కాపులను బీసీల్లో చేర్చొద్దు
అనంతపురం, సప్తగిరి సర్కిల్ : రాజకీయ లబ్ధికోసం కాపులను బీసీ కులాల్లో చేర్చొద్దని ఏపీ బీసీ ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అన్నా రామచంద్రయ్య, బూసా సాంబశివరావు ముఖ్య అతిథులుగా మాట్లాడారు. కాపులతోపాటు, ఇతర అగ్రకులాల వారిని బీసీ జాబితాలో చేర్చడం తమ హక్కుల్లో వారికి వాటా కల్పించడమేనన్నారు. ‘కాపులను బీసీల్లో చేర్చటం తప్పు, అది బీసీల రిజర్వేన్లకు ముప్పు’ అనే నిర్థిష్ట అవగాహనతో బీసీ ఐక్యకార్యాచరణ సమితి ముందుకు వెళ్తోందన్నారు. భవిష్యత్ కార్యాచరణ అన్ని కుల సంఘాలను కలుపుకొని, బీసీ సంఘాల జేఏసీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీసీ కులాలకు సంబంధించి స్పష్టమైన జీవోను విడుదల చేసి బీసీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేషఫణి, జిల్లా కన్వీనర్ సుధాకర్ యాదవ్, అమర్‌యాదవ్, లింగమయ్య, శ్రీనివాసులు, పవన్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.