Bathukamma 9 Food Varieties
-
Bathukamma: మక్క సత్తు ముద్దలు తిన్నారా? ఇలా చేసుకోండి! ఆరోగ్య ప్రయోజనాలివే!
బతుకమ్మ వేడుకల్లో భాగంగా ‘అమ్మ’కు వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ఇక బతుకమ్మ అంటేనే సత్తుపిండి ఘుమఘుమలు ఉండాల్సిందే! ఎక్కువగా పెసరపప్పు, నువ్వులు, పల్లీలతో సత్తుపిండిని తయారు చేసుకుంటారు. వీటితో పాటు మొక్కజొన్న గింజలతో చేసే సత్తు(మక్క సత్తు అని కూడా అంటారు)తో చేసిన ముద్దలు(లడ్డూలు) కూడా ఎంతో రుచికరంగా ఉంటాయి. మొక్కజొన్న గింజలు, బెల్లం లేదంటే చక్కెర.. నెయ్యి ఉంటే చాలు మక్క సత్తు ముద్దలు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకోండి ►ముందుగా మొక్కజొన్న గింజలు వేయించి.. చల్లారాక పొడి చేసుకోవాలి. ►అదే విధంగా బెల్లం తరుము లేదంటే పంచదారను పొడి చేసి పెట్టుకోవాలి. ►ఈ రెండింటి మిశ్రమంలో నెయ్యి వేసి ఉండలుగా చుట్టుకుంటే మక్క సత్తు ముద్దలు రెడీ. మొక్కజొన్నతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! ►మొక్కజొన్న వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ►దీనిలో విటమిన్- ఏ, విటమిన్- బీ, సీ ఎక్కువ. ►మొక్కజొన్నలోని బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ►ఇందులో విటమిన్ బీ12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలం. ఇవి ఎర్రరక్త కణాల ఉత్పత్తికి తోడ్పడి.. రక్తహీనతను నివారించేందుకు దోహదపడతాయి. ఫోలిక్ యాసిడ్ గర్భవతులకు మేలు చేస్తుంది. చదవండి: Malida Muddalu: మలీద ముద్దల తయారీ విధానం! వీటిని తింటే ఇన్ని ఆరోగ్య లాభాలా?! -
Bathukamma: మలీద ముద్దల తయారీ విధానం! వీటిని తింటే ఇన్ని ఆరోగ్య లాభాలా?!
బతుకమ్మ వేడుకల్లో భాగంగా తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలు తయారు చేస్తారు. ఈ ప్రసాదాల్లో మలీద ముద్దలు మరింత ప్రత్యేకం. మరి మలీద ముద్దలు ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం! సాధారణంగా రొట్టె, బెల్లం లేదా చక్కెర కలిపి మలీద ముద్దలు తయారు చేస్తారు. ఆరోగ్య ప్రయోజనాలు మరింతగా పెంచేందుకు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటారు. కావాల్సిన పదార్థాలు ►గోధుమ పిండి- కప్పు ►కాజూ(జీడిపప్పు)- 10 గ్రాములు ►పిస్తా- 10 గ్రాములు ►బాదం- 10 గ్రాములు ►సోంపు పొడి- అర టీస్పూను ►యాలకుల పొడి- అర టీస్పూను ►కట్ చేసిన ఖర్జూరాలు- ఆరు ►బెల్లం- ఒక కప్పు ►నెయ్యి- రెండు టేబుల్ స్పూన్లు మలీద ముద్దల తయారీ విధానం ►చపాతీ పిండి కలుపుకొని 15 నిముషాలు పక్కన పెట్టుకోవాలి. పిండి మరీ మెత్తగా లేదంటే గట్టిగా కాకుండా చూసుకోవాలి. ►తర్వాత చపాతీలు ఒత్తుకోవాలి ►నెయ్యితో రొట్టెలను రెండు వైపులా కాల్చుకోవాలి. ►చల్లారిన తర్వాత ముక్కలు చేసి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ►అదే విధంగా.. ముందుగా తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్(కాజూ, పిస్తా, బాదం, ఖర్జూరాలు)ను పొడి చేసుకోవాలి. ►తర్వాత ఒక పాత్ర తీసుకుని అందులో రెట్టెల మిశ్రమం, డ్రై ఫ్రూట్స్ పొడి, సోంపు పొడి, యాలకుల పొడి, బెల్లం , నెయ్యి వేసి కలపాలి. ►ఈ మిశ్రమాన్ని ముద్దలుగా కట్టాలి. అంతే మలీద ముద్దలు రెడీ. ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ►సాధారణంగా రొట్టెలు కూరలు లేదంటే పప్పుతో కలిపి తింటారు. రొటీన్‌గా కాకుండా ఇలా చపాతీలతో స్వీట్ చేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. ►ఇక ఇందులో వేసే కాజూ, పిస్తా, బాదం, ఖర్జూరాల ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాజూలో ఆరోగ్యానికి మేలు చేసే మోనోసాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. ►పిస్తా తినడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. ఇందులోని కెరోటినాయిడ్లు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ►ఖర్జూరాలు శరీరానికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. వీటన్నింటినీ కలిపి తయారు చేసిన మలీద ముద్దలు తింటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. -
Bathukamma: పండుగ వేళ తొమ్మిది రకాల నైవేద్యాలు.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో!
పూలనే దేవతారూపంగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ పూల పండుగ అంటే కేవలం ఆటపాటలే కాదు.. ఘుమఘుమలాడే పిండి వంటలు కూడా గుర్తుకువస్తాయి. బతుకమ్మ ఆటా.. పాటా మానసికోల్లాసాన్ని ఇస్తే.. ఇంటి తిరిగి వెళ్లే వేళ ఇచ్చిపుచ్చుకునే వాయినాలు.. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తొమ్మిది రోజులు చేసే తొమ్మిది రకాల ప్రసాదాలు పోషక విలువలు కలిగి ఉంటాయి. ఐరన్ పుష్కలం సాధారణంగా మహిళలు, పిల్లల్లో ఐరన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. బతుకమ్మ సమయంలో తయారు చేసే సద్దిలో ఐరన్ శాతం ఎక్కువ. నువ్వులు, పల్లీలు, కొబ్బరి పొడి, సత్తుపిండి, పెసర ముద్దలు... ఇలా చిరుధానాల్యతో కూడిన వంటకాలు తింటే ఆరోగ్యకరమని పెద్దల మాట. నువ్వుల ముద్దలు నువ్వుల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బతుకమ్మ పండుగ వేళ వీటితో పొడి చేస్తారు. శరీరానికి ముఖ్యమైన అమైనోయాసిడ్స్ నువ్వుల్లో పుష్కలం. ఇక వీటిలో జింక్, కాల్షియం, పొటాషియం కూడా ఎక్కువే. మొదడును చురుకుగా ఉంచడంలో జింక్ కీలక పాత్ర పోషిస్తే.. కాల్షియం ఎమకల ధృడత్వాన్ని దోహదం చేస్తుంది. సత్తు పిండి బతుకమ్మ వేడుకల్లో మొదటి రోజు సాధారణంగా ఆకువక్కలు, తులసీదళాలు, దానిమ్మగింజలు, శనగపప్పు, పెసరపప్పు, నువ్వులు, మొక్కజొన్న గింజల సత్తు పిండిని తయారు చేసుకుంటారు. దీనిలో పీచు ఎక్కువగా ఉంటుంది. కార్బొహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. కాగా పీచు పదార్థాల వల్ల మలబద్దకం దూరమవుతుంది. ఇక రెండోరోజు పప్పు బెల్లం, రేగు పండ్లు, మూడో రోజు పూర్ణాలు, నాల్గోరోజు బెల్లం బియ్యం, ఐదో రోజు అట్లు, ఎనిమిదో రోజు నువ్వులు, బెల్లం కలిపిన వెన్న ముద్దలు, తొ మ్మిదోరోజు బియ్యం పిండి, గోధుమపిండి, బెల్లంతో మలీద ముద్దలు చేసుకుంటారు. వీటిలోనూ ఆరోగ్యానికి దోహదం చేసే కారకాలు ఎక్కువే. పెసర ముద్దలు పెసర్లను ఉడకబెట్టి అందులో బెల్లం కలిపి ముద్దలుగా చేస్తారు. ఇది జీర్ణశక్తిని పెంచడంతోపాటు జీర్ణ సంబంధిత వ్యాధులనూ తగ్గిస్తుంది. కొబ్బరి పొడి కొబ్బరిలో ప్రొటీన్లు అధికం. మహిళల ఆరోగ్యానికి కొబ్బరి పొడి చాలా ఉపయోగపడుతుంది. పెరుగన్నం, పులిహోర... పెరుగన్నంలో పల్లీలు, వివిధ రకాల ధాన్యాలను కలుపుతారు. చింతపండు లేదా నిమ్మరసంతో చేసిన పులిహోర ప్రసాదం తయారు చేసుకుంటారు. చిన్న గాయాల నుంచి క్యాన్సర్ వరకు పసుపు విరుగుడుగా పని చేస్తుంది. చింతపండు గుజ్జులో విటమిన్ ‘సి’ అత్యధిక. పంచామృతాల్లో పెరుగు ఒకటి. ఇందులో పోషక విలువలు మెండు. దీంతో అన్నం కలిపి నైవేద్యం చేస్తారు. దీనిలో ప్రొటీన్, కాల్షియం, విటమిన్ బీ6, బీ12 వంటివి ఎక్కువగా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉండే పెరుగులో లాక్‌లో బాసిల్లై అధికంగా ఉంటుంది. పల్లి పిండి పల్లి పిండి శరీర ఎదుగుదలకు దోహదం చేస్తుంది. ప్రోటీన్లు ఎక్కువ. అంతేకాదు నోటికి రుచికరంగా ఉండడంతో చాలా మంది దీనిని ఇష్టపడతారు. ఇక పల్లి పొడికి బెల్లం కలిపి తింటే మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. -
Bathukamma: బతుకమ్మ.. తొమ్మిది రోజులు.. తొమ్మిది నైవేద్యాలు ఇవే!
Bathukamma 2022- 9 Days- 9 Food Varieties: బతుకమ్మ పండుగ అంటేనే సంతోషాలు.. సంబరాలు.. పూలను ఆరాధించే ఈ అపురూప పండుగ సందర్భంగా రకరకాల ప్రసాదాలు, పిండి వంటకాలు, రుచికరమైన చిరుతిండ్లు తయారు చేస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ఏ ఇంట్లో చూసినా ఘుమగఘుమలు గుబాళిస్తాయి. ముఖ్యంగా పల్లెల్లో అయితే పోటా పోటీగా భిన్న రుచులను తయారు చేసి మరీ వడ్డిస్తారు. ఇంట్లో చేసుకున్న ఏ వంటకమయినా.. మరో నలుగురికి పంచి వారితో తినిపించడం బతుకమ్మ పండుగలో కనిపించే సంతోషకరమైన సన్నివేశం. తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరంలో కనిపించే ముఖ్యమైన ప్రసాదాలు ఇవి. ఎంగిలిపూల బతుకమ్మ.. బతుకమ్మ మొదటి రోజు పెతర అమావాస్య నాడు జరుపుకొంటారు. ఆరోజు నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. పండుగకు ముందు ఆయా పుష్పాలన్నీ వివిధ కీటకాల పరాగ సంపర్కం కారణంగా ఎంగిలి పడ్డాయని తలచి మొదటి రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మగా వ్యవహరిస్తారు. ఆరోజు నువ్వుల సద్దిని అందరితో పంచుకుంటారు. అటుకుల బతుకమ్మ.. రెండో రోజు అటుకుల ప్రసాదం చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు కలిపి అమ్మవారికి ఇష్టంగా వడ్డించే నైవేద్యం ఇది. ముద్దపప్పు బతుకమ్మ.. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్ద పప్పు, పాలు, బెల్లంతో వేడివేడిగా నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. నానబియ్యం బతుకమ్మ.. నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ. నాన బెట్టిన బియ్యంను పాలు, బెల్లంతో కలిపి ఉడికింది ప్రసాదంగా తయారు చేస్తారు. అట్ల బతుకమ్మ.. ఐదోరోజు అట్ల బతుకమ్మ. అట్లు లేదా దోశలను అమ్మవారికి నైవేద్యంగా వడ్డిస్తారు. అలిగిన బతుకమ్మ ఆరో రోజు అలిగిన బతుకమ్మగా జరుపుకొంటారు. ఆరోజు అమ్మవారికి అలకగా చెప్పుకుంటారు. ఉపవాసం పాటిస్తారు వేపకాయల బతుకమ్మ.. ఏడోరోజు వేపకాయల బతుకమ్మ. బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారుచేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. వెన్నెముద్దల బతుకమ్మ.. ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి వెన్నముద్దల నైవేద్యంగా వడ్డిస్తారు. సద్దుల బతుకమ్మ.. బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజును సద్దుల బతుకమ్మగా జరుపుకొంటారు. తొమ్మిదోరోజు పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు. మలీద ముద్దలు ఇవి కాక.. రొట్టె, బెల్లం లేదా చక్కెర కలిపి మలీద ముద్దలను తయారు చేసి అందరికీ పంచుతారు. దీనిని గోధుమ పిండి, డ్రై ఫ్రూట్స్, బెల్లం, పాలు, నెయ్యితో కలిపి తయారు చేస్తారు. దీంతో పాటు రకరకాల పొడులు పెసరపొట్టు, బియ్యం పిండి, కంది పిండికి కావాల్సినంత బెల్లం, చక్కర కలిపి నెయ్యితో పొడులు తయారు చేస్తారు. చదవండి: Bathukamma 2022: బతుకమ్మ పండుగ.. నేపథ్యం గురించి తెలుసా? Bathukamma: పండగ వెనుక ఎన్ని కథలున్నా.. బతుకమ్మ ప్రత్యేకత ఇదే