
పండుగలేమైనా... సంస్కృతి సంప్రదాయాలను చాటి చెబుతాయి. కానీ... వాటితో పాటుగా వారసత్వాన్ని కూడా చాటే ఏకైక పండుగ బతుకమ్మ. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక బతుకమ్మ. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి చిహ్నం బతుకమ్మ. ప్రజల బతుకులోంచి పుట్టిన పండుగ బతుకమ్మ. అసలు బతుకమ్మ పండుగలో పువ్వులకు, నైవేద్యానికి ఎంత ప్రాధాన్యత ఉందో... ఆట పాటలకు అంతటి ప్రాధాన్యత ఉంది.
బతుకమ్మ పండుగ సమయానికి తెలంగాణలో వ్యవసాయ పనులు చురుగ్గా ఉండవు. పల్లె జనానికి ఇది కాస్త తీరిక సమయం. మరోవైపు పంటలు, చెట్లు, పూలతో ప్రకృతి అంతా కళకళలాడుతూ ఉంటుంది. అందుకే ఈ పండుగ బొడ్డెమ్మతో మొదలవుతుంది. బతుకమ్మతో ముగుస్తుంది.
తెలంగాణలోని ప్రతి ఆడపడుచు... ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే పండుగ బతుకమ్మ. రంగు రంగుల పూలతో ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ. ఆడపిల్లలను బతుకు అమ్మ ... అని మనసారా ఆశీర్వదించే పండుగ బతుకమ్మ. ఎక్కడైనా చూడండి.. బతుకమ్మ ఆడారా? అని అడుగుతారు కానీ.. బతుకమ్మ చేశారా అనరు. ఎందుకంటే ...ఇది నృత్య ప్రధానమైన పండుగ. గాన ప్రధానమైన పండుగ.
చదవండి: Bathukamma 2022: బతుకమ్మ పండుగ.. నేపథ్యం గురించి తెలుసా?