‘కన్ను’ పడితేనే ప్రవేశం..
బయోమాటిక్స్ నుంచి ఐరిస్ స్కానర్
దేశీయంగా తయారైన తొలి ఉత్పాదన
కంపెనీ సీఈవో తమాల్ రాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్డు లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు తీసే అవకాశం ఉంటే! మీ ఇంటి ముందు నిలుచోగానే ద్వారం తెరుచుకుంటే! అంతకంటే సౌకర్యం ఏముంటుంది. తాము అభివృద్ధి చేసిన ఇ-పరఖ్ ఐరిస్ స్కానర్‌తో మరెన్నో సౌలభ్యాలు ఉన్నాయని అంటోంది సూరత్‌కు చెందిన బయోమాటిక్స్ ఐడెంటిఫికేషన్ సొల్యూషన్స్. ‘ఏటీఎం నుంచి డబ్బులు తీయాలంటే కార్డు తప్పనిసరి. కార్డు పోయినా, పిన్ నంబరు ఎవరైనా తస్కరించినా ఖాతాలో ఉన్న డబ్బులు మర్చిపోవాల్సిందే. అదే కనుపాపను గుర్తించి పనిచేసే ఏటీఎం ఉంటే వినియోగదార్లు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని చెబుతున్నారు బయోమాటిక్స్ సీఈవో తమాల్ రాయ్. కనుపాపను పిన్ నంబరుగా, పాస్‌వర్డ్‌గా, తాళం చెవిగా, యాక్సెస్(ప్రవేశం) పాయింట్‌గా ఉపయోగించొచ్చని శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ పేటెంటు పెండింగులో ఉందని చెప్పారు. అయితే ఇప్పటివరకూ ఐరిస్ టెక్నాలజీని విదేశీ కంపెనీలు అందించేవి. భారత్‌లో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తొలి ఉత్పాదనను బయోమాటిక్స్ అభివృద్ధిపర్చింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(డైటీ) నుంచి ఐరిస్ గుర్తింపు ఉత్పాదనల రంగంలో స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ పొందిన తొలి భారతీయ కంపెనీ బయోమాటిక్స్.
ఆధార్‌తో ముడిపడి న సేవలకు..
ఆధార్ నమోదు సమయంలో కనుపాపతోపాటు వేలిముద్రలను సైతం సేకరించిన సంగతి తెలిసిందే. సిమ్ తీసుకునేందుకు, బ్యాంకు ఖాతా తెరిచేందుకు గుర్తింపు కోసం ఆధార్ నకలుతోపాటు ఫొటో కూడా తీసుకెళ్లాలి. బ్యాంకులు, టెలికం స్టోర్ల వద్ద ఇ-పరఖ్ ఐరిస్ స్కానర్ ఉంటే ఇవేవీ అవసరం లేదని తమాల్ రాయ్ తెలిపారు. కస్టమర్ కనుపాప ఆధారంగా అతని పూర్తి వివరాలు కంప్యూటర్ ముందు ప్రత్యక్షమవుతాయని వివరించారు. ఈ-వీసా, ఈ-పాస్‌పోర్ట్, ప్రజాపంపిణీ వ్యవస్థ, పెన్షన్ ఇలా ఆధార్‌తో ముడిపడి ఉన్న ఎన్నో సేవలకు కాగితాలు అవసరం లేకుండానే పనులు పూర్తి అవుతాయని చెప్పారు.