* బ్యాంకు లావాదేవీల్ని చూపిస్తూ తప్పుడు రాతలు
* బినామీ లావాదేవీలు బ్యాంకుల ద్వారా కూడా చేస్తారా?.. ఆన్‌లైన్లో చేశారంటే దానర్థం పారదర్శకంగా చేసినట్టు కాదా?
* నిజంగా బినామీ అయితే డబ్బు డ్రా చేసి ఇచ్చేవారుగా?.. ఇవన్నీ వదిలిపెట్టి ఎన్నికల ముందు రామోజీ శివాలు
* కావాలని పోలింగ్ ముందురోజున షర్మిలపై బురద
అడ్డంగా దొరికిందెవరు? రామోజీరావా? ఈనాడా? లేక షర్మిలా? ‘‘బయ్యారం యవ్వారం బట్టబయలు... అడ్డంగా దొరికిన షర్మిల’ అంటూ మంగళవారం ఆరు కాలాల నిండా రామోజీ రాసిన విషపు రాతల లోగుట్టేంటి? ఇకపై తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున షర్మిల యాత్ర చేస్తారని, పార్టీ బాధ్యతలు ఆమే చూస్తారని వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో... తెలంగాణలో పోలింగ్ జరగటానికి ఒక రోజు ముందు రామోజీరావు పన్నిన కుట్రలో ఇది భాగం కాదా? జగన్ ప్రచార సభలకు తెలంగాణలో సైతం జనం వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోలింగ్ ముందున కావాలని కక్కిన కాలకూట విషం తప్ప ఇందులో ఏముందని?
‘‘షర్మిల ఖాతా నుంచి సతీష్ కుమార్ ఖాతాకు రూ.40 లక్షల చొప్పున రెండు సార్లు, రూ.30 లక్షల చొప్పున ఒకసారి బదిలీ అయ్యాయి. రెండేళ్ల వ్యవధిలో జరిగిన ఈ మూడు లావాదేవీలూ చూస్తే సతీష్‌కుమార్‌కు షర్మిల డబ్బు పంపారు కనక ఆయన బినామీయే’’ అనేది మొత్తంగా ‘ఈనాడు’ రాతల సారాంశం. అయినా ఇద్దరు వ్యక్తుల మధ్య బ్యాంకు లావాదేవీలు నడవటం తప్పా? నేరమా? రామోజీరావు రాసినట్టుగా సతీష్‌కుమార్ గనక నిజంగా బ్రదర్ అనిల్‌కో, షర్మిలకో బినామీయే అయితే షర్మిల నేరుగా తన ఖాతా నుంచి ఆయన వ్యక్తిగత ఖాతాకు నగదును ఎందుకు పంపిస్తారు? అది కూడా ఆన్‌లైన్లో ఎందుకు బదిలీ చేస్తారు?
ఇది బినామీ లావాదేవీయే అయితే నేరుగా నగదును డ్రా చేసో, మరో మార్గంలోనో... చంద్రబాబు రామోజీకి ఇచ్చేవిధంగా ఇచ్చి ఉండేవారు కదా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండొద్దా? ఆన్‌లైన్లో నగదు బదిలీ చేశారంటే దానర్థం అంతా పారదర్శకంగా ఉన్నట్టు కాదా? ఎప్పటికైనా రికార్డుల్లో ఉండాలని, అంతా పారదర్శకంగా ఉండేలా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన లావాదేవీగా దీన్ని భావించాల్సిన పనిలేదా?
అయినా బినామీ లావాదేవీలంటే ఏంటి? చంద్రబాబుతో రామోజీరావు, సుజనా చౌదరి, సి.ఎం.రమేష్, నాగరాజానాయుడు, మురళీమోహన్ వంటి వ్యక్తులు జరిపే లావాదేవీలు కాదా? అవును మరి! చంద్రబాబు నుంచి కృష్ణా-గోదావరి బేసిన్లో గ్యాస్‌ను కొట్టేసినందుకు రిలయన్స్ సంస్థ రామోజీరావుకిచ్చిన డబ్బంతా బినామీ డబ్బే. ఎందుకంటే చంద్రబాబుకు పోవాల్సిన డబ్బు ఆయన బినామీగా రామోజీకి వచ్చింది కాబట్టి!! అదీ బినామీ లావాదేవీ అంటే!!
షర్మిల నుంచి వచ్చిన నగదును సతీష్ తనకు చెందిన కంపెనీలకు మళ్లించుకుంటే తప్పేంటి? ఒక వ్యక్తి దగ్గర తీసుకున్న సొమ్మును మరో వ్యక్తి తన అవసరాల మేరకు వాడుకునే అవకాశం లేదా? అదంతా బినామీ లావాదేవీయేనా? అయినా రూ.50 వేలు దాటిన బ్యాంకు లావాదేవీలన్నీ ఆదాయపు పన్ను శాఖకు కూడా తెలుస్తూనే ఉంటాయి. మరి అవన్నీ తెలిసి కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య ఆన్‌లైన్లో బ్యాంకు లావాదేవీలు పారదర్శకంగా జరిగాయంటే ఏమిటర్ఠం? ఆ లావాదేవీల్ని పట్టుకుని తామేదో కొండను తవ్వేశామంటూ రామోజీరావు రాసిన రాతల్ని ఏమనుకోవాలి?
ఇక్కడ రామోజీ రాసిన రాతల్లో కొత్త విషయమేదీ లేదు. షర్మిల ఖాతా నుంచి సతీష్ కుమార్ ఖాతాకు ఆన్‌లైన్లో నగదు బదిలీ అయిందనే విషయం తప్ప. మిగిలినదంతా గతంలో రామోజీ వండిన ‘పచ్చడే’. దానికే తిరుగులేని ఆధారాలు లభ్యం... అంటూ మొదటి పేజీలో ఆరు కాలాలు అచ్చువేసి... లోపలంతా పాత రోతకతనే చెప్పారు. ఇదంతా పోలింగ్‌కు ముందు రామోజీ చేస్తున్న కుట్రగా అర్థం కావటానికి పెద్ద పరిజ్ఞానమేమీ అవసరం లేదు. పెపైచ్చు లక్షా నలభైవేల ఎకరాలంటూ... 16 లక్షల కోట్ల రూపాయలంటూ అవే రోత రాతలు.
అక్కడ నిజంగా అంత విలువైన ఖనిజమే ఉంటే ఈ పాటికి వాటిని దక్కించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్ తవ్వకాలు మొదలుపెట్టే ఉండేది. అక్కడ నాసిరకం ఖనిజం తప్ప... పైసా లాభం తెచ్చే నాణ్యమైన ఖనిజం లేదని తెలియబట్టే అది కూడా తవ్వకానికి తటపటాయిస్తోందన్న నిజం రామోజీకి తెలియదా? తెలిసి కూడా ఎన్నికల ముందు అవే పాత కథనాల్ని వండారంటే అది పోలింగ్‌ను ప్రభావితం చేయడానికి కాదా? ఇదెక్కడి తీరు? ఈ రామోజీకి ఇంకెప్పుడు వస్తుంది జ్ఞానం?
బినామీగా ఉండాల్సిన పరిస్థితి లేదు: సతీష్
‘‘ఇవ్వాళ ‘ఈనాడు’లో రాసిన కథనం చూసి ఆశ్చర్యపోయా? షర్మిల నాకు డబ్బులు ఆన్‌లైన్లో బదిలీ చేయటంపై కూడా ఇంత దుష్ర్పచారం చేయగలరని నేననుకోలేదు. అయినా వేరొకరికి బినామీగా ఉండాల్సిన అవసరం నాకు లేదు. నేను 1993లోనే ఇంజనీరింగ్ పూర్తిచేశా. 1995లో మాస్టర్స్ డిగ్రీ చేశా. ఢిల్లీలో ఇంజనీరింగ్ సర్వీసెస్‌కు కూడా సెలక్టయినా... అది వదులుకుని అమెరికా వెళ్లా. అక్కడ మాస్టర్స్ డి గ్రీ చేసి వ్యాపారం మొదలుపెట్టా.
2001లో అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టి దాన్ని వెయ్యి కోట్ల రూపాయల టర్నోవర్ సాధించే స్థాయికి తీసుకెళ్లా. బ్రదర్ అనిల్ నా క్లాస్‌మేట్ కావటంతో 1986 నుంచీ పరిచయం ఉంది. ఆయన కుటుంబంతోనూ సాన్నిహిత్యం ఉంది. ఇండియాలోనూ వ్యాపారాలున్నాయి. నాకు వేరొకరి బినామీగా ఉండాల్సిన అవసరం గానీ, అగత్యం గానీ లేవు. రాజకీయంగా షర్మిలను, వైఎస్ కుటుంబాన్ని దెబ్బ తీయాలన్న ఉద్దేశంతోనే ఎన్నికల ముందు ఈ రాతలు రాశారనిపిస్తోంది’’ అంటూ తాటి సతీష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
అడ్డంగా దొరికిన ఈనాడు
Published Wed, Apr 30 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 6:42 AM
Advertisement
Advertisement