బీసీ వసతిగృహాల్లో బయోమెట్రిక్
► డమ్మీ హాజరుకు ఇక స్వస్తి
► జిల్లాకు చేరిన 98 యంత్రాలు
► నాలుగు చోట్ల అమలు
జలుమూరు : జిల్లాలో అన్ని బీసీ వసతిగృహాల్లో ఇక బయోమెట్రిక్ విధానం అమలు కానుంది. బోగస్ హాజరును నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.ఇన్నాళ్లు వసతిగృహాల్లో లేని విద్యార్థులను సైతం లెక్కల్లో చూపి నిధులను కాజేస్తుండగా దానికి ప్రభుత్వ నిర్ణయంతో బ్రేకులు పడనున్నారుు. ఇప్పటికే బయోమెట్రిక్‌కు సంబంధించి జిల్లాకు 99 యంత్రాలు చేరగా వీటిలో నాలుగు చోట్ల విధానం అమలు ప్రారంభమైంది.
జిల్లాలో అమలు ఇలా...
జిల్లాలో వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థుల హాజరును నమోదు చేసేందుకు బయోమెట్రిక్ విధానం అమలు చేయనుంది. మొత్తం 78 బీసీ బాలుర, బాలికల వసతిగృహాలు ఉండగా నాలగవ తరగతి నుంచి 10వ తరగతి వరకూ 7675 మంది విద్యార్థులు చదువుతున్నారు. పోస్టు మెట్రిక్(కళాశాల) విద్యార్థులు వసతిగృహాలకు సంబంధించి 22 ఉండగా ఇందులో 2525 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారు... ఎంత మంది ఇంటికి వెళ్తున్నారు... అనే స్పష్టత కొన్ని వసతిగృహాల్లో ఉండటంలేదు. విద్యార్థుల హజరు ప్రశ్నార్థకం కావడంతో విద్యార్థుల సంరక్షణ, సంక్షేమంపై శ్రద్ధతీసుకునేందుకు ఈ బయోమెట్రిక్ హాజరు కీలకం కానున్నది. దీంతో వీటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
అన్ని వసతిగృహాల్లో...
జిల్లాలో అన్ని వసతిగృహాల్లో త్వరలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసి వాటి ద్వారానే విద్యార్థుల హాజరు తీసుకుంటాం. దీని వల్ల విద్యార్థుల హాజరుపై ఒక స్పష్టత వచ్చి విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం కలుగుతుంది. ఇప్పటికే శ్రీకాకుళంలో నాలుగు చోట్ల అమలు కాగా మిగిలిన చోట్ల విడతలు వారీగా అమలు చేస్తాం. -ధనుంజయరావు, బీసీ సంక్షేమ శాఖ డీడీ, శ్రీకాకుళం