బళ్లారి గనుల కార్మికులను ఆదుకోండి
మైనింగ్ కార్యకలాపాలు జాతీయ చేయాలని డిమాండ్
గనుల కార్మికుల నిరాహార దీక్షలు
బళ్లారి టౌన్ : బళ్లారి జిల్లాలో మైనింగ్ నిషేధం అనంతరం వీధిన పడిన 25 వేల మంది కార్మికులను ఆదుకోవాలని జిల్లా గని కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డీహెచ్.పూజార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సతీష్, జిల్లాధ్యక్షుడు ఆర్.మానసయ్య తదితరులు మాట్లాడుతూ జిల్లాలో మైనింగ్ కార్మికులు వీధిన పడిన విషయాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 18న ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు.
అయితే ఇంత వరకూ స్థానిక జిల్లా ఇన్చార్జ్ మంత్రి గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని స్పందించలేదన్నారు. మైనింగ్ కార్యకలాపాల నిషేధం అనంతరం సుప్రీంకోర్టు సీఈసీ సిఫార్సుల అమలు కోసం నియమించిన మానిటరింగ్ కమిటీ ఫునర్నిర్మాణం, ఫునర్వసతి పథకం అమలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గనుల మాఫియా ఆక్రమణలు, గనుల సంగ్రహణ వంటి భారీ మొత్తం వసూళ్లు కనీసం ప్రగతి సాధించలేదన్నారు. అంతేగాక అక్రమ మైనింగ్‌కు పాల్పడిన వీఎస్.లాడ్ సన్స్ కంపెనీ, అనిల్ లాడ్, ఆయన భార్య ఆర్తి గౌతం ఆరాని, బీఎంఎం దినేశ్‌సింగ్, ఎంఎస్‌పీఎల్ రావు బల్డోటా, టీఎంసిడబ్ల్యూ వినోద్ గోయల్‌తో పాటు 50 మందిపై సీబీఈ 22 కేసులు నమోదు చేసిందని, వాటి సంగతి ఏమైందని ప్రశ్నించారు.
కార్మిక శాఖ చట్టాలను ఉల్లంఘించి పలు మైనింగ్ కంపెనీలు కార్మికుల వేతనాలు, భవిష్యనిధి, సెటిల్మెంట్ చేయలేక ఐదువేల కుటుంబాల కడుపులు కొట్టారని విమర్శించారు. వీటన్నింటి విషయంలో కార్మికులకు న్యాయం చేకూరేదాకా పోరాటాలు మానేది లేదన్నారు. ప్రస్తుతం జరగనున్న విధానసభ సమావేశంలో వీటన్నిటిపై చర్చలు జరగాలని డిమాండ్ చేశారు.
అనంతరం ‘గనుల మైనింగ్‌ను జాతీయం చేయాలి. మైనింగ్ కాలాపాలలో పాల్గొన్న కార్మికులను పర్మినెంట్ చేయాలి. కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలి. బేలికేరి మైనింగ్ విషయంలో 52 మంది మైనింగ్ మాఫియాలను అరెస్ట్ చేయాలన్న’ ఏడు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు. కార్యక్రమంలో కేఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్, స్థానిక కార్మిక సంఘాల నేతలు వై.గోపి, ఏ.ఎర్రిస్వామి, కాడప్ప తదితరులు పాల్గొన్నారు.