begging business
-
పేరుకే బిచ్చగాడు.. సీఎం సహాయనిధికి భారీగా విరాళం
తిరువళ్లూరు: బిక్షాటన చేయడం ద్వారా వచ్చిన రూ.10 వేల నగదును సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడో యచకుడు. తూత్తుకుడి జిల్లా సాత్తాన్‌కుళం సమీపంలోని ఆళంగినర్ గ్రామానికి చెందిన యాచకుడు పూల్పాండి(75). భార్య మృతి చెందిన తరువాత తన పిల్లలు ఉద్యోగం కోసం ఇతర ప్రాంతానికి వెళ్లడంతో ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. బిక్షాటన చేయడం ద్వారా వచ్చే నగదును విద్య, వైద్యం, ఆనాథ ఆశ్రమాలకు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పదేళ్లలో పాండిచ్చేరితో పాటు చైన్నె, తూత్తుకుడి, కన్యాకుమారి, విల్లుపురం, వేలూరు, సేలం, నీలగిరి, కోయంబత్తూరు సహా వేర్వేరు జిల్లాలకు చెందిన కలెక్టర్లను కలిసి ఇప్పటి వరకు యాచించిన రూ. 5.60 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. తాజాగా రెండు నెలల్లో బిక్షాటన చేయడం ద్వారా వచ్చిన రూ.10 వేలను కల్తీసారా తాగి విల్లుపురం చెంగల్పట్టు జిల్లాలో మృతి చెందిన కుటుంబాలకు అందించాలని నిర్ణయించారు. మంగళవారం తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ఆల్బీజాన్‌వర్గీష్‌ను కలిసి నగదు అందజేశారు. అనంతరం మీడియాతో పూల్పాండి మాట్లాడుతూ.. డబ్బులు ఉంటే మనఃశాంతి ఉండదని, మనస్సు ఉన్న వారి వద్ద డబ్బులు ఉండడం లేదని తెలిపారు. తాను బిక్షాటన చేయడం ద్వారా వచ్చే నగదులో కొంత భాగాన్ని తిండి కోసం ఉపయోగిస్తున్నానని చెప్పారు. తనకు మూడుపూటల ఆహారం, కట్టుకోవడానికి గుడ్డ ఉంటే చాలని పేర్కొన్నారు. మిగిలిన మొత్తాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు వివరించారు. త్వరలోనే వృద్ధాశ్రమానికి వెళ్లి విశ్రాంతి తీసుకోనున్నట్లు పాండి తెలిపారు. -
భిక్షగాళ్లకు బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు
మంచి సెంటర్ దొరికితే.. దానికి మించిన బిజినెస్ లేదు. సీజన్‌తో సంబంధం లేకుండా 365 రోజులూ సంపాదన. ఖర్చులు పోగా ప్రతిరోజూ బ్యాంకు ఖాతాల్లో పొదుపు.. ఇదంతా ఏంటని అనుకుంటున్నారా? రాజస్ధాన్‌లోని అజ్మీర్లోగల ప్రఖ్యాత ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ దర్గా దగ్గర భిక్షగాళ్ల వ్యవహారం. అవును.. అజ్మీర్ దర్గా దగ్గర భిక్షగాళ్ల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతోంది. చేతినిండా డబ్బులు పడుతుండటంతో.. చాలామంది భిక్షగాళ్లు బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు కూడా నిర్వహిస్తున్నారట. బిహార్ నుంచి వచ్చిన పప్పు సింగ్ అనే భిక్షగాడు.. ప్రతిరోజూ తన ఖాతాలో కనీసం రూ. 200 అయినా డిపాజిట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతడు అనుకోకుండా భిక్షగాడు అయ్యాడు. అతడు గతంలో ఒకసారి ప్రమాదానికి గురైనప్పుడు ఆశీర్వాదాల కోసం అజ్మీర్ దర్గాకు వచ్చాడు. అయితే.. కొంతమంది భక్తులు అతడు భిక్షగాడు అనుకుని భిక్షం వేయడం మొదలుపెట్టారు. మొదట్లో ఇదేంటని తనకు కోపం వచ్చిందని, కానీ తర్వాత ఇదేదో ఆయన ఆశీర్వాదాలతోనే వచ్చిందని అనుకున్నానని తెలిపాడు. అలా వచ్చిన డబ్బులతో ప్రతిరోజూ బ్యాంకు ఖాతాలో కనీసం రూ. 200 డిపాజిట్ చేస్తున్నట్లు చెప్పాడు. త్రిపుర నుంచి వచ్చిన మరో ఇద్దరు భిక్షగాళ్లు సోదరులు. వాళ్లిద్దరికీ కెనరా బ్యాంకులో జాయింట్ అకౌంట్ ఉంది. రజా ఇస్లాం, సహీదుల్ ఇస్లాం అనే ఈ ఇద్దరూ గత పదేళ్లుగా అజ్మీర్‌లోనే ఈ బెగ్గింగ్ వ్యాపారం చేస్తున్నారు. ఇద్దరులో సహీదుల్ అంధుడు. దాంతో రజా అతడికి సాయం చేస్తుంటాడు. నసీమా ఖాను అనే 62 ఏళ్ల మహిళ అజ్మీర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిషన్‌గఢ్ నుంచి ప్రతిరోజూ వచ్చి దర్గా దగ్గర భిక్షాటన చేస్తుంది. ప్రతి రెండు మూడు రోజులకోసారి ఆమె తనకు వచ్చిన డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది. ఏటీఎం కార్డుతో ఎంత మొత్తం ఉందో సరిచూసుకుంటుంది. ఇలా అజ్మీర్ దర్గా దగ్గర ఉన్న భిక్షగాళ్లలో దాదాపు ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు నిర్వహించుకుంటున్నారు.