పీహెచ్డీ ఉంటేనే బీఈడీ ప్రిన్సిపాల్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బీఈడీ కళాశాలల్లో ప్రిన్సిపాల్‌గా పని చేయాలంటే విద్యావిభాగంలో పీహెచ్డీ అర్హత ఉండాల్సిందే. తాజాగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) విధించిన సరికొత్త నిబంధన ఇది. ఈ మేరకు అన్ని కళాశాలలకు ఆదేశాలు అందాయి. దీంతోపాటు 2015-17 విద్యా సంవత్సరం నుంచే బీఈడీని రెండేళ్ల కోర్సుగా ప్రవేశపెట్టనున్నట్లు ఎన్సీటీఈ ప్రకటించింది. దీనికోసం అన్ని కళాశాలల్లో వసతులు, అధ్యాపక అర్హతలు, మౌలిక సదుపాయాలను పర్యవేక్షించేందుకు ఎన్సీటీఈ అధికారుల బృందం అక్టోబర్‌లో పర్యటించనుంది. తాజా నిబంధనలతో బీఈడీ కళాశాలల యాజమాన్యాలు, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రిన్సిపాల్స్ హడలిపోతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో విద్యా విభాగంలో పీహెచ్డీ చేసిన పట్టభద్రులు వందలోపే ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.