రేపు మేడారంలో మంత్రుల పర్యటన
=రూ. 100 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు
=అక్కడే ఏర్పాట్లపై సమీక్ష
=జిల్లా కలెక్టర్ కిషన్
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో రూ.100 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను శనివారం కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జాతర అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య, చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడారంలో పర్యటిస్తారని తెలిపారు.
అదేవిధంగా వివిధ శాఖలు చేపడుతున్న అభివృద్ధి పనులను సమీక్షిస్తారని వివరించారు. అనంతరం అమ్మవార్లను దర్శించుకుంటారని కలెక్టర్ అన్నారు. పస్రా నుంచి తాడ్వాయి వరకు సైడ్‌బర్మ్‌ల పనులు జనవరి 31నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. గోవిందరావుపేట మండ లం బుస్సాపురం నుంచిలక్నవరం సరస్సు వరకు రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపా రు. ఈ పనులు వేగంగా పూర్తి చేయాలని ఐటీడీఏ అధికారులకు సూచించారు. ఊరట్టం నుంచి మల్యాల రోడ్డును మరమ్మతు చేయాలని ఆదేశించారు.
ప్రధాన కూడళ్లలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు చేయాలన్నారు. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి నుంచి దొడ్ల వరకు ఐటీడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్డు పనులను పీఆర్‌కు అప్పగించాలని ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా సైడ్‌బర్మ్‌లు పటిష్టంగా నిర్మించాలని రూరల్ ఎస్సీ లేళ్ల కాళిదాసు సూచించారు. జేసీ పౌసుమిబసు, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు, ఏజేసీ సంజీవయ్య, ఐటీడీఏ పీఓ సర్ఫరాజ్ అహ్మద్, డీఆర్వో సురేంద్రరణ్, డీఎంహెచ్ఓ సాంబశివరావు, డీఆర్డీఏ పీడీ విజయ్‌గోపాల్, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, డ్వామా పీడీ హైమావతి, ట్రాన్స్‌కో ఎస్ఈ మోహన్‌రావు, ఈఓ రాజేశ్వర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.