గజ్వేల్ నుంచే కేజీ టు పీజీకి శ్రీకారం..!
జగదేవ్‌పూర్: సీఎం కేసీఆర్ నియోజవర్గమైన గజ్వేల్ నుంచే కేజీ టు పీజీ పథకానికి ప్రారంభోత్సవం చేస్తామని బీసీ వెల్పేర్ రెసిడెన్షియల్ సెక్రటరీ మల్లయ్య భట్టు పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రమైన జగదేవ్‌పూర్‌లో కేజీ టు పీజీ తాత్కలిక భవనాలను ఆయన పరిశీలించారు. ఎస్సీ, బీసీ హాస్టల్, స్త్రీ శక్తి భవనాలతో పాటు కేజీ టు పీజీకి కేటాయించిన స్థలాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ర్టంలో తొలిసారిగా సీఎం నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్ నుంచి కేజీ టు పీజీ పథకాన్ని ప్రారంభించడానికి తగిన వసతులను పరిశీలిస్తున్నామన్నారు.
జగదేవ్‌పూర్‌లోని ఎస్సీ, బీసీ, స్త్రీ శక్తి భవనాలు అనుకూలంగా ఉన్నాయని, డిగ్రీ కోసం భవనాలను పరిశీలిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు విద్యార్థుల నుంచి డిగ్రీ కోసం వెయ్యి, ఇంటర్ కోసం 5 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. 5 వ తరగతి కోసం మంగళవారం నాటికి 11 వేల దరఖాస్తులు వచ్చాయని, ఈ నెల 8 చివరి తేదీ కావడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇంటర్ బీసీ బాలికల రెసిడెన్షియల్ విద్యాలయాలు మూడు చోట్ల నడుస్తున్నాయన్నారు.
జిల్లాలో దౌల్తాబాద్, కరీంనగర్ జిల్లాలో కమలాపూర్లతో పాటు జగదేవ్‌పూర్‌లో ప్రారంభం కానున్నదన్నారు. అలాగే మరో 16 రెసిడెన్షియల్ విద్యాలయాలు ఏర్పాటు కోసం సీఎం వద్ద పైళ్లు ఉన్నాయని వివరించారు. ఈ నెల10న దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు అన్లైన్ ద్వారా హాల్ టిక్కెట్లు అందిస్తామన్నారు. 17న ఎంట్రెన్స్ నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కేజీ టు పీజీని విజయవంతం చేస్తామన్నారు.
కాగా కేజీ టు పీజీ ద్వారా మెరుగైన విద్యనందిస్తామని, ఓయూ కంటే మెరుగైన వసతులు, విద్యను అందిస్తామని తెలిపారు. నలుగురి విద్యార్థులకు ఒక గది ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. అలాగే కంప్యూటర్, ల్యాబ్ గదులను వేర్వేరుగా ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం జగదేవ్‌పూర్‌లో కేజీ టు పీజీ కోసం కేటాయించిన 41 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంఈఓ సుగుణకర్, సర్పంచ్ కరుణకర్, ఉపాద్యాయులు శశిధర్‌శర్మ, జోజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.