Bathukamma 2022- 9 Days- 9 Food Varieties: బతుకమ్మ పండుగ అంటేనే సంతోషాలు.. సంబరాలు.. పూలను ఆరాధించే ఈ అపురూప పండుగ సందర్భంగా రకరకాల ప్రసాదాలు, పిండి వంటకాలు, రుచికరమైన చిరుతిండ్లు తయారు చేస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ఏ ఇంట్లో చూసినా ఘుమగఘుమలు గుబాళిస్తాయి.
ముఖ్యంగా పల్లెల్లో అయితే పోటా పోటీగా భిన్న రుచులను తయారు చేసి మరీ వడ్డిస్తారు. ఇంట్లో చేసుకున్న ఏ వంటకమయినా.. మరో నలుగురికి పంచి వారితో తినిపించడం బతుకమ్మ పండుగలో కనిపించే సంతోషకరమైన సన్నివేశం. తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరంలో కనిపించే ముఖ్యమైన ప్రసాదాలు ఇవి.
ఎంగిలిపూల బతుకమ్మ..
బతుకమ్మ మొదటి రోజు పెతర అమావాస్య నాడు జరుపుకొంటారు. ఆరోజు నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. పండుగకు ముందు ఆయా పుష్పాలన్నీ వివిధ కీటకాల పరాగ సంపర్కం కారణంగా ఎంగిలి పడ్డాయని తలచి మొదటి రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మగా వ్యవహరిస్తారు. ఆరోజు నువ్వుల సద్దిని అందరితో పంచుకుంటారు.
అటుకుల బతుకమ్మ..
రెండో రోజు అటుకుల ప్రసాదం చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు కలిపి అమ్మవారికి ఇష్టంగా వడ్డించే నైవేద్యం ఇది.
ముద్దపప్పు బతుకమ్మ..
మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్ద పప్పు, పాలు, బెల్లంతో వేడివేడిగా నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
నానబియ్యం బతుకమ్మ..
నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ. నాన బెట్టిన బియ్యంను పాలు, బెల్లంతో కలిపి ఉడికింది ప్రసాదంగా తయారు చేస్తారు.
అట్ల బతుకమ్మ..
ఐదోరోజు అట్ల బతుకమ్మ. అట్లు లేదా దోశలను అమ్మవారికి నైవేద్యంగా వడ్డిస్తారు.
అలిగిన బతుకమ్మ
ఆరో రోజు అలిగిన బతుకమ్మగా జరుపుకొంటారు. ఆరోజు అమ్మవారికి అలకగా చెప్పుకుంటారు. ఉపవాసం పాటిస్తారు
వేపకాయల బతుకమ్మ..
ఏడోరోజు వేపకాయల బతుకమ్మ. బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారుచేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
వెన్నెముద్దల బతుకమ్మ..
ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి వెన్నముద్దల నైవేద్యంగా వడ్డిస్తారు.
సద్దుల బతుకమ్మ..
బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజును సద్దుల బతుకమ్మగా జరుపుకొంటారు. తొమ్మిదోరోజు పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు.
మలీద ముద్దలు
ఇవి కాక.. రొట్టె, బెల్లం లేదా చక్కెర కలిపి మలీద ముద్దలను తయారు చేసి అందరికీ పంచుతారు. దీనిని గోధుమ పిండి, డ్రై ఫ్రూట్స్, బెల్లం, పాలు, నెయ్యితో కలిపి తయారు చేస్తారు. దీంతో పాటు రకరకాల పొడులు పెసరపొట్టు, బియ్యం పిండి, కంది పిండికి కావాల్సినంత బెల్లం, చక్కర కలిపి నెయ్యితో పొడులు తయారు చేస్తారు.
చదవండి: Bathukamma 2022: బతుకమ్మ పండుగ.. నేపథ్యం గురించి తెలుసా?
Bathukamma: పండగ వెనుక ఎన్ని కథలున్నా.. బతుకమ్మ ప్రత్యేకత ఇదే
Comments
Please login to add a commentAdd a comment