బాక్సైట్ సరఫరా జీవో రద్దు
సాక్షి, హైదరాబాద్: బాక్సైట్ సరఫరా ఒప్పందానికి సంబంధించి 2008 ఆగస్టు 13న జారీ చేసిన జీవో-222ను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఏపీఎండీసీ-అన్‌రాక్ 2008 అక్టోబర్ 30న కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. శాసనసభలో మంగళవారం బాక్సైట్, ఇసుక విధానంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాక్సైట్ ఒప్పందం కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసమే చేపట్టారని విమర్శించారు.
విశాఖ జిల్లాలో జెర్రెల నిక్షేపాల నుంచి 224 మిలియన్ టన్నుల బాక్సైట్‌ను సరఫరా చేసేందుకు 2007లో రాష్ట్ర ప్రభుత్వం రస్ అల్ ఖైమాతో ఎంవోయూ చేసుకుందని, ఆ తర్వాత రస్ అల్ ఖైమా, పెన్నా గ్రూపు కలిసి ‘అన్‌రాక్’ కంపెనీ ఏర్పడిందని తెలిపారు. రూ.5,300 కోట్లుతో అన్‌రాక్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసినా నియమ నిబంధనలు సరిగా లేవని చెప్పారు. పెన్నా, రస్ అల్ ఖైమా మధ్య వాటా విధానం 2009 నాటికి 70:30గా ఉండగా, 2012-13 నాటికి 87:13గా మారిందని వివరించారు.
కార్మెల్ ఏషియా, జగతి పబ్లికేషన్స్‌లో పెన్నా గ్రూపు మొత్తం రూ.68 కోట్లు పెట్టుబడులు పెట్టిందని, ఈ విషయాలు చర్చకు వస్తాయని భయపడే వైఎస్సార్‌సీపీ బయటకు వెళ్లిపోయిందని తెలిపారు. 2000వ సంవత్సరంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాక్సైట్‌పై ఆలోచన చేశానని, ఇప్పుడు చర్చ తర్వాతే బాక్సైట్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదను ఖచ్చితంగా వినియోగించుకుంటామన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో బొగ్గు నిల్వలు, మైనంపేటలో బెరైటీస్, చీమకుర్తిలో గ్రానైట్, సముద్ర తీర ప్రాంతంలో టైటానియం, బీచ్‌శాండ్ ఉందని... వీటన్నింటినీ ఉపయోగించుకుని ప్రభుత్వ ఆదాయం పెంచుతామని స్పష్టంచేశారు. బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు చెప్పినట్లు బాక్సైట్ వల్ల నీరు కలుషితం కాదన్నారు. రాబోయే మంత్రివర్గంలో చర్చించి మెరుగైన ఇసుక విధానాన్ని ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
బాక్సైట్, ఇసుక విధానంపై మంత్రి పీతల ప్రకటన
బాక్సైట్, ఇసుక విధానంపై మంత్రి పీతల సుజాత ప్రకటన చేశారు. కొత్త ఇసుక విధానం ద్వారా ప్రభుత్వానికి రూ.800 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. సీసీటీవీలు, జీపీఎస్ విధానం అమలు చేసి ఇసుక అక్రమ రవాణా అరికడతామని తెలిపారు. 24 గంటలు ఇసుక మైనింగ్‌లా 24 గంటలు మద్యం అందుబాటులోకి తేవద్దని బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు కోరారు.
గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలు చేపడితే భూగర్భ జలాలు కలుషితమవుతాయని చెప్పారు. ప్రభుత్వం గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయాలని సూచించారు. బాక్సైట్‌పై టీడీపీ విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌లు చర్చలో పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విశాఖ జిల్లాలో, తన నియోజకవర్గం గాజువాకలో సమస్యల్ని స్పీకర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.