రక్షణ కోసం కర్రలతో స్కూల్‌కి విద్యార్థినులు..
బెల్గావి: దేశంలో ఎక్కడో ఒకచోటా నిత్యం మహిళలు, బాలికలు లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. మరోవైపు ఆకతాయిల వేధింపులు తాళలేక కొందరు ఆత్మహత్యే తమకు శరణ్యమని బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు లేకపోలేదు. ఇలాంటి అకతాయిల వేధింపులతో బయటకు రావాలంటేనే మహిళలు, చిన్నారులు భయపడిపోతున్నారు. ఇదే తరహా లైంగిక వేధింపులు కర్ణాటక రాష్ట్రంలోని బెల్గావి గ్రామంలో కొనసాగుతున్నాయి. లైంగిక వేధింపులకు పాల్పడే ఆకతాయిల ఆగడాలు ఈ ప్రాంతంలో శృతిమించిపోతున్నాయి. దాంతో అక్కడి గ్రామ వాసులకు రోజు ఒంటరిగా బయటకు రావాలంటేనే ప్రాణసంకటంగా మారింది. తమను తాము రక్షించుకునేందుకు అక్కడి మహిళలు, బాలికలు గుంపుగుంపులుగా బయటకు వస్తున్నారు. అయితే ఈ వేధింపుల సమస్య కేవలం చిన్నారులు, మహిళలకే కాదూ.. వృద్ధ మహిళలనూ సైతం వేధిస్తోంది. బెల్గావి సిటీకి 12 కిలోమీటర్లు దూరంలో ఉన్న వాగ్వాడే గ్రామం నుంచి విద్యార్థినులు ప్రతిరోజూ సమీప గ్రామమైన మార్కెండేలోని స్కూల్‌కు వెళ్తుంటారు. ఇదే మార్గంలో ఆకతాయిలు బైక్‌లపై వచ్చి విద్యార్థినులను వేధించడం సర్వసాధారణమై పోయింది.
ఆకతాయిల ఆగడాలకు అరికట్టేందుకు తమను తాము కాపాడుకునేందుకు తమవెంట కర్రలను తీసుకవెళ్లాలని విద్యార్థినులు సూచించినట్టు ప్యాస్ పౌండేషన్ డైరెక్టర్ కిరణ్ నిప్పాణికార్ స్థానిక మీడియాకు వెల్లడించారు. ప్రతివారం వేధింపుల కేసులు నాలుగు నుంచి ఐదు వరకూ నమోదు అవుతుంటాయని ఆయన చెప్పారు. మరోవైపు బస్సులలో ప్రయాణిస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నట్టు అక్కడి స్థానికులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆకతాయిలు ఆగడాలకు అడ్డుకట్టవేయాల్సి అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అందుకోసమే పాఠశాలకు వెళ్లే విద్యార్థినులను తమ వెంట కర్రలను తీసుకెళ్లాలని తాము సూచించినట్టు తెలిపారు. దీనికోసం ఒక టీమ్‌ను ఏర్పాటు చేసామనీ, వారితో సంప్రదించేందుకు వీలుగా మహిళలకు, విద్యార్థినీలకు పోలీసుల ఫోన్ నెంబర్లు ఇచ్చి.. ఏ సహాయం అవసరమైన వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా సూచించినట్టు చెప్పారు. అయితే నాలుగు ఐదు నెలలుగా లైంగిక వేధింపులు కేసులపై పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఆకతాయిల లైంగిక వేధింపుల విషయంలో ఎలాంటి ప్రయోజనం కనిపించలేదని కిరణ్ నిప్పాణికార్ తెలిపారు.