ఉచిత ఇంటర్‌కు నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోండి
విద్యార్థులకు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎంఎస్ శోభారాణి సూచన
కర్నూలు(అర్బన్): కార్పొరేట్ కళాశాలల్లో ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించేందుకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువును పొడిగించినట్లు సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు ఎంఎస్ శోభారాణి తెలిపారు. సోమవారం సాయంత్రం తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీడీ మాట్లాడుతూ జిల్లాలోని జిల్లాపరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పూర్తి చేసిన అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు.
బీఏఎస్ పాఠశాలల్లో
ఎస్సీ విద్యార్థులకు ప్రవేశం:
జిల్లాలో ప్రభుత్వం ఎంపిక చేసిన 11 బెస్ట్ అవేలబుల్ స్కూల్స్‌లో 100 మంది ఎస్సీ బాల బాలికలకు 1వ తరగతి ఇంగ్లిషు మీడియంలో ప్రవేశం కల్పిస్తున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ డీడీ శోభారాణి తెలిపారు. ఇందులో 33 సీట్లను బాలికలకు, 67 సీట్లను బాలురకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఒక్కో విద్యార్థికి స్కూల్ ఫీజులు, పుస్తకాలు ఇతరత్రా ఖర్చుల కింద ఎంపికైన పాఠశాలలకు ఏడాదికి రూ.20 వేలను ప్రభుత్వం మంజూరు చేయనుందని తెలిపారు.
1వ తరగతిలో తమ చిన్నారులకు చేర్చబోయే తల్లిదండ్రుల నివాసం ఆయా పాఠశాలలకు సమీపంలో ఉండాలన్నారు. ఈ పాఠశాలలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు నివాస, కుల, తల్లిదండ్రుల ఆదాయ, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు జీరాక్స్ కాపీలు, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫోటోలను దరఖాస్తుకు జతపరచాలన్నారు. ఈ పాఠశాలల్లో చేరే విద్యార్థులు 01-06-2008 నుంచి 01-06-2009 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలని, అలాగే పుట్టిన తేదీ సర్టిఫికెట్లు సంబంధిత మునిసిపల్‌కమిషనర్, తహశీల్దార్లు జారీ చేసినవై ఉండాలన్నారు.
దరఖాస్తు ఫారాలు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో, జిల్లాలోని ఏడు సహాయ సంక్షేమాధికారుల కార్యాలయాల్లో లభ్యమవుతున్నట్లు ఆమె తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 28లోగా తమ కార్యాలయంలో అందించాలని పేర్కొన్నారు. ఈ నెల 30న ఉదయం 11 గంటలకు స్థానిక అంబేద్కర్ భవన్లో లాటరీ పద్ధతిన విద్యార్థులకు ఎంపిక చేస్తారని ఆమె తెలిపారు.
బీఏఎస్గా ఎంపికైన పాఠశాలలు:
జిల్లా కేంద్రంలోని సర్వేపల్లి విద్యాలయం క్రిష్ణానగర్, జీసస్ మేరీ జోసఫ్ ఇంగిషు మీడియం స్కూల్ చిల్డ్రన్స్ పార్కు సమీపంలో, కాకతీయ పబ్లిక్ స్కూల్ మద్దూర్‌నగర్, నందికొట్కూరు నవనంది హైస్కూల్, నంద్యాల సమతా విద్యానికేతన్, కాల్వబుగ్గ బుగ్గరామేశ్వర హైస్కూల్, డోన్ సుధ హైస్కూల్, ఎమ్మిగనూరు ఆదర్శ విద్యా పీఠం, నలంద హైస్కూల్, ఆళ్లగడ్డ శ్రీ రాఘవేంధ్ర పబ్లిక్ స్కూల్, కోవెలకుంట్ల సెయింట్ జోసఫ్ ఇంగ్లిషు మీడియం స్కూల్స్ ఎంపికైనట్లు డీడీ శోభారాణి తెలిపారు.