కూలీల 'కూల్' ఐడియా అదుర్స్
ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు పట్టణ ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు.. చెట్లు లేవుకాబట్టి! ఇక ఊళ్లలో చెట్లున్నా ఉక్కపోత సమస్య. వడదెబ్బకు గురై చనిపోతున్నవారిలో కూలీలు, చిన్నచిన్న పనులు చేసుకునేవారి సంఖ్యే ఎక్కువ. ఈ పరిస్థితుల్లో ఎండ తీవ్రతను అధిగమించేందుకు కేరళలోని కొందరు కూలీలు అమలుచేసిన ఐడియా నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
కాసరగోడ్ జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో బావి తవ్వేందుకు ఒప్పందం కుదుర్చుకున్న కూలీలు.. పంకాను ఏర్పాటుచేసుకుని పనికానిస్తున్నారు. భూ ఉపరితలం కంటే లోతుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత ఎక్కువ అవుతుందని తెలిసిందే. ఆ వేడిగాలిని బయటికి పంపి, బయటి గాలిని లోపలికి నెట్టే ఫ్యాన్ సాయంతో పనిచేయగలుగుతున్నామని చెబుతున్నారు కూలీలు. హీట్ ను బీట్ చెయ్యడానికి భలే ఐడియా కదా ఇది!
మారణహోమం సృష్టిస్తూ ఇప్పటికే దాదాపు 1000 మంది తెలుగువాళ్లను పొట్టన పెట్టుకుంది మాయదారి ఎండ. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రతరం కానుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయినాసరే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉపశమన చర్యలు చేపట్టేదిశగా అడుగులు వేయట్లేదు! అటు కర్ణాటకలోనైతే ఏకంగా ఆరెంజ్ అలర్ట్ జారీఅయింది. కేరళ, తమిళనాడులలోనైతే భానుడిప్రతాపానికి తోడు 'ఎన్నికల' రాజకీయవేడీ జనాన్ని అతలాకుతలం చేస్తోంది.