ఫెడ్ పాలసీ యథాతథం
వాషింగ్టన్: ప్రపంచ మార్కెట్లకు ఊరటనిస్తూ.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీని (క్యూఈ3) యధాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఇకపై కూడా నెలకు 85 బిలియన్ డాలర్ల మేర బాండ్ల కొనుగోలును కొనసాగిస్తుంది. అలాగే ఫెడ్ పాలసీ వడ్డీ రేట్లు 0.25 శాతం స్థాయిలోనే ఉండనున్నాయి. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్వోఎంసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు బుధవారం రాత్రి పొద్దుపోయాక ఫెడ్ చైర్మన్ బెన్ బెర్నాంకీ చెప్పారు. ఈ నిర్ణయాలు వెలువడిన తర్వాత అమెరికా స్టాక్మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి.. పసిడి ధర ఒక్కసారిగా ఎగబాకింది. ఔన్సు(31.1 గ్రాములు) రేటు 30 డాలర్ల పైగా ఎగిసి 1342 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఫెడ్ పాలసీ ప్రభావంతో ఇటు దేశీయంగా కూడా రూపాయి, పసిడి ధరలు, స్టాక్మార్కెట్లు పెరిగే అవకాశముందనేది నిపుణులు అంచనా.