నగదు లావాదేవీలపై పన్ను విధింపు
రూ.50 వేలకు మించి విత్ డ్రా చేసినా, లావాదేవీ జరిపినా పన్ను
చంద్రబాబు కమిటీ సిఫారసు..
నగదు విత్‌డ్రాపై గరిష్ట పరిమితి
ఆధార్ ఆధారిత నగదు రహిత లావాదేవీలపై చార్జీలు వద్దు
సాక్షి, న్యూఢిల్లీ: నగదు లావాదేవీలు 50 వేల రూపాయలకు పైబడితే పన్ను విధించాలని ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని నగదు రహిత లావాదేవీల అమలు కమిటీ సిఫారసు చేసింది. రూ.50 వేలు, ఆ పైబడి నగదు ఉపసంహరించుకున్నా, లేక అంతమొత్తంలో లావాదేవీ జరిపినా పన్ను (బీసీటీటీ) విధిం చాలని సిఫారసు చేసింది. నగదును ఉప సంహరించుకునేందుకు గరిష్ట పరిమితి విధిం చాలని సూచించింది. ఈ కమిటీ మంగళ వారం ఇక్కడ నీతిఆయోగ్‌లో సమావేశమై మధ్యంతర నివేదికను రూపొందించింది.
కమిటీ కన్వీనర్ చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, సిక్కిం సీఎం చామ్లింగ్, నీతిఆయోగ్ ప్రతినిధులతో కూడిన బృందం ఈ నివేదికను ప్రధాని మోదీకి సమర్పించింది. ఆధార్ ఆధారిత నగదు రహిత లావాదేవీలన్నింటిపై చార్జీలను పూర్తిగా సున్నా స్థాయికి తీసుకురావాలని, నగదును భారీగా వినియోగించకుండా ఉండేందుకు గాను నగదు లావాదేవీలపై పన్ను విధించాలని కమిటీ సిఫారసు చేసింది. నగదు రహిత లావాదేవీలకు రాయితీలు ఇవ్వాలని సూచించింది. ఆయా వివరాలను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా, సీఈవో అమితాబ్ కాంత్‌తో కలసి చంద్రబాబు నీతిఆయోగ్‌లో విలేకరు లకు వెల్లడించారు. ఆధార్ ఆధారిత చెల్లింపు విధానాన్ని (ఏఈపీఎస్) విస్తృతంగా ప్రోత్సహించాలని సిఫారసు చేశామన్నారు.
కీలక సిఫారసులు ఇవీ..
♦ వర్తకులు నగదు రహిత లావాదేవీలు అమలు చేసేందుకు వీలుగా వారిపై చార్జీలు, పన్నులు లేకుండా చూడాలి.
♦ మైక్రో ఏటీఎంలు, బయోమెట్రిక్ సెన్సర్లకు పన్ను రాయితీ వర్తింపజేయాలి. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలి.
♦ నగదు రహిత లావాదేవీలను అమలు చేసేవారికి పన్నును తిరిగి చెల్లించాలి.
♦ ఆధార్ చెల్లింపులకు వీలుగా బయోమెట్రిక్ సెన్సర్లను 50 శాతం సబ్సిడీపై ఇవ్వాలి.
♦ ఆధార్ ఆధారిత చెల్లింపులపై ఎండీఆర్ విధించరాదు. ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
♦ ఆదాయ పన్ను పరిధిలోకి రాని పౌరులు, చిరు వర్తకులకు స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు గాను రూ. 1000 రాయితీ ఇవ్వాలి.
♦ 1,54,000 పోస్టాఫీసుల్లో ఆధార్ ఆధారిత మైక్రో ఏటీఎంలు సమకూర్చాలి.
♦ నగదు రహిత లావాదేవీల ద్వారా సమకూరే మొత్తాలతో లావాదేవీలకు అవసరమైన మౌలిక వసతులను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలకొల్పాలి.
♦ బస్సుల్లో, సబర్బన్ రైళ్లలో ప్రయాణికులు కాంటాక్ట్ లెస్ చెల్లింపులు చేసేందుకు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి.
♦ ఆధార్ నంబర్‌ను ఉపయోగించి సాధారణ ఫోన్ ద్వారా యూఎస్ఎస్డీ పరిజ్ఞానంతో లావాదేవీలు జరిపే సౌలభ్యాన్ని ఈ నెలలోగా కల్పించాలి.
♦ రూ. 50 వేలు, ఆ పైబడిన నగదు లావాదేవీలపై బ్యాంకింగ్ క్యాష్ ట్రాన్సా క్షన్ టాక్స్‌ను అమలు చేయాలి.
♦ బీమా, విద్యాసంస్థలు, ఎరువులు, పీడీఎస్, పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలోని లావాదేవీ లన్నిటినీ నగదు రహితంగా మార్చాలి.
♦ ప్రభుత్వ సంస్థలకు చెల్లించే నగదు రహిత లావాదేవీలపై తక్కువగా గానీ, లేదా సున్నా స్థాయిలో గానీ ఎండీఆర్ చార్జీలు ఉండాలి.
♦ కేవైసీ సమర్పణకు ఆధార్‌ను ప్రాథమిక గుర్తింపుగా చేయాలి. ఆధార్ చట్టంలోని సెక్షన్ 57ను వర్తింపజేయాలి.