సేవా నిరతికి ప్రతీక.. అలీస్ మాడె సొరాబ్జీ పెన్నెల్
భారతదేశంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందిన తొలి మహిళ, అలాగే ఆధునిక వైద్యశాస్త్రంలో పట్టా గడించిన ఏడవ మహిళ అలీస్ మాడె సొరాబ్జీ పెన్నెల్. 1874 జూలై 17న బెల్గామ్‌లో జన్మించిన ఆమె తండ్రి క్రైస్తవాన్ని స్వీకరించిన జొరాస్ట్రియన్ కాగా, తల్లి ఆదివాసీ. అలీస్ బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ పట్టా పొందిన తర్వాత, మన దేశపు తొలి తరం మహిళా న్యాయవాదులలో ఒకరైన ఈమె అక్క కొర్నేలియా స్వరాబ్జీ ప్రోత్సాహంతో లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో వైద్యశాస్త్ర పట్టాను 1905లో సాధించారు.భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత బహవల్పూర్లోని జనానా హాస్పిటల్లో డాక్టర్‌గా చేరారు. అక్కడే 1906లో బ్రిటిష్ మిషనరీ డాక్టర్ థియొడర్ లైటన్ పెన్నెల్‌ను కలవడం, 1908లో పెళ్లి చేసుకోవడం సంభవించింది. పిమ్మట ఢిల్లీలోని విక్టోరియా హాస్పిటల్ బాధ్యురాలిగా తరలి వచ్చారు. 1914–18 మధ్య కాలంలో సంభవించిన మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బొంబాయి ప్రెసిడెన్సీలోని మహాబలేశ్వర్ దగ్గర సైనికుల ఆరో గ్యాన్ని కాపాడిన, పర్యవేక్షించిన తొలి మహిళా వైద్యులలో ఈమె కూడా ఒకరు.అఫ్గానిస్తాన్‌లోని గిరిజన తెగల వారితో జీవనం గడిపిన క్రిస్టియన్ మిషనరీ మిస్టర్ పెన్నెల్, తన తల్లి ఇచ్చిన సొమ్ముతో (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న) బన్నులో మిషనరీ ఆసుపత్రిని ప్రారంభించారు. దాంతో అలీస్ పెన్నెల్ కూడా ఈ ఆస్పత్రికి తరలి వెళ్లారు. ఎంతో గౌరవ భావంతో వైద్య వృత్తిని కొనసాగించిన అలీస్ తన భర్తతో కలిసి ఉర్దూ, పష్తూన్ భాషలను నేర్చుకొని అక్కడి పఠాన్ల, పష్తూన్ల హృదయాలను చూరగొన్నారు. అంతే కాదు ఆ ప్రాంతాలలో ఈ దంపతులు జానపద నాయకులుపొందే గౌరవాలను పొందగలిగారు. ఈ సేవలకు ఆమె ‘కైజర్–ఇ–హింద్’ బంగారు పతకాన్ని కూడా పొందారు.చదవండి: అంతర్జాతీయ జీవ పరిణామ దినం.. ఎందుకు జరుపుకుంటారంటే?అయితే ఆమె భర్త 44 ఏళ్ల వయసులో చనిపోవడం విషాదం. ఆసుపత్రిలో పదవీ విరమణ చేసిన తర్వాత అలీస్ ఢిల్లీకి తరలివచ్చి సమాజ, ఆరోగ్య సేవా కార్యక్రమాలలో మునిగి పోయారు. రెండవ ప్రపంచ యుద్ధం మొదలు కాగానే లండన్‌లో స్థిరపడ్డారు. తన 74వ ఏట 1951 మార్చి 7వ తేదీన అలీస్ మాడే సొరాబ్జీ పెన్నెల్ అనారోగ్యంతో కనుమూశారు.– డాక్టర్ నాగసూరి వేణుగోపాల్‌ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి