పేరుకే బిచ్చగాడు.. సీఎం సహాయనిధికి భారీగా విరాళం | Sakshi
Sakshi News home page

పేరుకే బిచ్చగాడు.. సీఎం సహాయనిధికి భారీగా విరాళం

Published Wed, May 24 2023 1:48 AM

కలెక్టర్‌కు నగదు ఇస్తున్న యాచకుడు పూల్‌పాండి    - Sakshi

తిరువళ్లూరు: బిక్షాటన చేయడం ద్వారా వచ్చిన రూ.10 వేల నగదును సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడో యచకుడు. తూత్తుకుడి జిల్లా సాత్తాన్‌కుళం సమీపంలోని ఆళంగినర్‌ గ్రామానికి చెందిన యాచకుడు పూల్‌పాండి(75). భార్య మృతి చెందిన తరువాత తన పిల్లలు ఉద్యోగం కోసం ఇతర ప్రాంతానికి వెళ్లడంతో ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. బిక్షాటన చేయడం ద్వారా వచ్చే నగదును విద్య, వైద్యం, ఆనాథ ఆశ్రమాలకు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

పదేళ్లలో పాండిచ్చేరితో పాటు చైన్నె, తూత్తుకుడి, కన్యాకుమారి, విల్లుపురం, వేలూరు, సేలం, నీలగిరి, కోయంబత్తూరు సహా వేర్వేరు జిల్లాలకు చెందిన కలెక్టర్‌లను కలిసి ఇప్పటి వరకు యాచించిన రూ. 5.60 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. తాజాగా రెండు నెలల్లో బిక్షాటన చేయడం ద్వారా వచ్చిన రూ.10 వేలను కల్తీసారా తాగి విల్లుపురం చెంగల్‌పట్టు జిల్లాలో మృతి చెందిన కుటుంబాలకు అందించాలని నిర్ణయించారు. మంగళవారం తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌ ఆల్బీజాన్‌వర్గీష్‌ను కలిసి నగదు అందజేశారు.

అనంతరం మీడియాతో పూల్‌పాండి మాట్లాడుతూ.. డబ్బులు ఉంటే మనఃశాంతి ఉండదని, మనస్సు ఉన్న వారి వద్ద డబ్బులు ఉండడం లేదని తెలిపారు. తాను బిక్షాటన చేయడం ద్వారా వచ్చే నగదులో కొంత భాగాన్ని తిండి కోసం ఉపయోగిస్తున్నానని చెప్పారు. తనకు మూడుపూటల ఆహారం, కట్టుకోవడానికి గుడ్డ ఉంటే చాలని పేర్కొన్నారు. మిగిలిన మొత్తాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని కలెక్టర్‌ల ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు వివరించారు. త్వరలోనే వృద్ధాశ్రమానికి వెళ్లి విశ్రాంతి తీసుకోనున్నట్లు పాండి తెలిపారు.

 
Advertisement
 
Advertisement