బతికుండగానే.. మూడురోజులు అంత్యక్రియలు!
అది కర్ణాటకలోని బళ్లారి జిల్లా... భీమసముద్ర అనే కుగ్రామం.. అక్కడ ఓ వ్యక్తికి అంత్యక్రియలు చేస్తున్నారు. పాడెమీద పడుకోబెట్టి.. దండలు వేసి, శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ ఒక గొయ్యి తీసి అందులో అతడిని కప్పెట్టారు. గ్రామస్తులంతా ఏడ్చి, తర్వాత ఇళ్లకు తిరిగి వచ్చేశారు. కాసేపు గడిచిందో లేదో.. అతడు గొయ్యిలోంచి బయటకు వచ్చి, చెరువులో స్నానంచ ఏసి మళ్లీ ఇంటికెళ్లిపోయాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు రోజుల పాటు అలాగే చేశారు. ఇదంతా ఎందుకో తెలుసా.. వర్షాలు పడాలని!!
ఒకవైపు కర్ణాటయ ప్రభుత్వం మూఢాచారాలకు వ్యతిరేకంగా బిల్లు తేవాలని.. టీవీలలో జాతకాల కార్యక్రమాలను నిషేధించాలని ప్రయత్నిస్తుంటే, మరోవైపు అదే రాష్ట్రంలో ఇలాంటి మూఢాచారాలు కొనసాగుతున్నాయి. ఇలా బతికున్న మనిషికి అంత్యక్రియలు చేస్తే వర్షం పడుతుందన్నది వాళ్ల నమ్మకం. వర్షాలు కురవడం రెండు మూడు నెలలు ఆలస్యం అయితే తాము చర్చించుకుని, ఎవరో ఒకరిని శవంలా నటించడానికి ముందుకు రావాలని అడుగుతామని, వచ్చేవాళ్లు కూడా స్వచ్ఛందంగానే వస్తారు తప్ప బలవంతం ఏమీ ఉండబోదని గ్రామ పెద్దల్లో ఒకరైన ఏటీ భీమణ్ణ తెలిపారు.