BC Employees
-
బీసీలు రాజ్యాధికారం సొంతం చేసుకోవాలి
కాచిగూడ: బీసీలు ఐక్యంగా ఉండి రాజ్యాధికారం సొంతం చేసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన కాచిగూడలోని అభినందన్ గ్రాండ్లో మంగళవారం ఏర్పాటు చేసిన బీసీల రాజకీయ చైతన్య శిక్షణాతరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీల వాటా బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీల నాయకత్వం పెరగాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకోకపోతే దేశంలో బీసీల తిరుగుబాటు మొదలవుతుందని కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, జన గణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని, బీసీల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్‌ను తొలగించాలని అన్నారు. ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో బీసీలకు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని సమావేశంలో ప్రతినిధులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, లాల్ కృష్ణ, కోల జనార్ధన్, నీల వెంకటేష్, మట్టా జయంతి, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించాలి
హైదరాబాద్: బీసీ ఉద్యోగులకు పదోన్నతు ల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ సభ జరిగింది. సంఘం అధ్యక్షుడు కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాలెండర్‌ను ఆవిష్కరించి న తర్వాత ఆయన ప్రసంగించారు. బీసీల విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై క్రీమీలేయర్ నిబంధనను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రా న్ని కోరారు. పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 50 శాతానికి పెం చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ ఎ.గోపాలరావు, ఉన్నతాధికారి జె. శ్రీనివాస్‌రెడ్డి, సంఘం ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్నగౌడ్, నేతలు బ్రహ్మేంద్రరావు, శేఖర్‌బాబు, జి. స్వామి, కె. సత్యనారాయణ, బీసీ సంక్షేమ సంఘం నేత గుజ్జ కృష్ణ పాల్గొన్నారు. -
జనవరి 5న బీసీ ఉద్యోగుల మహాసభలు
హైదరాబాద్: బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ జనవరి 5న బీసీ ఉద్యోగుల మహాసభలు నిర్వహించ నున్నట్లు బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. శనివారం ఇక్కడ బీసీ భవన్ లో జరిగిన తెలంగాణ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లా డారు. చట్టపరమైన, రాజ్యాంగపరమైన, న్యాయపరమైన అవరోధాలు ఏమీ లేకున్నా గత పాలకులు బీసీ ఉద్యో గులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్ట లేదని విమర్శించారు. 54 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో బీసీ ఉద్యోగులు కేవలం 4 లక్షల 62 వేల మందే ఉన్నారని అన్నారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి 50 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని కోరారు. 56 శాతం జనాభా ఉన్న బీసీలకు అసెంబ్లీ, పార్లమెంటులో 14 శాతం ప్రాతినిధ్యం కూడా లేదన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాల నుంచి ఒక్క బీసీ ఎంపీ లేరని, 2,600 బీసీ కులాల్లో 2,550 కులాలు ఇప్పటివరకు పార్లమెంటులో అడుగు పెట్టలేదన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. సమావేశంలో బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్ల కోసం చలో ఢిల్లీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లోని బీసీ ఉద్యోగులకు పదోన్నతు ల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఇందుకు రాజ్యాంగ సవరణ అవసరమని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో సవరణ చేయాలని కోరింది. ఇందులో భాగంగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు నవంబర్‌లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ముందుగా వరంగల్, నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించి బీసీ వర్గాల్లో చైతన్యం తీసుకొస్తామని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీ భవన్లో సోమవారం జరిగిన బీసీ ఉద్యోగుల రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలన్నారు. -
పార్లమెంట్ ముందు కవాతు చేస్తాం: ఆర్ కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ పార్లమెంట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకోకపోతే పార్లమెంట్ ముందు లక్ష మంది బీసీ ఉద్యోగులతో కవాతు నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం బీసీ భవన్లో ఏపీఎస్ఆర్టీసీ బీసీ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. అది బీసీల రాజ్యాంగబద్ధ హక్కు అన్నారు. మండల్ కమిషన్, నాచియప్పన్ కమిటీ, సుప్రీంకోర్టు తీర్పు.. ఇవన్నీ చెప్పినా కేంద్ర ప్రభుత్వం బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించడం లేదని విమర్శించారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ బద్ధత కల్పించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఏపీఎస్ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి నిరంజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు హరినాథ్, ర్యాగ రమేష్, తిరుమని కొండల్, ఎస్సార్ కుమార్, సదానంద్, బండి స్వామి, వారాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ బిల్లుకు 19న పార్లమెంటు ముట్టడి
సాక్షి, హైదరాబాద్: బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కోరుతూ ఈ నెల 19న పార్లమెంటును ముట్టడించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం తెలిపింది. అలాగే బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని, రాజ్యాధికారంలో వాటా కల్పించాలని కోరుతూ ఈ నెల 22న ఢిల్లీలో రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.