basket ball tournament
-
చాంపియన్లుగా హైదరాబాద్, మేడ్చల్
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో సోమవారం రాష్ట్రస్థాయి అండర్–16 (యూత్) బాస్కెట్‌బాల్ టోర్నీలో చాంపియన్లుగా బాలుర విభాగంలో హైదరాబాద్ జట్టు, బాలికల విభాగంలో మేడ్చల్ మల్కాజ్గిరి జట్లు నిలిచాయి. బాల, బాలికల విభాగాల్లో వికారాబాద్ జట్లు రన్నరప్ స్థానాలను దక్కించుకోగా, మూడోస్థానంలో మేడ్చల్ మల్కాజ్గిరి బాలుర విభాగం, బాలికల్లో రంగారెడ్డి జట్లు నిలిచాయి. చివరి వరకు ఉత్కంఠ బాలుర, బాలికల విభాగం ఫైనల్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. ఆయా జట్లు నువ్వానేనా అనే రీతిలో తలపడ్డాయి. ఉత్కంఠంగా చివరి వరకు సాగిన బాలుర విభాగం ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 57–53 పాయింట్ల తేడాతో వికారాబాద్ జట్టుపై విజయం సాధించింది. బాలికల ఫైనల్ మ్యాచ్లోఅదేవిధంగా బాలికల ఫైనల్ మ్యాచ్‌లో మేడ్చల్ మల్కాజ్గిరి జట్టు 58–56 పాయింట్ల తేడాతో వికారాబాద్ జట్టుపై గెలుపొందింది. బాలుర విభాగం మూడోస్థానం మ్యాచ్‌లో మేడ్చల్ జట్టు 50–40 పాయింట్ల తేడాతో రంగారెడ్డి జట్టుపై, బాలికల మూడోస్థానం మ్యాచ్‌లో రంగారెడ్డి జట్టు 35–7 పాయింట్ల తేడాతో హైదరాబాద్ జట్లపై విజయాలు నమోదు చేసుకున్నాయి. ట్రోఫీలు అందజేసిన మున్సిపల్ చైర్మన్, డీఎస్పీ టోర్నీలో విన్నర్, రన్నరప్, మూడోస్థానం జట్లకు మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీనియర్ న్యాయవాది మనోహర్‌రెడ్డి ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం డీఎప్పీ మాట్లాడుతూ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఇలాంటి టోర్నీలు ఎంతగానో దోహదపడుతాయని తెలిపారు. ఇలాంటి టోర్నీలు మరిన్ని నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ అప్పయ్య, రాష్ట్ర బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నార్మన్ ఐజాక్, జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మక్సూద్‌బిన్ అహ్మద్ జాకీర్, నసరుల్లా హైదర్, జిల్లా వాలీబాల్ సంఘం ప్రతినిధి చెన్న వీరయ్య, కౌన్సిలర్లు రామ్, సాదతుల్లా హుస్సేనితోపాటు మీర్ అర్షద్అలీ, ఇలియాజ్, ఖాలెద్‌అలీ, ఖలీల్, సుబాన్‌జీ, ముకర్రం తదితరులు పాల్గొన్నారు. -
సెయింట్ జోసెఫ్ జట్ల జోరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రీజినల్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా నిర్వహిస్తోన్న బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో సెయింట్ జోసెఫ్ స్కూల్ జట్లు జోరు ప్రదర్శిస్తున్నాయి. హబ్సిగూడలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ వేదికగా శుక్రవారం ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ సెయింట్ జోసెఫ్ జట్లు విజయం సాధించాయి. జూనియర్ బాలుర కేటగిరీ తొలి మ్యాచ్‌లో సెయింట్ జోసెఫ్ (కింగ్‌కోఠి) 18–6తో సుజాత పబ్లిక్ స్కూల్‌పై గెలిచింది. రెండో మ్యాచ్‌లో సెయింట్ జోసెఫ్ (మలక్‌పేట్) 24–12తో ఇండియన్ బ్లోసమ్స్పై, తర్వాతి మ్యాచ్‌లో సెయింట్ జోసెఫ్ (మలక్‌పేట్) 27–14తో గీతాంజలి (బేగంపేట్) జట్లపైన విజయం సాధించాయి. సీనియర్ బాలుర విభాగంలో సెయింట్ జోసెఫ్ (కింగ్‌కోఠి) 29–3తో హెరిటేజ్ వ్యాలీని ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో హెచ్‌పీఎస్ (బేగంపేట్) 18–11తో సెయింట్ జార్జిస్ గ్రామర్ స్కూల్‌పై, ఫ్యూచర్ కిడ్స్ 41–26తో జాన్సన్ గ్రామర్ స్కూల్‌పై విజయం సాధించాయి. ఇతర జూనియర్ బాలుర మ్యాచ్‌ల్లో జాన్సన్ స్కూల్ 67–13తో ఫ్యూచర్ కిడ్స్ (రాజమండ్రి)పై, లయోలా పబ్లిక్ స్కూల్ (గుంటూరు) 19–4తో నాసర్ స్కూల్‌పై, ఫ్యూచర్ కిడ్స్ 16–13తో ఇంటర్నేషనల్ స్కూల్ (షేక్‌పేట్)పై, లిటిల్ ఫ్లవర్ (గుంటూరు) 16–10తో ఎస్డీ నూజివీడుపై గెలుపొందాయి. -
బెంచ్ వార్మర్స్కు రెండో విజయం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా వార్షిక సూపర్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో కస్టమ్స్ జీఎస్టీ, బెంచ్ వార్మర్స్ ‘బి’ జట్లు వరుసగా రెండో విజయాన్ని సాధించాయి. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో కస్టమ్స్ జీఎస్టీ 83–46తో సికింద్రాబాద్ క్లబ్‌పై ఘనవిజయం సాధించింది. విజేత జట్టులో విజయ్ కుమార్ (20), బిట్టు (19) ఆకట్టుకున్నారు. సికింద్రాబాద్ జట్టులో అమన్ (16), త్రిభువన్ (12), అనిరుధ్ (10) పోరాడారు. మరో మ్యాచ్‌లో బెంచ్ వార్మర్స్ ‘బి’ జట్టు 41–40తో ఎస్బీఐ జట్టుపై గెలుపొందింది. బెంచ్ వార్మర్స్ తరఫున శ్రీకాంత్ (13), రోహిత్ (11) మెరుగ్గా ఆడారు. -
కృష్ణా యూనివర్సిటీ బాస్కెట్‌బాల్ జట్టు ఎంపిక
పటమట (ఆటోనగర్) : కృష్ణా విశ్వవిద్యాలయం బాస్కెట్ బాల్ జట్టు ఎంపికైంది. ఇటీవల యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల జట్ల మధ్య జరిగిన బాస్కెట్ బాల్ టోర్నీలో ప్రతిభచాటిన క్రీడాకారులతో యూనివర్సిటీ జట్టు ఎంపిక గురువారం మారిస్ స్టెల్లా కళాశాల ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఈ పోటీలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కుల్రేఖ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ నల్లూరు శ్రీనివాసరావు, గౌరవ అతిథిగా ఆల్ ఇండియా బాస్కెట్ బాల్ గోల్డ్ మెడలిస్ట్ జి.ఎస్.సి.బోసు హాజరయ్యారు. మ్యారీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరిగిన కృష్ణా విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల బాస్కెట్ బాల్ టోర్నమెంట్లో సిద్ధార్ధ మహిళా కళాశాల మొదటి స్థానం, మ్యారీస్ స్టెల్లా కళాశాల రెండో స్థానం, కేబీఎన్ కాలేజీ మూడవ స్థానం, నున్న విజయ కాలేజీ నాలుగో స్థానంలో నిలిచాయి. ఎంపికైన జట్టు సిద్ధార్థ మహిళా కళాశాల నుంచి ఎస్.కె.ఎస్తేరు రాణి, ఎస్.దివ్యవల్లి, వి.ఎల్.భవ్య, చంద్రలేఖ, తారాబాయి, మ్యారిస్ స్టెల్లా కళాశాల నుంచి రూబి అమూల్య, మౌనిక, నిహారిక, కె.భానుశ్రీ , కేబీఎన్ కాలేజీ నుంచి వాణి, కల్యాణి, నున్న విజయ కళాశాల నుంచి శ్రీలక్ష్మి ఎంపియ్యారు. సెలెక్షన్ కమిటీ సభ్యులుగా ఆంధ్రా లయోల కళాశాల ఫిజికల్ లెక్చరర్ జె.వి.ఎన్.ప్రసాద్, నూజివీడు డీఏఆర్ కళాశాల మహమ్మద్ అంజాద్ ఆలీ వ్యవహరించారు. -
సెయింట్ మార్టిన్స్ క్లబ్ గెలుపు
క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ హైదరాబాద్: క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో జరిగిన హోరాహోరీ పోరులో సెయింట్ మార్టిన్స్ క్లబ్ జట్టు పాయింట్ తేడాతో గట్టెక్కింది. సిటీ కాలేజి గ్రౌండ్స్‌లో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సెయింట్ మార్టిన్స్ 33-32తో నిజామ్ బాస్కెట్‌బాల్ అకాడమీ(ఎన్బీఏ)పై గెలిచింది. మార్టిన్స్ జట్టులో అఖిల్ (10), విశాల్ (8) రాణించగా, ఎన్బీఏ జట్టు తరఫున డుజాన్ 10, శ్రీకాంత్ 9 పాయింట్లు చేశారు. మరో మ్యాచ్‌లో బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ ‘బి’ జట్టు 35-30తో రాజేంద్రనగర్ బాస్కెట్‌బాల్ క్లబ్‌పై నెగ్గింది. బాయ్స్ స్పోర్ట్స్ జట్టులో అమన్ (12), సచిన్ (10) ఆకట్టుకున్నారు. రాజేంద్రనగర్ జట్టులో సలీమ్ (24) ఒంటరి పోరాటం చేశాడు. సికింద్రాబాద్ వైఎంసీఏ కోర్టులో జరిగిన మ్యాచ్‌లో నెహ్రూ నగర్ ప్లేగ్రౌండ్స్ 48-27తో స్టూడెంట్స్ స్పోర్ట్స్ క్లబ్‌పై గెలుపొందింది. నెహ్రూనగర్ జట్టు తరఫున విపుల్ 16, భరత్ 10 పాయింట్లు చేశారు. స్టూడెంట్స్ జట్టులో సాయికిరణ్ 11, గోపాల్, చరణ్ చెరో 8 పాయింట్లు చేశారు.