బయ్యారం.. బంగారం | steel authority of india officials visits bayyaram | Sakshi
Sakshi News home page

బయ్యారం.. బంగారం

Published Thu, May 22 2014 6:48 PM | Last Updated on Fri, Nov 9 2018 5:37 PM

బయ్యారం.. బంగారం - Sakshi

బయ్యారం.. బంగారం

ఖమ్మం: బయ్యారం తెలంగాణ కొంగు బంగారం కానుందా..? తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోందా..? నిరుద్యోగ యువతకు ఉపాధి దొరకనుందా..? అవుననే చెబుతోంది.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) నిపుణుల బృందం ఖమ్మం జిల్లా పర్యటన. ఈ బృందం జిల్లాలో పర్యటించి స్టీల్ కర్మాగారం ఎక్కడ నిర్మాణం చేపట్టాలన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తోంది.

ఈ మేరకు మంగళవారం 8 మందితో కూడిన సెయిల్ కమిటీ బృందం కలెక్టరేట్‌లో జేసీ సురేంద్రమోహన్, పరిశ్రమలు, ట్రాన్స్‌కో, రెవెన్యూ, పీసీబీ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిం చింది. ఖనిజ వనరులు నిక్షిప్తమై ఉన్న ప్రాంతానికి సమీపంలో విద్యుత్, నీరు, ఫ్యాక్టరీ నిర్మాణానికి కావాల్సిన భూమి ఎక్కడ అనువుగా ఉందో వాటిపైనే ఆయా అధికారుల నుంచి సమాచారం సేకరించింది. ఈ వనరుల్లో ఎక్కువగా ఏవి ఒకేచోట ఉంటాయో అక్కడే ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టేందుకు ఈ కమిటీలోని వివిధ విభాగాల సాంకేతిక నిపుణులు సమాచారం తీసుకున్నారు.

బయ్యారానికే అవకాశం..
సెయిల్ కమిటీ అధ్యయన బృందం ఇటు బయ్యారం, అటు కొత్తగూడెం మండలాల్లో కర్మాగారం నిర్మాణానికి భూమి అన్వేషణ చేస్తున్నా.. బయ్యారంలోనే ఫ్యాక్టరీ నిర్మాణం కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగూడెంలో బొగ్గు, కిన్నెరసాని నీటి వనరులున్నా అక్కడ అంతా అండర్ గ్రౌండ్ బొగ్గు గనులు ఉండడంతో ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణంపై జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రూ. 30 వేల కోట్లతో భారీఎత్తున ఫ్యాక్టరీ నిర్మా ణం చేపడుతుండడంతో అండర్ గ్రౌండ్ మైన్లు ఉన్న చోట భవిష్యత్‌లో ఏదైనా ప్రమాదం సంభవిస్తే నిర్మాణ వ్యయమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని భావిస్తున్నట్లు సమాచారం. కొత్తగూడెం ప్రాంతమంతా అండర్‌గ్రౌండ్ మైన్లు ఉండడంతో ఇక్కడ భూమి అన్వేషణ చేసినా.. నిర్మాణానికి మాత్రం బయ్యారం ప్రాంతం సేఫ్ జోన్‌గా జీఎస్‌ఐ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

బయ్యారంలో ఓవైపు ముడి ఇనుప ఖనిజం తీసినా.. మరోవైపు సేఫ్ జోన్‌గా ఫ్యాక్టరీ నిర్మాణానికి అనువైన భూమి ఉండడం, రఘునాథపాలెం పవర్ గ్రిడ్ నుంచి విద్యుత్, పెద్ద చెరువు లేదా మున్నేరు నుంచి నీరు వినియోగించుకునే సౌకర్యం ఉండడంతో ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణంపైనే సెయిల్ అధికారులు పూర్తిస్థాయి సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు.

అందుబాటులో వనరులు  
ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. బయ్యారంలో 25,700 హెక్టార్లు, గార్లలో 18,330 హెక్టార్లు, నేలకొండపల్లిలో 12,660 హెక్టార్లలో ముడి ఇనుప ఖనిజం ఉంది. కారేపల్లి మండలం మాదారంలో 20 కిలోమీటర్ల మేరకు డోలమైట్ విస్తరించి ఉంది. ప్రస్తుతం ఇక్కడినుంచి ఈ ఖనిజం విశాఖలోని స్టీల్ ప్లాంట్‌కు రవాణా అవుతోంది. అలాగే నల్లగొండ జిల్లాలో సున్నపురాయి (లైమ్ స్టోన్) అందుబాటులో ఉందని.. బయ్యారం నుంచి ఇక్కడి గనులకు 90 కిలోమీటర్ల దూరం ఉన్నట్లు జిల్లా అధికారులు ఇచ్చిన నివేదికలో పొందుపరిచారు. అలాగే బయ్యారం నుంచి ఇటు సికింద్రాబాద్, అటు విజయవాడ వెళ్లేందుకు రైలుమార్గం 11 కిలోమీటర్లలో దూరంలో ఉందని వివరించారు.

బొగ్గు గనులు, విద్యుత్, రవాణా సౌకర్యాలు
స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి థర్మల్ శక్తి పుష్కలంగా ఉన్నట్లు అధికారులు కమిటీకి వివరించారు. సింగరేణి కాలరీస్ పరిధిలోని ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు, కోయగూడెం, కొత్తగూడెం, మణుగూరు, వరంగల్ జిల్లా భూపాలపల్లిలో ఓపెన్‌కాస్టు, అండర్‌గ్రౌండ్ మైన్స్ నుంచి బొగ్గు రానుందని చెప్పారు. అలాగే బయ్యారానికి 30 కిలోమీటర్ల దూరంలో రఘునాథపాలెం మండలం బూడిదంపాడు గ్రామంలో ఉన్న ఎన్‌పీడీసీఎల్ పరిధిలోకి వస్తున్న 220కేవీఏ/400 కేవీ గ్రిడ్ అందుబాటులో ఉంది.

ఇక స్టీల్ కర్మాగారానికి సెయిల్ నిబంధనల ప్రకారం 2,500 ఎకరాలు అవసరం. అయితే, బయ్యారం మండలం ధర్మాపురం గ్రామంలో సర్వే నంబర్ 452లో సుమారు 4,000 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ఇందులో 2 వేల ఎకరాలు అసైన్డ్ భూమి. కొత్తగూడెం మండలం కూనారం గ్రామంలో సర్వే నెంబర్ 13లో సుమారు 4,300 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఇక రవాణ సౌకర్యాల విషయానికొస్తే.. రైలు మార్గమైతే వరంగల్ జిల్లా గుండ్రాతిమడుగు స్టేషన్ నుంచి బయ్యారానికి 3 కిలోమీటర్లు, అలాగే వరంగల్ రైల్వే స్టేషన్ (కాజీపేట) బయ్యారానికి 76 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

రోడ్డు మార్గం అయితే ఇల్లెందు నుంచి బయ్యారానికి 23 కిలోమీటర్లు. అలాగే ఖమ్మం బస్టాండ్ కూడా సమీపంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక కొత్తగూడెం మండలం కూనారం చేరుకోవాలంటే కొత్తగూడెం రైల్వే స్టేషన్, బేతంపుడి (భద్రాచలం రోడ్డు), రైల్వే స్టేషన్లు సమీపంలోనే ఉన్నాయి. కొత్తగూడెం నుంచి రోడ్డు మార్గం ద్వారా కూనారం నుంచి 128 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్‌ను కూడా చేరుకోవచ్చునని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు.  ఇన్ని అవకాశాలుండడంతో బయ్యారంలోనే స్టీల్ కర్మాగారం ఏర్పాటునకు అనువైన ప్రదేశంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement