బార్ల లైసెన్సు ఫీజు పెంపు!
- రెస్టారెంట్లలోని బార్ల ఫీజులపై కనీసం రూ.5 లక్షలు అదనం
- క్లబ్బులకు రూ.25 లక్షల ఫీజు ఖరారు చేయాలని నిర్ణయం
- జూలై నుంచి అమల్లోకి రానున్న నూతన బార్ పాలసీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో క్లబ్బులు, రెస్టారెంట్లలో కొనసాగుతున్న బార్ల లైసెన్స్ ఫీజులు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న ‘నూతన బార్ పాలసీ’లో ఈ మేరకు మార్పులు చేయనుంది. క్లబ్బుల్లో కొనసాగుతున్న బార్ల లైసెన్సు ఫీజులు ప్రస్తుతం తక్కువగా ఉన్న నేపథ్యంలో వాటిని భారీగా పెంచనున్నట్లు తెలుస్తోంది. క్లబ్బుల్లోని బార్ల బేసిక్ లైసెన్సు ఫీజును కనీసంగా రూ.25 లక్షలకు పెంచడంతోపాటు సభ్యుల సంఖ్య, సభ్యత్వ రుసుము ఆధారంగా అదనపు ఫీజు వసూలు చేయనున్నారు. రెస్టారెంట్లలోని బార్లకు ప్రస్తుతమున్న లైసెన్సు ఫీజుపై కనీసం రూ.5 లక్షలు పెంచడంతోపాటు బార్ వైశాల్యం ఆధారంగా ప్రతి 200 చదరపు మీటర్లకు 10 శాతం చొప్పున పెంచనున్నారు. బార్ల లైసెన్సు ఫీజుల పెంపు ద్వారా సుమారు రూ.200 కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరనుందని అంచనా. ప్రస్తుతం బార్ల వార్షిక లైసెన్సు ఫీజుల ద్వారా సుమారు రూ.600 కోట్లు వసూలవుతోంది.
క్లబ్బుల్లోని బార్లపై భారీగా..
రాష్ట్రంలో ప్రస్తుతం 804 రెస్టారెంట్ బార్లు, 17 క్లబ్బు బార్లు, పర్యాటక ప్రాంతాల్లో టీడీ–1 లైసెన్సుతో 9 బార్లు ఉన్నాయి. 50వేలలోపు జనాభా ఉన్న ప్రాంతంలోని రెస్టారెంట్ బార్లకు లైసెన్సు ఫీజు రూ.25 లక్షలుకాగా, 50 వేల నుంచి 20 లక్షల వరకు జనాభా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రూ.28 లక్షలు, గ్రేటర్ హైదరాబాద్లోని బార్లకు రూ.35 లక్షల చొప్పున వసూలు చేస్తున్నారు. క్లబ్బుల్లో కొనసాగుతున్న బార్లకు, టీడీ–1 లైసెన్సున్న బార్లకు 3 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.3 లక్షలు, ఆపై జనాభా ఉన్న చోట రూ.6 లక్షలు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ ప రిధిలోని పలు క్లబ్బుల్లో సభ్యత్వం పొందాలంటే వాటి స్థాయిని బట్టి రూ.లక్ష నుంచి రూ.25 లక్షల వరకు ఫీజు ఉంటుందని ఆ బ్కారీ శాఖ పరిశీలనలో తేలింది. ఈ నేపథ్యం లో క్లబ్బుల్లోని బార్ల ఫీజును ఫ్లాట్గా రూ. 25 లక్షలకు పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది.
వైశాల్యం ఆధారంగా రెస్టారెంట్ బార్ల ఫీజుల పెంపు
మూడు కేటగిరీలుగా ఉన్న అన్ని బార్ల లైసెన్సు ఫీజులను రూ.5 లక్షల మేరకు పెంచాలని నిర్ణయించిన ఆబ్కారీ శాఖ.. ఆయా బార్ల వైశాల్యం ఆధారంగా అదనపు ఫీజు వసూలు చేయనుంది. బార్ల కనీస వైశాల్యం 500 చదరపు మీటర్లుగా నిర్ణయించి నిర్దేశిత ఫీజు వసూలు చేస్తారు. అంతకు మించితే ప్రతి 200 చదరపు మీటర్లకు 10 శాతం ఫీజు అదనంగా వసూలు చేస్తారు. దీనివల్ల రెండు మూడు అంతçస్తుల్లో జనతా, డీలక్స్, ఏసీ పేర్లతో నిర్వహిస్తున్న బార్లపై ఎక్కువగా భారం పడనుంది. ఈ లైసెన్సు ఫీజుల పెంపునకు సంబంధించిన విధివిధానాలపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రాతో కమిషనర్ చంద్రవదన్, ఇతర అధికారులు శుక్రవారం సమావేశమయ్యారు.