Bayyaram mines
-
బయ్యారం.. బంగారం
ఖమ్మం: బయ్యారం తెలంగాణ కొంగు బంగారం కానుందా..? తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోందా..? నిరుద్యోగ యువతకు ఉపాధి దొరకనుందా..? అవుననే చెబుతోంది.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) నిపుణుల బృందం ఖమ్మం జిల్లా పర్యటన. ఈ బృందం జిల్లాలో పర్యటించి స్టీల్ కర్మాగారం ఎక్కడ నిర్మాణం చేపట్టాలన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తోంది. ఈ మేరకు మంగళవారం 8 మందితో కూడిన సెయిల్ కమిటీ బృందం కలెక్టరేట్లో జేసీ సురేంద్రమోహన్, పరిశ్రమలు, ట్రాన్స్‌కో, రెవెన్యూ, పీసీబీ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిం చింది. ఖనిజ వనరులు నిక్షిప్తమై ఉన్న ప్రాంతానికి సమీపంలో విద్యుత్, నీరు, ఫ్యాక్టరీ నిర్మాణానికి కావాల్సిన భూమి ఎక్కడ అనువుగా ఉందో వాటిపైనే ఆయా అధికారుల నుంచి సమాచారం సేకరించింది. ఈ వనరుల్లో ఎక్కువగా ఏవి ఒకేచోట ఉంటాయో అక్కడే ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టేందుకు ఈ కమిటీలోని వివిధ విభాగాల సాంకేతిక నిపుణులు సమాచారం తీసుకున్నారు. బయ్యారానికే అవకాశం.. సెయిల్ కమిటీ అధ్యయన బృందం ఇటు బయ్యారం, అటు కొత్తగూడెం మండలాల్లో కర్మాగారం నిర్మాణానికి భూమి అన్వేషణ చేస్తున్నా.. బయ్యారంలోనే ఫ్యాక్టరీ నిర్మాణం కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగూడెంలో బొగ్గు, కిన్నెరసాని నీటి వనరులున్నా అక్కడ అంతా అండర్ గ్రౌండ్ బొగ్గు గనులు ఉండడంతో ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణంపై జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూ. 30 వేల కోట్లతో భారీఎత్తున ఫ్యాక్టరీ నిర్మా ణం చేపడుతుండడంతో అండర్ గ్రౌండ్ మైన్లు ఉన్న చోట భవిష్యత్‌లో ఏదైనా ప్రమాదం సంభవిస్తే నిర్మాణ వ్యయమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని భావిస్తున్నట్లు సమాచారం. కొత్తగూడెం ప్రాంతమంతా అండర్‌గ్రౌండ్ మైన్లు ఉండడంతో ఇక్కడ భూమి అన్వేషణ చేసినా.. నిర్మాణానికి మాత్రం బయ్యారం ప్రాంతం సేఫ్ జోన్‌గా జీఎస్ఐ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. బయ్యారంలో ఓవైపు ముడి ఇనుప ఖనిజం తీసినా.. మరోవైపు సేఫ్ జోన్‌గా ఫ్యాక్టరీ నిర్మాణానికి అనువైన భూమి ఉండడం, రఘునాథపాలెం పవర్ గ్రిడ్ నుంచి విద్యుత్, పెద్ద చెరువు లేదా మున్నేరు నుంచి నీరు వినియోగించుకునే సౌకర్యం ఉండడంతో ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణంపైనే సెయిల్ అధికారులు పూర్తిస్థాయి సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. అందుబాటులో వనరులు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. బయ్యారంలో 25,700 హెక్టార్లు, గార్లలో 18,330 హెక్టార్లు, నేలకొండపల్లిలో 12,660 హెక్టార్లలో ముడి ఇనుప ఖనిజం ఉంది. కారేపల్లి మండలం మాదారంలో 20 కిలోమీటర్ల మేరకు డోలమైట్ విస్తరించి ఉంది. ప్రస్తుతం ఇక్కడినుంచి ఈ ఖనిజం విశాఖలోని స్టీల్ ప్లాంట్‌కు రవాణా అవుతోంది. అలాగే నల్లగొండ జిల్లాలో సున్నపురాయి (లైమ్ స్టోన్) అందుబాటులో ఉందని.. బయ్యారం నుంచి ఇక్కడి గనులకు 90 కిలోమీటర్ల దూరం ఉన్నట్లు జిల్లా అధికారులు ఇచ్చిన నివేదికలో పొందుపరిచారు. అలాగే బయ్యారం నుంచి ఇటు సికింద్రాబాద్, అటు విజయవాడ వెళ్లేందుకు రైలుమార్గం 11 కిలోమీటర్లలో దూరంలో ఉందని వివరించారు. బొగ్గు గనులు, విద్యుత్, రవాణా సౌకర్యాలు స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి థర్మల్ శక్తి పుష్కలంగా ఉన్నట్లు అధికారులు కమిటీకి వివరించారు. సింగరేణి కాలరీస్ పరిధిలోని ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు, కోయగూడెం, కొత్తగూడెం, మణుగూరు, వరంగల్ జిల్లా భూపాలపల్లిలో ఓపెన్‌కాస్టు, అండర్‌గ్రౌండ్ మైన్స్ నుంచి బొగ్గు రానుందని చెప్పారు. అలాగే బయ్యారానికి 30 కిలోమీటర్ల దూరంలో రఘునాథపాలెం మండలం బూడిదంపాడు గ్రామంలో ఉన్న ఎన్పీడీసీఎల్ పరిధిలోకి వస్తున్న 220కేవీఏ/400 కేవీ గ్రిడ్ అందుబాటులో ఉంది. ఇక స్టీల్ కర్మాగారానికి సెయిల్ నిబంధనల ప్రకారం 2,500 ఎకరాలు అవసరం. అయితే, బయ్యారం మండలం ధర్మాపురం గ్రామంలో సర్వే నంబర్ 452లో సుమారు 4,000 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ఇందులో 2 వేల ఎకరాలు అసైన్డ్ భూమి. కొత్తగూడెం మండలం కూనారం గ్రామంలో సర్వే నెంబర్ 13లో సుమారు 4,300 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఇక రవాణ సౌకర్యాల విషయానికొస్తే.. రైలు మార్గమైతే వరంగల్ జిల్లా గుండ్రాతిమడుగు స్టేషన్ నుంచి బయ్యారానికి 3 కిలోమీటర్లు, అలాగే వరంగల్ రైల్వే స్టేషన్ (కాజీపేట) బయ్యారానికి 76 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గం అయితే ఇల్లెందు నుంచి బయ్యారానికి 23 కిలోమీటర్లు. అలాగే ఖమ్మం బస్టాండ్ కూడా సమీపంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక కొత్తగూడెం మండలం కూనారం చేరుకోవాలంటే కొత్తగూడెం రైల్వే స్టేషన్, బేతంపుడి (భద్రాచలం రోడ్డు), రైల్వే స్టేషన్లు సమీపంలోనే ఉన్నాయి. కొత్తగూడెం నుంచి రోడ్డు మార్గం ద్వారా కూనారం నుంచి 128 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్‌ను కూడా చేరుకోవచ్చునని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఇన్ని అవకాశాలుండడంతో బయ్యారంలోనే స్టీల్ కర్మాగారం ఏర్పాటునకు అనువైన ప్రదేశంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
అడ్డంగా దొరికిన ఈనాడు
* బ్యాంకు లావాదేవీల్ని చూపిస్తూ తప్పుడు రాతలు * బినామీ లావాదేవీలు బ్యాంకుల ద్వారా కూడా చేస్తారా?.. ఆన్లైన్లో చేశారంటే దానర్థం పారదర్శకంగా చేసినట్టు కాదా? * నిజంగా బినామీ అయితే డబ్బు డ్రా చేసి ఇచ్చేవారుగా?.. ఇవన్నీ వదిలిపెట్టి ఎన్నికల ముందు రామోజీ శివాలు * కావాలని పోలింగ్ ముందురోజున షర్మిలపై బురద అడ్డంగా దొరికిందెవరు? రామోజీరావా? ఈనాడా? లేక షర్మిలా? ‘‘బయ్యారం యవ్వారం బట్టబయలు... అడ్డంగా దొరికిన షర్మిల’ అంటూ మంగళవారం ఆరు కాలాల నిండా రామోజీ రాసిన విషపు రాతల లోగుట్టేంటి? ఇకపై తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున షర్మిల యాత్ర చేస్తారని, పార్టీ బాధ్యతలు ఆమే చూస్తారని వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో... తెలంగాణలో పోలింగ్ జరగటానికి ఒక రోజు ముందు రామోజీరావు పన్నిన కుట్రలో ఇది భాగం కాదా? జగన్ ప్రచార సభలకు తెలంగాణలో సైతం జనం వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోలింగ్ ముందున కావాలని కక్కిన కాలకూట విషం తప్ప ఇందులో ఏముందని? ‘‘షర్మిల ఖాతా నుంచి సతీష్ కుమార్ ఖాతాకు రూ.40 లక్షల చొప్పున రెండు సార్లు, రూ.30 లక్షల చొప్పున ఒకసారి బదిలీ అయ్యాయి. రెండేళ్ల వ్యవధిలో జరిగిన ఈ మూడు లావాదేవీలూ చూస్తే సతీష్‌కుమార్‌కు షర్మిల డబ్బు పంపారు కనక ఆయన బినామీయే’’ అనేది మొత్తంగా ‘ఈనాడు’ రాతల సారాంశం. అయినా ఇద్దరు వ్యక్తుల మధ్య బ్యాంకు లావాదేవీలు నడవటం తప్పా? నేరమా? రామోజీరావు రాసినట్టుగా సతీష్‌కుమార్ గనక నిజంగా బ్రదర్ అనిల్కో, షర్మిలకో బినామీయే అయితే షర్మిల నేరుగా తన ఖాతా నుంచి ఆయన వ్యక్తిగత ఖాతాకు నగదును ఎందుకు పంపిస్తారు? అది కూడా ఆన్లైన్లో ఎందుకు బదిలీ చేస్తారు? ఇది బినామీ లావాదేవీయే అయితే నేరుగా నగదును డ్రా చేసో, మరో మార్గంలోనో... చంద్రబాబు రామోజీకి ఇచ్చేవిధంగా ఇచ్చి ఉండేవారు కదా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండొద్దా? ఆన్లైన్లో నగదు బదిలీ చేశారంటే దానర్థం అంతా పారదర్శకంగా ఉన్నట్టు కాదా? ఎప్పటికైనా రికార్డుల్లో ఉండాలని, అంతా పారదర్శకంగా ఉండేలా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన లావాదేవీగా దీన్ని భావించాల్సిన పనిలేదా? అయినా బినామీ లావాదేవీలంటే ఏంటి? చంద్రబాబుతో రామోజీరావు, సుజనా చౌదరి, సి.ఎం.రమేష్, నాగరాజానాయుడు, మురళీమోహన్ వంటి వ్యక్తులు జరిపే లావాదేవీలు కాదా? అవును మరి! చంద్రబాబు నుంచి కృష్ణా-గోదావరి బేసిన్లో గ్యాస్‌ను కొట్టేసినందుకు రిలయన్స్ సంస్థ రామోజీరావుకిచ్చిన డబ్బంతా బినామీ డబ్బే. ఎందుకంటే చంద్రబాబుకు పోవాల్సిన డబ్బు ఆయన బినామీగా రామోజీకి వచ్చింది కాబట్టి!! అదీ బినామీ లావాదేవీ అంటే!! షర్మిల నుంచి వచ్చిన నగదును సతీష్ తనకు చెందిన కంపెనీలకు మళ్లించుకుంటే తప్పేంటి? ఒక వ్యక్తి దగ్గర తీసుకున్న సొమ్మును మరో వ్యక్తి తన అవసరాల మేరకు వాడుకునే అవకాశం లేదా? అదంతా బినామీ లావాదేవీయేనా? అయినా రూ.50 వేలు దాటిన బ్యాంకు లావాదేవీలన్నీ ఆదాయపు పన్ను శాఖకు కూడా తెలుస్తూనే ఉంటాయి. మరి అవన్నీ తెలిసి కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య ఆన్లైన్లో బ్యాంకు లావాదేవీలు పారదర్శకంగా జరిగాయంటే ఏమిటర్ఠం? ఆ లావాదేవీల్ని పట్టుకుని తామేదో కొండను తవ్వేశామంటూ రామోజీరావు రాసిన రాతల్ని ఏమనుకోవాలి? ఇక్కడ రామోజీ రాసిన రాతల్లో కొత్త విషయమేదీ లేదు. షర్మిల ఖాతా నుంచి సతీష్ కుమార్ ఖాతాకు ఆన్లైన్లో నగదు బదిలీ అయిందనే విషయం తప్ప. మిగిలినదంతా గతంలో రామోజీ వండిన ‘పచ్చడే’. దానికే తిరుగులేని ఆధారాలు లభ్యం... అంటూ మొదటి పేజీలో ఆరు కాలాలు అచ్చువేసి... లోపలంతా పాత రోతకతనే చెప్పారు. ఇదంతా పోలింగ్‌కు ముందు రామోజీ చేస్తున్న కుట్రగా అర్థం కావటానికి పెద్ద పరిజ్ఞానమేమీ అవసరం లేదు. పెపైచ్చు లక్షా నలభైవేల ఎకరాలంటూ... 16 లక్షల కోట్ల రూపాయలంటూ అవే రోత రాతలు. అక్కడ నిజంగా అంత విలువైన ఖనిజమే ఉంటే ఈ పాటికి వాటిని దక్కించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్ తవ్వకాలు మొదలుపెట్టే ఉండేది. అక్కడ నాసిరకం ఖనిజం తప్ప... పైసా లాభం తెచ్చే నాణ్యమైన ఖనిజం లేదని తెలియబట్టే అది కూడా తవ్వకానికి తటపటాయిస్తోందన్న నిజం రామోజీకి తెలియదా? తెలిసి కూడా ఎన్నికల ముందు అవే పాత కథనాల్ని వండారంటే అది పోలింగ్‌ను ప్రభావితం చేయడానికి కాదా? ఇదెక్కడి తీరు? ఈ రామోజీకి ఇంకెప్పుడు వస్తుంది జ్ఞానం? బినామీగా ఉండాల్సిన పరిస్థితి లేదు: సతీష్ ‘‘ఇవ్వాళ ‘ఈనాడు’లో రాసిన కథనం చూసి ఆశ్చర్యపోయా? షర్మిల నాకు డబ్బులు ఆన్లైన్లో బదిలీ చేయటంపై కూడా ఇంత దుష్ర్పచారం చేయగలరని నేననుకోలేదు. అయినా వేరొకరికి బినామీగా ఉండాల్సిన అవసరం నాకు లేదు. నేను 1993లోనే ఇంజనీరింగ్ పూర్తిచేశా. 1995లో మాస్టర్స్ డిగ్రీ చేశా. ఢిల్లీలో ఇంజనీరింగ్ సర్వీసెస్‌కు కూడా సెలక్టయినా... అది వదులుకుని అమెరికా వెళ్లా. అక్కడ మాస్టర్స్ డి గ్రీ చేసి వ్యాపారం మొదలుపెట్టా. 2001లో అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి దాన్ని వెయ్యి కోట్ల రూపాయల టర్నోవర్ సాధించే స్థాయికి తీసుకెళ్లా. బ్రదర్ అనిల్ నా క్లాస్మేట్ కావటంతో 1986 నుంచీ పరిచయం ఉంది. ఆయన కుటుంబంతోనూ సాన్నిహిత్యం ఉంది. ఇండియాలోనూ వ్యాపారాలున్నాయి. నాకు వేరొకరి బినామీగా ఉండాల్సిన అవసరం గానీ, అగత్యం గానీ లేవు. రాజకీయంగా షర్మిలను, వైఎస్ కుటుంబాన్ని దెబ్బ తీయాలన్న ఉద్దేశంతోనే ఎన్నికల ముందు ఈ రాతలు రాశారనిపిస్తోంది’’ అంటూ తాటి సతీష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.