వందేళ్లు పనిచేసే అణువిద్యుత్ బ్యాటరీ
సాక్షి, న్యూఢిల్లీ : సాధారణ సంప్రదాయ కెమికల్ బ్యాటరీ కన్నా పదింతలు అధిక విద్యుత్ ఇవ్వడమే కాకుండా నూరేళ్లపాటు చార్జింగ్ చేయాల్సిన అవసరం లేని అణు విద్యుత్ బ్యాటరీని రష్యా శాస్త్రవేత్తలు తయారు చేశారు. గుండె కొట్టుకోవడానికి అమర్చుకునే పేస్ మేకర్ నుంచి అంగారక గ్రహానికి వెళ్లే వాహనంలో ఉపయోగించుకునేందుకు కూడా ఇది ఎంతో అనువుగా ఉంటుంది. అణు విద్యుత్ బ్యాటరీ ఓ జీవితకాలం పని చేస్తుంది కనుక పేస్‌మేకర్‌ను ఒకసారి అమర్చుకుంటే చాలు, మళ్లీ దాన్ని చార్జి చేసుకోవాల్సిన అవసరమే రాదు.
అణు విద్యుత్ ప్రొటోటైప్ తయారీలో సెమీకండక్టర్గా తాము వజ్రాన్ని, రేడియో యాక్టివ్ కెమికల్‌ను ఉపయోగించినట్లు మాస్కోలోని ‘టెక్నాలాజికల్ ఇనిస్టిట్యూట్ ఫర్ సూపర్ హార్డ్ అండ్ నావల్ కార్బన్ మెటీరియల్స్’కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులో బీటా రేడియేషన్ ఉండడం వల్ల దాన్ని మానవ శరీరం లోపల ఉపయోగించి ఎలాంటి ప్రమాదం లేదని వారు చెప్పారు.
అణు విద్యుత్ బ్యాటరీని తయారు చేయడం ఇదే మొదటిసారి కాదని, ఇంతకుముందు తయారు చేసినవి సైజులో చాలా పెద్దవని, మొట్టమొదటిసారిగా అతి చిన్న బ్యాటరీని తయారు చేయడంలో విజయం సాధించామని శాస్త్రవేత్తలు తెలిపారు. తాము తయారు చేసిన ఈ బ్యాటరీ పరిజ్ఞానం కూడా నాసా శాస్త్రవేత్తలకు ఉపయోగపడుతుందని వారు అన్నారు.
అంగారక గ్రహంలో ఏర్పాటు చేయనున్న మానవ కాలనీలకు కొన్నేళ్లపాటు విద్యుత్‌ను అందించేందుకుగాకు నాసా ఇప్పుటికే ‘కిలో పవర్’ అణు విద్యుత్ రియాక్టర్‌ను తయారు చేస్తోంది.