రైలు కిందపడి ఇద్దరి ఆత్మహత్య
జహీరాబాద్ (మెదక్ జిల్లా): సొంత గ్రామానికి వెళ్లలేక రెండో భార్యతో కలసి భర్త రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా జహీరాబాద్ సమీపంలోని బీదర్ రైల్వే గేటువద్ద ఆదివారం చోటు చేసుకుంది. మృతులు మహారాష్ట్రకు చెందిన వారు. వికారాబాద్ రైల్వే పోలీసుల కథనం మేరకు.. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా, నీలంగ తాలూకా శిలవంతవాడి గ్రామానికి చెందిన వడ్డెర దాసప్ప (28), అనూషలకు ఓ కుమార్తె, ఒక కుమారుడు ఉన్నాడు. దాసప్ప కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే వాడు. అయితే దాసప్పకు ఇంటికి సమీపంలో ఉంటున్న శన్నూబీ (25)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
గ్రామస్తులకు విషయం తెలియడంతో మందలించారు. అయినా.. ఇరువురు ఆరు నెలల క్రితం వివాహం చేసుకుని గ్రామం నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. దాసప్ప వద్ద లభించిన డైరీలో ‘మేం ఆత్మహత్య చేసుకుంటున్నాం. మా ఇద్దరి మృతదేహాలను ఒకే గోతిలో పాతి పెట్టండి’ అని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ శివలింగం సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు దర్యాప్తులో ఉంది.