జైలుశాఖ అధికారుల సమీక్షా సమావేశంలో నిర్ణయిం చారు. ఓపెన్జైలు చుట్టూ గోడలు, కాపలా వంటి ఏ ఇతర అడ్డంకులూ ఉండవు. శారీరకంగా, మానసికంగా పూర్తి ఆరోగ్యంతో ఉండి, సత్ప్రవర్తన కలిగిన వారిని ఓపెన్ జైలులో ఉండడానికి అనుమతిస్తారు. ఖైదీల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించి, విడుదలయ్యాక జనజీవన స్రవంతిలో కలసి పోవడానికి వీలుగా ఓపెన్జైలు విధానాన్ని ప్రవేశపెడుతున్నామని సీనియర్ అధికారి ఒకరు అన్నారు. నిజానికి 1996లోనే ఓపెన్ జైలు ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
అయితే బాప్రోలాలో ల్యాండ్ మాఫియా ఆగడాల వల్ల జైళ్లశాఖకు భూమి కొనుగోలు చేయడం సాధ్యం కాలేదు. ఓపెన్ జైలు నిర్మాణం వల్ల తీహార్ జైలుపైనా భారం తగ్గుతుంది. కేవలం ఆరువేల మందికి వసతి కల్పించగల తీహార్ జైలులో ప్రస్తుతం 10 వేల మందిని ఉంచుతున్నారు. దీనిపై భారం తగ్గించడానికి కొత్తగా తొమ్మిది జైళ్లు నిర్మిస్తున్నామని, రోహిణి జైలులో అదనంగా మూడు భవనాల నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని ఒక అధికారి చెప్పారు. దీనికితోడు మండోలీ జైలు భవన సముదాయంలోనూ కొత్తగా ఆరు జైళ్లు నిర్మిస్తున్నారు. ఇందుకోసం డీడీఏ నుంచి 78.62 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. వీటి నిర్మాణం కూడా డిసెంబర్లో పూర్తికానుంది. దాదాపు 3,700 మంది ఖైదీలకు ఈ కొత్త భవనాల్లో వసతి కల్పించవచ్చు. టిక్రిఖుర్ద్ గ్రామంలోనూ మరో జైలు నిర్మాణానికి ప్రభుత్వం భూమిని సేకరించింది. అవసరమైన అనుమతులు వచ్చాక నిర్మాణాన్ని ప్రారంభిస్తామని జైళ్లశాఖ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే శ్రీవాస్తవకు వివరించారు. జైళ్ల నిర్మాణానికి అన్ని రకాలుగా సహకరించాలని ఆయన వివిధ ప్రభుత్వ విభాగాలను ఈ సందర్భంగా ఆదేశించారు.