బైండోవరా.. బేఫికర్!
యథేచ్ఛగా గుట్కావ్యాపారుల దందా
దాడులతో తాత్కాలిక విరామం దొరికినవి చిన్న చేపలే!
విజయవాడ సిటీ : పోలీసులు బైండోవర్ కేసులు పెట్టినా కొందరు వ్యాపారులు అదురు, బెదరు లేకుండా నిషేధిత ఖైనీ, గుట్కా వ్యాపారం యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. నగరంలోని పాతబస్తీకి చెందిన గుట్కా వ్యాపారులపై కొద్ది రోజల కిందట వన్‌టౌన్ పోలీసులు బైండోవర్ కేసులు పెట్టినట్టు విశ్వసయంగా తెలిసింది. ఇకపై తాము చట్టవిరుద్ధంగా వ్యాపారాలు నిర్వహించబోమని, ఒక వేళ ఆ విధంగా చేసిన పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు అనేది బైండోవర్ కేసుల సారాంశం. ఆ వ్యాపారులు గతంలో చట్ట విరుద్ధంగా గుట్కా, ఖైనీ అమ్మకాలు జరుపుతున్నట్టు పోలీసుల రికార్డుల్లోకి ఎక్కడం వలనే పోలీసులు బైండోవర్ చేసినట్టు తెలిసింది. పాత నేరస్తులు మరోసారి ఆ తరహా నేరాలకు పాల్పడకుండా కొన్ని సందర్భాల్లో బైండోవర్ కేసులు నమోదు చేస్తారు.
పాతబస్తీలో పలువురు గుట్కా వ్యాపారులపై బైండోవర్ కేసులు పెట్టారు. బైండోవర్ కేసుల్లో నిందితుల రోజువారీ చర్యలను పోలీ సులు నిరంతరం పరిశీలిస్తుంటారు. ఈ నేపథ్యంలో వ్యాపారులు తిరిగి గుట్కా వ్యాపారం చేసేందుకు సాహసించే అవకాశం లేదు. అయితే మొక్కుబడిగా బైండోవర్ కేసులు నమోదు చేసిన పోలీసు అధికారులు ఆపై మామూళ్లకు తెరలేపినందునే గుట్కా వ్యాపారులు తమ దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. క్రమం తప్పకుండా నెలవారీ మామూళ్లు అందుతున్నందున పోలీసులు వారిని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గుట్కా వ్యాపారం జోరుగా సాగుతోందన్న విమర్శలు ఉన్నాయి.
తాత్కాలిక విరామం
పత్రికల్లో వరుస కథనాలతో గుట్కా హోల్‌సేల్ వ్యాపారులు తాత్కాలికంగా వ్యాపారాలు ఆపినట్టు తెలిసింది. మంగళవారం పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి పలువురు వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు సుమారు రూ.10 లక్షల విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ దాడుల్లో పట్టుబడిన వారిలో ప్రముఖులైన హోల్‌సేల్ వ్యాపారులు లేరని సమాచారం. ముందుగానే వారు షాపులు మూసేయడంతో పోలీసుల దాడులకు చిన్న చేపలే దొరికినట్టు తెలిసింది.