ముఖ్యమంత్రి కావాలని ఉంది
నాకు ముఖ్యమంత్రి కావాలని ఆశగా ఉందనే అభిప్రాయాన్ని నటి త్రిష వ్యక్తం చేశారు. కలలు కనాలి. వాటిని నెరవేర్చుకోవడానికి నిరంతరం కృషి చేయాలన్న మన విజ్ఞాన గని, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం హితవును నటి త్రిషకు అమలు పరస్తున్నట్లుంది కదూ! అయితే నిరంతర శ్రమతోనే ఈ చెన్నై చిన్నది నటిగా ఈ స్థాయికి చేరుకున్నారన్నది మరచిపోరాదు.సాధారణంగా హీరోయన్ల పరిమితి చాలా తక్కువగానే ఉంటుంది. మహా అరుుతే ఐదేళ్లు రాణించగలరు. అలాంటిది 15 ఏళ్లుగా ఏకధాటిగా నాయకి స్థానంలోనే ప్రకాశిస్తున్న అతి తక్కువ మంది నటీమణుల్లో త్రిష ఒక్కరు. ఎన్ని వివాదాల్లో చిక్కుకున్నా నటిగా మాత్రం తన స్థానాన్ని కోల్పోలేదు. ఇప్పటికీ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా ధనుష్‌కు జంటగా నటించిన కొడి చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. విశేషం ఏమిటంటే ఇందులో తను రాజకీయనాయకురాలిగా నటించారు.
ఇలాంటి తరుణంలో తనకు ముఖ్యమంత్రి కావాలని ఆశగా ఉందని ఒక భేటీలో ఈ భామ పేర్కొనడం గమనార్హం.అయితే త్రిషకు నిజంగానే రాజకీయరంగంపై మోహం పెరిగిందా? లేక మరేదైనా ఉద్దేశంతో అలా అన్నారా? ఎందుకంటే సినీ కథానాయకులు, నాయకిల తదుపరి గురి రాజకీయరంగంగా మారుతుండడం చూస్తున్నాం. అయితే త్రిష కోరిక మాత్రం వేరే. కొడి చిత్రంలో రాజకీయనాయకురాలి పాత్రలో నటించిన త్రిష తనకు ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించాలని ఆశగా ఉందని పేర్కొన్నారు. అంతే కాదు అలాంటి అవకాశం వస్తే వదులుకోనని అన్నారు. మరో విశేషం ఏమిటంటే ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలో చదువుకున్న చర్చ్‌పార్క్ పాఠశాలలోనే నటి త్రిష విద్యాభ్యాసం చేశారన్నది గమనార్హం. అదే విధంగా ఈ మధ్య ముఖ్యమంత్రి చేతుల మీదగా అవార్డును కూడా అందుకుందీ ఈ బ్యూటీ.