Batmenten
-
ఎదురులేని సింధు
గ్వాంగ్జౌ (చైనా): సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు తన జోరు కొనసాగిస్తోంది. వరుసగా మూడు విజయాలు సాధించి సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్న సింధు లీగ్ దశను అజేయంగా ముగించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో సింధు 21–9, 21–15తో ప్రపంచ 12వ ర్యాంకర్ బీవెన్ జాంగ్ (అమెరికా)పై గెలుపొందింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా తై జు యింగ్‌తో జరిగిన మ్యాచ్‌లో అకానె యామగుచి 21–18, 11–12తో గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గాయం కారణంగా తై జు యింగ్ రెండో గేమ్ మధ్యలో వైదొలగడంతో యామగుచిని విజేతగా ప్రకటించారు. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)తో సింధు; నొజోమి ఒకుహారా (జపాన్)తో అకానె యామగుచి తలపడతారు. పురుషుల సింగిల్స్‌లో భారత యువతార సమీర్ వర్మ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో సమీర్ వర్మ 21–9, 21–18తో కాంతపోన్ వాంగ్‌చరోయెన్ (థాయ్‌లాండ్)పై నెగ్గాడు. ఇదే గ్రూప్‌లోని మరో మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) 21–14, 21–8తో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై గెలిచి గ్రూప్ టాపర్‌గా నిలిచాడు. రెండు విజయాలు సాధించిన సమీర్ వర్మ రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో షి యుకి (చైనా)తో సమీర్ వర్మ; సన్ వాన్ హో (దక్షిణ కొరియా)తో కెంటో మొమోటా ఆడతారు. -
సింధు శుభారంభం
అగ్వాంగ్‌జౌ (చైనా): సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పూసర్ల వెంకట (పీవీ) సింధు తొలి అడుగు విజయవంతంగా వేసింది. ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచితో జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో సింధు 24–22, 21–15తో విజయం సాధించి శుభారంభం చేసింది. ఓవరాల్‌గా యామగుచిపై సింధుకిది పదో విజయం కావడం విశేషం. 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు కీలకదశలో పైచేయి సాధించి అనుకున్న ఫలితాన్ని సాధించింది. 27 నిమిషాలపాటు జరిగిన తొలి గేమ్‌లో ఒకదశలో సింధు 6–11తో వెనుకంజలో ఉంది. అయితే యామగుచి ఆటతీరుపై మంచి అవగాహన ఉన్న ఈ హైదరాబాద్ అమ్మాయి నెమ్మదిగా పుంజుకుంది. వరుసగా పాయింట్లు సాధిస్తూ కళ్లు చెదిరే స్మాష్ షాట్లతో స్కోరును 19–19తో సమం చేసింది. ఆ తర్వాత పలుమార్లు స్కోర్లు సమమయ్యాయి. 23–22 స్కోరు వద్ద యామగుచి కొట్టిన ఫోర్‌హ్యాండ్ రిటర్న్ నెట్‌కు తగలడంతో తొలి గేమ్ సింధు వశమైంది. రెండో గేమ్‌లో ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం పోరాడారు. విరామానికి సింధు 11–10తో ఒక పాయింట్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఒక పాయింట్ కోల్పోయి... మూడు పాయింట్లు గెలిచిన ఆమె 14–11తో ముందంజ వేసింది. ఇదే జోరులో సింధు 20–15తో ఆధిక్యంలోకి వెళ్లింది. యామగుచి కొట్టిన మరో షాట్ నెట్‌కు తగలడంతో సింధు రెండో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. గురువారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో తై జు యింగ్‌తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత యువతార సమీర్ వర్మకు నిరాశ ఎదురైంది. ప్రపంచ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్)తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో సమీర్ 18–21, 6–21తో ఓడిపోయాడు. గురువారం జరిగే మరో మ్యాచ్‌లో టామీ సుగియార్తో (ఇండోనేసియా)తో సమీర్ ఆడతాడు. -
కాంస్యంతో సరి
ప్రపంచ జూనియర్ చాంపియన్ షిప్లో పురుషుల సింగిల్స్‌లో పతకం గెలిచిన ఆరో భారతీయ ప్లేయర్‌గా లక్ష్యసేన్ గుర్తింపు పొందాడు. గతంలో సమీర్ వర్మ (2011లో), సాయిప్రణీత్ (2010లో), ప్రణయ్ (2010లో), గురుసాయిదత్ (2008లో) కాంస్య పతకాలు నెగ్గగా... సిరిల్ వర్మ (2015లో) రజత పతకం సాధించాడు. జూనియర్ మహిళల సింగిల్స్‌లో మాత్రం సైనా స్వర్ణం (2008లో), కాంస్యం (2006లో) గెల్చుకుంది. మార్క్‌హామ్ (కెనడా): భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ లక్ష్య సేన్ కీలక పోరులో తడబడ్డాడు. ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన అండర్–19 పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఆసియా జూనియర్ చాంపియన్ లక్ష్య సేన్ 22–20, 16–21, 13–21తో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను నెగ్గిన లక్ష్య సేన్ రెండో గేమ్‌లో గతి తప్పాడు. ఈ ఏడాది ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ ఫైనల్లో కున్లావుత్‌ను ఓడించిన లక్ష్య సేన్ ఈసారి మాత్రం అదే ఫలితాన్ని పునరావృతం చేయడంలో సఫలం కాలేదు. రెండో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచిన కున్లావుత్ నిర్ణాయక మూడో గేమ్‌లో మరింత జోరు పెంచగా... లక్ష్య సేన్ ప్రత్యర్థికి సరైన సమాధానం ఇవ్వలేక పోయాడు. ఈ గెలుపుతో ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ ఫైనల్లో లక్ష్య సేన్ చేతిలో ఎదురైన ఓటమికి కున్లావుత్ బదులు తీర్చుకున్నాడు. ‘నేను సహజశైలిలో ఆడలేకపోయాను. తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నా ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయాను. రెండో గేమ్ నుంచి కున్లావుత్‌కు సరైన పోటీనివ్వలేకపోయాను’ అని ఉత్తరాఖండ్‌కు చెందిన 17 ఏళ్ల లక్ష్య సేన్ వ్యాఖ్యానించాడు. -
మెయిన్ ‘డ్రా’కు కశ్యప్ అర్హత
కౌలూన్ (హాంకాంగ్): కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్ హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో కశ్యప్ 21–7, 12–21, 21–18తో టాప్ సీడ్ సు జెన్ హావో (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో ఇస్కందర్ జుల్కర్నైన్ (మలేసియా) నుంచి కశ్యప్‌నకు వాకోవర్ లభించింది. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 21–16, 19–21, 21–14తో వాంగ్‌చి లిన్–లి చియా సిన్ (చైనీస్ తైపీ) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సుపన్యు అవింగ్‌సనోన్ (థాయ్‌లాండ్)తో సమీర్ వర్మ; ఖోసిత్ ఫెత్రాదబ్ (థాయ్‌లాండ్)తో సాయిప్రణీత్; వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)తో కిడాంబి శ్రీకాంత్; ఆండర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో ప్రణయ్; ఆంథోని గిన్టింగ్ (ఇండోనేసియా)తో కశ్యప్ తలపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో అకానె యామగుచి (జపాన్)తో సైనా నెహ్వాల్; నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్)తో పీవీ సింధు ఆడతారు. -
బ్యాడ్మింటన్‌లో ‘ఎస్ఆర్బీజీఎన్ఆర్’ సత్తా
ఖమ్మం స్పోర్ట్స్: కాకతీయ యూనివర్సిటీ (కేయూ) స్థాయిలో ఈనెల 23, 24వ తేదీల్లో వరంగల్‌లో జరిగిన మొదటి విడత క్రీడల్లో ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల క్రీడాకారులు బ్యాడ్మింటన్ విభాగంలో సత్తా చాటారు. యూనివర్సిటీ టీం చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ నైపుణ్యాన్ని ప్రదర్శించిన ఆదిత్య బాపినిడు, వినయ్, ఫణీంద్ర, వరప్రసాద్‌లు జట్టును గెలిపించారు. యూనివర్సిటీ జట్టుకు అదిత్య బాపినిడు, వినయ్, ఫణీంద్ర ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యు.వీరభద్రం, పీడీ డాక్టర్ పి.రఘునందన్ తెలిపారు. వీరు అక్టోబర్ 3వ తేదీ నుంచి తమిళనాడు రాష్ట్రం మధురై కామరాజ్ యూనివర్సిటీ నిర్వహించే సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ పోటీల్లో ఆడతారని వివరించారు. సత్తా చాటిన విద్యార్థులను ప్రిన్సిపాల్, పీడీ, అధ్యాపకులు అభినందించారు. -
ఖమ్మంలో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
క్వాలీఫయింగ్ టోర్నీకి విశేష స్పందన ఖమ్మంస్పోర్ట్స్: జిల్లా కేంద్రం ఖమ్మంలోని స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో గురువారం (నేటి) నుంచి రాష్ట్రస్థాయి అండర్–13, 15 బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించనున్నారు. జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సాగే ఈ పోటీలకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పోటీలను నాకౌట్ పద్ధతిలో నిర్వహించనున్నారు. బుధవారం ఇక్కడి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన క్వాలీఫయింగ్ పోటీలకు మంచి స్పందన లభించింది. బాలురు 150మంది, బాలికలు 50మంది హాజరై ప్రతిభ చాటారు. వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్, మెదక్ జిల్లాల నుంచి తరలివచ్చారు. క్వాలీఫయింగ్ పోటీలను జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సీనియర్ ప్రతినిధి డాక్టర్ వి.సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షులు కాటమనేని రమేష్, కార్యదర్శి బాలసాని ఆనంద్, కోశాధికారి కె.శ్రీధర్‌రెడ్డి, మాజీ కార్యదర్శులు పాటిబండ్ల యుగంధర్, నల్లమోతు రఘు, నల్లమోతు వెంకటేశ్వర్లు, ఉప్పల్‌రెడ్డి, డాక్టర్ కె.సావిత్రి పాల్గొన్నారు.