1,462 హెక్టార్లలో పంటనష్టం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షం రైతాంగానికి భారీ నష్టాన్ని చేకూర్చింది. మూడు రోజుల పాటు విస్తారంగా కురిసిన వానలకు జిల్లా పశ్చిమ ప్రాంతంలో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో చాలా చోట్ల పంటలు నీట మునిగాయి. కాగ్నా, ఈసీ, మాల, పెద్ద వాగులు ఉధృతంగా ప్రవహించడంతో పంటలు కొట్టుకుపోయాయి.
కొన్ని చోట్ల పైరు నీటిపాలైంది. జిల్లావ్యాప్తంగా గత నెల 28 నుంచి ఈ నెల 2వ తేదీవరకు కురిసిన వానలకు 1,462 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలకు నష్టం కలిగిందని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించింది. ముఖ్యంగా తాం డూరు, పరిగి, యాలాల, బషీరాబాద్, పూడూరు మండలాల్లో వర్షాలతో భారీ నష్టం కలిగింది. పత్తి, మొక్కజొన్న, వరి, కంది, పెసలు, మినుప పంటలు దెబ్బతిన్నాయి.
పరిగిలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఈ డివిజన్లలో మెట్ట పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. ఆయా మండలాల్లో 50 శాతం దెబ్బతిన్న పంటల వివరాలను నమోదు చేసిన యంత్రాంగం... క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందించే పనిలో నిమగ్నమైంది. మరోవైపు శంషాబాద్, మొయినాబాద్ మండలాల్లో ఉద్యాన పంటలు కూడా బాగా దె బ్బతిన్నాయి.
ఈసీ వాగు పరివాహక ప్రాంతంలో పూలతోటలు నీట మునగగా, వరిపైరు కొట్టుకుపోయింది. ఈ వాగుకు ఇరువైపులా ఉన్న మెట్ట పంటలు ఇసుకమేటతో నిండిపోయాయి. సకాలంలో వర్షాలు కురవలేదని బెంగపడ్డ రైతాంగానికి ఏకధాటిగా కురిసిన వానలు కంటిమీద కునుకులేకుండా చేశాయని చెప్పవచ్చు.