Bauxite supply
-
జీవో-97 మాటేమిటి?
* బాక్సైట్‌పై ప్రకటనలో ప్రస్తావించని సీఎం * చంద్రబాబు వైఖరిపై న్యాయనిపుణుల సందేహాలు * ఉద్దేశపూర్వకంగానే జీవో-97 రద్దు చేయలేదని విశ్లేషణ * జీవో-222 రద్దు చేసినందువల్ల ప్రయోజనం ఉండదని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: బాక్సైట్ సరఫరాకు సంబంధించి ఏపీఎండీసీ-అన్‌రాక్ మధ్య జీవో-222, ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాక్సైట్ తవ్వకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ తన ప్రభుత్వం జారీ చేసిన జీవో-97 గురించి మాట మాత్రం కూడా ప్రస్తావించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గిరిజనులు డిమాండ్లు చేస్తున్నట్లు బాక్సైట్ తవ్వకాలను పూర్తిగా ఆపివేయాలంటే జీవో-97ను రద్దు చేయాల్సిందే. దానిని అలాగే ఉంచి జీవో-222, ఒప్పందాలను రద్దు చేయడంవల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. వీటిని రద్దు చేస్తూ టీడీపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసిన తక్షణమే అన్‌రాక్ సంస్థ కోర్టును ఆశ్రయిస్తుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ సంస్థ ఇప్పటికే రూ.5,300 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వమే శ్వేతపత్రంలో అంగీకరించిన నేపథ్యంలో కోర్టులో కూడా ఆ సంస్థకు అనుకూలంగానే తీర్పు వస్తుందని స్పష్టంచేస్తున్నారు. ఈ విషయం చంద్రబాబుకు స్పష్టంగా తెలిసినప్పటికీ, ఉద్దేశపూర్వకంగానే జీవో-97ను రద్దు చేయకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. తాను జీవో రద్దు చేసినా కోర్టు అనుమతించిందని తప్పించుకునే వ్యూహంలో భాగంగానే ముఖ్యమంత్రి కేవలం జీవో-222 మాత్రమే రద్దు చేశారని వారు అభిప్రాయపడ్డారు. గతంలో ఎస్సీ వర్గీకరణ విషయంలోనూ ఆయన ఇలానే కోర్టు మాటున దాక్కున్నారని గుర్తుచేస్తున్నారు. అధికారులు కూడా అదే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ‘మైనింగ్ లీజులు, ఖనిజ తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ భూమి బదలాయింపు జీవో 97 రద్దు చేయకుండా ఒప్పందాలు మాత్రమే రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారంటే లోపాయికారీ ప్రయత్నాలున్నట్లు స్పష్టమవుతోంది’ అని ఒక ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు. 2000 సంవత్సరంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బాక్సైట్ తవ్వకాలపై ఆలోచన చేశానని, రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదను ఖచ్చితంగా వినియోగించుకుంటామని శాసనసభలో ఆయన చేసిన వ్యాఖ్యలే బాక్సైట్ తవ్వకాలపై ఆయన వైఖరికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం తీరుపై గిరిజనుల ఆగ్రహం... విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి, జెర్రెల బ్లాకుల్లో 3,030 ఎకరాల అభయారణ్యాన్ని బాక్సైట్ తవ్వకాలకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి బదలాయిస్తూ టీడీపీ సర్కారు గత నెల అయిదో తేదీన జీవో-97 జారీ చేయడానికి నిరసనగా గిరిజనులు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం ఈ జీవోను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు ప్రకటించారు. ఈ జీవో సంబంధిత మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి తెలియకుండా జారీ అయినందున ప్రభుత్వం దీనిని నిలుపుదల చేసిందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా చెప్పారు. జీవో-97ను అబయెన్స్‌లో పెడతున్నామని బాక్సైట్‌పై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రకటించారు. కానీ బాక్సైట్ మైనింగ్‌పై స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంగళవారం అసెంబ్లీలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు అసలు ఆ జీవో గురించే ప్రస్తావించలేదు. బాక్సైట్ సరఫరాకు సంబంధించి కుదిరిన ఒప్పందాలు, జీవో-222 రద్దు చేస్తున్నట్లు ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. తాము డిమాండ్ చేసినట్లు జీవో-97 రద్దు చేయకపోవడంపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. సభలో వైఎస్సార్సీపీని లేకుండా చేసి.. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి బాక్సైట్‌పై స్వల్పకాలిక చర్చ కోసం రూల్-344 కింద నోటీసు ఇవ్వడంతో సభలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. అయితే ఆర్కే రోజా సస్పెన్షన్‌ను తొలగించనందుకు, కాల్‌మనీ - సెక్స్‌రాకెట్‌పై చర్చకు అనుమతించనందుకు నిరసనగా వైఎస్సార్ సీపీ సభ నుంచి వాకౌట్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమకు కావాల్సిన రీతిలో బాక్సైట్‌పై ప్రకటన చేసి చేతులు దులుపుకుంది. -
బాక్సైట్ సరఫరా జీవో రద్దు
సాక్షి, హైదరాబాద్: బాక్సైట్ సరఫరా ఒప్పందానికి సంబంధించి 2008 ఆగస్టు 13న జారీ చేసిన జీవో-222ను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఏపీఎండీసీ-అన్‌రాక్ 2008 అక్టోబర్ 30న కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. శాసనసభలో మంగళవారం బాక్సైట్, ఇసుక విధానంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాక్సైట్ ఒప్పందం కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసమే చేపట్టారని విమర్శించారు. విశాఖ జిల్లాలో జెర్రెల నిక్షేపాల నుంచి 224 మిలియన్ టన్నుల బాక్సైట్‌ను సరఫరా చేసేందుకు 2007లో రాష్ట్ర ప్రభుత్వం రస్ అల్ ఖైమాతో ఎంవోయూ చేసుకుందని, ఆ తర్వాత రస్ అల్ ఖైమా, పెన్నా గ్రూపు కలిసి ‘అన్‌రాక్’ కంపెనీ ఏర్పడిందని తెలిపారు. రూ.5,300 కోట్లుతో అన్‌రాక్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసినా నియమ నిబంధనలు సరిగా లేవని చెప్పారు. పెన్నా, రస్ అల్ ఖైమా మధ్య వాటా విధానం 2009 నాటికి 70:30గా ఉండగా, 2012-13 నాటికి 87:13గా మారిందని వివరించారు. కార్మెల్ ఏషియా, జగతి పబ్లికేషన్స్‌లో పెన్నా గ్రూపు మొత్తం రూ.68 కోట్లు పెట్టుబడులు పెట్టిందని, ఈ విషయాలు చర్చకు వస్తాయని భయపడే వైఎస్సార్సీపీ బయటకు వెళ్లిపోయిందని తెలిపారు. 2000వ సంవత్సరంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాక్సైట్‌పై ఆలోచన చేశానని, ఇప్పుడు చర్చ తర్వాతే బాక్సైట్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదను ఖచ్చితంగా వినియోగించుకుంటామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో బొగ్గు నిల్వలు, మైనంపేటలో బెరైటీస్, చీమకుర్తిలో గ్రానైట్, సముద్ర తీర ప్రాంతంలో టైటానియం, బీచ్‌శాండ్ ఉందని... వీటన్నింటినీ ఉపయోగించుకుని ప్రభుత్వ ఆదాయం పెంచుతామని స్పష్టంచేశారు. బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు చెప్పినట్లు బాక్సైట్ వల్ల నీరు కలుషితం కాదన్నారు. రాబోయే మంత్రివర్గంలో చర్చించి మెరుగైన ఇసుక విధానాన్ని ప్రకటిస్తామని ఆయన చెప్పారు. బాక్సైట్, ఇసుక విధానంపై మంత్రి పీతల ప్రకటన బాక్సైట్, ఇసుక విధానంపై మంత్రి పీతల సుజాత ప్రకటన చేశారు. కొత్త ఇసుక విధానం ద్వారా ప్రభుత్వానికి రూ.800 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. సీసీటీవీలు, జీపీఎస్ విధానం అమలు చేసి ఇసుక అక్రమ రవాణా అరికడతామని తెలిపారు. 24 గంటలు ఇసుక మైనింగ్లా 24 గంటలు మద్యం అందుబాటులోకి తేవద్దని బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు కోరారు. గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలు చేపడితే భూగర్భ జలాలు కలుషితమవుతాయని చెప్పారు. ప్రభుత్వం గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయాలని సూచించారు. బాక్సైట్‌పై టీడీపీ విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌లు చర్చలో పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విశాఖ జిల్లాలో, తన నియోజకవర్గం గాజువాకలో సమస్యల్ని స్పీకర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. -
జేఎస్‌డబ్ల్యూ విజయనగరం సెజ్ సరెండర్!
- ఇదే వరుసలో మరో 56... - ఆర్థిక మందగమనం, పన్ను సమస్యలు ప్రధాన కారణం... న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, ఎస్ కోట వద్ద తమ ప్రత్యేక ఆర్థిక జోన్ (ఎస్ఈజెడ్- సెజ్)ను ప్రభుత్వానికి సరెండర్ చేసేయడానికి డెవలపర్ జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్ సిద్ధమయ్యింది. దాదాపు 240 హెక్టార్లలో ప్రతిపాదించిన ఈ సెజ్ అల్యూమినియం రంగానికి ఉద్దేశించారు. ఈ సెజ్ డెవలప్మెంట్కు సంబంధించిన అనుమతుల గడువు నిజానికి 2012 ఫిబ్రవరి 26తో ముగిసింది. ముడి ఖనిజం మైనింగ్‌కు పర్యావరణ పరమైన ఆమోదాలు లభించకపోవడం, బాక్సైట్ సరఫరా ఒప్పందాల సంతకాలు పెండింగులో ఉండడం వంటి అంశాల వల్ల ఈ సెజ్ అభివృద్ధికి అవాంతరాలు ఏర్పడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో సెజ్‌ను సరెండర్ చేయాలని సంస్థ నిర్ణయించినట్లు సమాచారం. 20న కీలక సమావేశం... జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియంసహా దాదాపు 56 పత్యేక ఆర్థిక జోన్లల పట్ల ఇన్వెస్టర్లు అనాసక్త ధోరణిలో ఉన్నారని సమాచారం. సంబంధిత వర్గాల కథనం ప్రకారం ఆయా సెజ్‌ల డెవలపర్లు తమ సెజ్ ఆమోదిత అప్లికేషన్లను ప్రభుత్వానికి సరెండర్ చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు. పార్శ్వనాథ్, డీఎల్ఎఫ్ వంటి సంస్థలు ఉన్నాయి. వీటికి సంబంధించి న్యూఢిల్లీలో ఫిబ్రవరి 20న జరిగే ఒక అత్యున్నత స్థాయి అధికారుల సమావేశం దీనిపై నిర్ణయం తీసుకోనుంది. నిరుత్సాహానికి కారణం! 50కి పైగా సెజ్ డెవలపర్లు ఇప్పటికే తమ ప్రాజెక్టులను సరెండర్ చేశారు.ఆర్థిక మందగమనంలో ఉండడం వల్ల పలు డెవలపర్లు సెజ్‌ల అభివృద్ధి విషయంలో పలు అవాంతరాలను ఎదుర్కొన్నారు. ఆయా పరిస్థితుల నేపథ్యంలో మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ (ఎంఏటీ), డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ వంటి అంశాలు సెజ్‌లకు విఘాతంగా మారినట్లు విమర్శలు ఉన్నాయి. దేశంలో ప్రధాన ఎగుమతి కేంద్రాలుగా ఆవిర్భవించిన సెజ్‌లు ఆయా ప్రతికూల అంశాల వల్ల క్రమంగా తమ ఆకర్షణను కోల్పోతున్నాయన్న విమర్శ ఉంది. పెట్టుబడుల పెంపునకు రానున్న బడ్జెట్ సెజ్‌లపై మ్యాట్‌ను ప్రస్తుత 18.5 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని ఇటీవల పరిశ్రమల సంఘం- సీఐఐ కేంద్రానికి తన ప్రీ-బడ్జెట్ మెమోరాండంలో విన్నవించింది. 2005-06లో ఈ జోన్ల నుంచి ఎగుమతుల విలువ దాదాపు రూ.22,840 కోట్లు. 2013-14 నాటికి ఈ విలువ రూ.4.94 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ ఎగుమతుల విలువను దాదాపు రూ.20.15 లక్షల కోట్లకు పెంచాలన్నది ప్రణాళిక. ఈ పరిస్థితుల్లో సెజ్‌ల వైపు నుంచి ప్రతికూల వాతావరణం ఏర్పడుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది.