సాక్షి, హైదరాబాద్: బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ పార్లమెంట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకోకపోతే పార్లమెంట్ ముందు లక్ష మంది బీసీ ఉద్యోగులతో కవాతు నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం బీసీ భవన్‌లో ఏపీఎస్‌ఆర్టీసీ బీసీ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగాన్ని సవరించాలని డిమాండ్ చేశారు.
అది బీసీల రాజ్యాంగబద్ధ హక్కు అన్నారు. మండల్ కమిషన్, నాచియప్పన్ కమిటీ, సుప్రీంకోర్టు తీర్పు.. ఇవన్నీ చెప్పినా కేంద్ర ప్రభుత్వం బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించడం లేదని విమర్శించారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ బద్ధత కల్పించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఏపీఎస్ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి నిరంజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు హరినాథ్, ర్యాగ రమేష్, తిరుమని కొండల్, ఎస్సార్ కుమార్, సదానంద్, బండి స్వామి, వారాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.