బేగంపేట కార్యాలయమే బెటర్
క్యాంప్ ఆఫీస్‌పై మనసు మార్చుకున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బేగంపేటలో ఉన్న పాత క్యాంప్ కార్యాలయంవైపే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మొగ్గు చూపుతున్నారు. ఈ భవనానికి వాస్తుదోషాలు ఉన్నాయని వ్యక్తిగత వాస్తు పండితులు చెప్పడంతో ఇక్కడ ఉండటానికి మొదట్లో ఆయన నిరాకరించారు. దీంతో కుందన్‌బాగ్‌లోని మూడు క్వార్టర్లను కలిపి సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆ క్వార్టర్లలో అప్పటిదాకా ఉన్న ఉన్నతాధికారులను ఆఘమేఘాల మీద ఖాళీ చేయించారు. క్వార్టర్లకు మరమ్మత్తులు కూడా ప్రారంభించారు. అయితే తాజాగా వీటిని పరిశీలించిన సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సందుగొందుల్లో ఉన్న ఆ క్వార్టర్లలో ఎలా ఉంటామంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్కడి నుంచి వెళ్లి బేగంపేటలోని పాత క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు. ఇదే బాగుందని అభిప్రాయపడ్డారు. ముందు భాగంలో చిన్న చిన్న వాస్తు లోపాలున్నా.. నివాస ప్రాంతమంతా బాగానే ఉందని అధికారులకు కేసీఆర్ చెప్పారు. బేగంపేట క్యాంపు కార్యాలయానికే మారుతాన న్నారు. అక్కడ కొన్ని మార్పులను సూచించి, వెంటనే పూర్తి చేయాలని అధికారులను కేసీఆర్ మంగళవారం ఆదేశించారు. కాగా, అసెంబ్లీ ప్రాంగణంలోని పోచమ్మ గుడిలో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. నివాసం నుంచి అసెంబ్లీకి చేరుకున్న ఆయన నేరుగా అక్కడి గుడికి వెళ్లి పూజలు చేశారు.