సంగక్కరకు బీసీసీఐ సన్మానం
కొలంబో: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్న లంక మాజీ సారథి కుమార సంగక్కరను బీసీసీఐ సన్మానించింది. గురువారం ప్రారంభమైన రెండో టెస్టుకు ముందు ఈ కార్యక్రమం జరిగింది. ‘సంగక్కర దిగ్గజ క్రికెటర్. మైదానంలో, బయటా అతని వ్యక్తిత్వం అద్భుతం. మన కాలంలో అత్యంత నిలకడైన బ్యాట్స్‌మెన్‌లో ఒకరిగా పేరు సంపాదించాడు. ప్రపంచ వ్యాప్తంగా యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాడు. సంగక్కర భవిష్యత్ బాగుండాలని బీసీసీఐ తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా కూడా సంగకు అభినందనలు తెలిపారు. కేవలం లంక జట్టుకే కాకుండా క్రికెట్‌కే సంగక్కర పెద్ద అంబాసిడర్ అని కొనియాడారు.
కోచ్‌పై నిర్ణయం సెప్టెంబరులో
భారత జట్టుకు కొత్త చీఫ్ కోచ్‌పై సెప్టెంబర్‌లో తుది నిర్ణయం తీసుకుంటామని ఠాకూర్ వెల్లడించారు. ఈ అంశాన్ని సలహాదారుల కమిటీతో చర్చిస్తామన్నారు. ‘ఏ జట్టుకైనా పూర్తిస్థాయి కోచ్ ఉండటం చాలా అవసరం. కోచ్ అంశంపై కసరత్తులు చేయడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి సెప్టెంబర్‌లో తుది నిర్ణయం తీసుకుంటాం. టీమ్ డెరైక్టర్‌గా శాస్త్రి బాగానే పని చేస్తున్నారు. అతని గురించి ఆటగాళ్లు కూడా మంచి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే పూర్తిస్థాయి కోచ్ ఉంటే ఎలాంటి సెటప్ ఉండాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలి. జట్టుతో పాటు 10 మంది కోచ్‌లు ఉండలేరు. కాబట్టి ఈ విషయాన్ని సలహాదారుల కమిటీకి వదిలేశాం. ఎంత మందిని నియమించాలనే దానిపై వాళ్లు నిర్ణయం తీసుకుంటారు. దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందే ఈ పని పూర్తి చేస్తాం’ అని ఠాకూర్ వివరించారు.