berry
-
మహిళలూ.. క్రాన్బెర్రీ జ్యూస్ ఆరోగ్య ప్రయోజనాల గురించి విన్నారా?
కుటుంబ బాధ్యతల్లో పడి చాలామంది మహిళలు తమ ఆరోగ్యం గురించి అస్సలు పట్టించు కోరు. నిజానికి రుతుస్రావం, గర్భధారణ, పిల్లల పోషణ లాంటి గురుతర బాధ్యతలను నిర్వహించే మహిళలు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. ఈ నేపథ్యంలో మహిళల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి బలాన్నిచ్చే ఒక జ్యూస్ గురించి తెలుసుకుందాం.క్రాన్బెర్రీ జ్యూస్. క్రాన్బెర్రీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. రోగ నిరోధక వ్యవస్థను బలపరిచి.. ఇన్ఫెక్షన్లు వంటివి రాకుండా కాపాడతాయిఉత్తర , దక్షిణ అమెరికా, గ్రేట్ బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ , ఐరోపాలో ఎక్కుగా సాగు చేస్తారు. ఎరికేసి కుటుంబానికి చెందిన వీటిని శాస్త్రీయంగా వ్యాక్సినియం ఆక్సికోకోస్ లేదా వ్యాక్సినియం మాక్రోకార్పన్ అని పిలుస్తారు. ఇవి పుల్లగా, తీయగా, కొంచెం చేదు కలగలిసిన రుచితో గమ్మత్తుగా ఉంటాయి.క్రాన్బెర్రీ జ్యూస్ ప్రయోజనాలునారింజ లేదా యాపిల్ లాంటి ఇతర జ్యూస్‌ల వలె ప్రాచుర్యం పొందనప్పటికీ, క్రాన్బెర్రీ జ్యూస్‌లో అనేక ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. స్వచ్ఛమైన క్రాన్బెర్రీ జ్యూస్‌లో సీ, ఈ విటమిన్లు, ఫినోలిక్ సమ్మేళనాలు వంటి విలువైన ఫైటోకెమికల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి వయస్సు-సంబంధిత సమస్యలు, జబ్బులకు చెక్ పెడతాయి. వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనే రసాయనాలు పేరుకుపోతాయి. క్రాన్బెర్రీ జ్యూస్‌లోని కొన్ని రసాయనాలు యాంటీఆక్సిడెంట్లు వీటిని అడ్డుకుంటాయి. కేన్సర్, మధుమేహం, గుండె వ్యాధి, జీర్ణ ఆరోగ్యం, మూత్ర నాళం ఆరోగ్యానికి చాలా మంచిది. క్రాన్బెర్రీ జ్యూస్‌లోని వివిధ పదార్థాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. క్రాన్బెర్రీస్లో పాలీఫెనాల్స్ అనే రసాయనాలు ఇందుకు తోడ్పడతాయి. మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న ఆడవారిపై 2011లో జరిపిన అధ్యయనంలో క్రాన్బెర్రీ జ్యూస్ రక్త ప్లాస్మాలో యాంటీఆక్సిడెంట్లను పెంచుతుందని కనుగొన్నారు. క్రాన్బెర్రీ జ్యూస్‌ను తీసుకునేవారిలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుడ్ కొలెస్ట్రాల్లెవల్స్ పెరుగుతాయి. కరోనరీ ఆర్టరీ వ్యాధి ఉన్నవారికి క్రాన్బెర్రీ జ్యూస్ ఒకబెస్ట్ ఆప్షన్. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని మరో అధ్యయనంలో తేలింది.ముఖ్యంగా మహిళలు క్రాన్బెరీతో చేసే జ్యూస్ తాగడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటారు. అదే విధంగా యూరిన్‌లో వచ్చే మంట, దురదకు ఉపశమనం లభిస్తుంది.శరీరంలో మంట, దురద, చికాకు వంటివి రాకుండా అడ్డుకుంటుంది. శరీరంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఎంజైమ్స్‌ని పెంచుతాయి.రూమటాయిడ్ ఆర్ర్థరైటీస్, కాలిటీస్, ఎథెరోక్లోరోసిన్, అల్జీమర్స్ పెరడెంటైటీస్, డయాబెటీస్ వంటి బారిన పడకుండా కాపాడుతుంది.చర్మ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ల వల్ల చర్మానికి, ముఖంలో మంచి మెరుపు వస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల ఫినోలిక్ యాసిడ్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. అంతేకాదు బాడీకి మంచి డిటాక్స్ డ్రింక్‌లా పని చేస్తుంది.నోట్: కొన్ని పరిశోధనల ప్రకారం వార్ఫరిన్ లాంటి బ్లడ్ థిన్నర్స్ , కొన్ని రకాల యాంటి బయెటిక్స్ వాడేవారు క్రాన్బెర్రీకి దూరంగా మంచిది. వైద్యుల సలహా మేరకుతీసుకోవాల్సి ఉంటుంది. -
మన నేలమీదే రాస్ప్బెర్రీ, బ్లాక్‌బెర్రీ, బ్లూ బెర్రీ: న్యాయవాది కియా సక్సెస్ స్టోరీ
విదేశీయుల వ్యాపా రహస్యం మార్కెట్ మాయాజాలం ఒకటి ఉంటుంది. ఒక ఉత్పత్తి మార్కెట్లోకి విడుదలయ్యే లోపు దాని గురించి ఒక సదభిప్రాయాన్ని కలిగించే ప్రచారం మొదలవుతుంది. ఆ ప్రమోషన్ ఆధారంగా సదరు ఉత్పత్తికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరిగిపోతుంది. వాళ్ల బుట్టలో పడేవరకు మనకు ఆ మాయాజాలం అర్థం అయ్యేది కాదు. అర్థమయ్యేలోపు సదరు ఉత్పత్తిని వాడడానికి అలవాటు పడిపోయేవాళ్లం. ఆలా ఆయా ఉత్పత్తుల దిగుమతికి రహదారి పడుతుంటుంది. నిజానికి భారతదేశం నేల మీద పండని పంట ఉంటుందా అనుకుంది కేయా సాలోత్. అమెరికా, రష్యా, మెక్సికో, పోలండ్ దేశాల్లో పండే రాస్ప్బెర్రీ, బ్లాక్‌బెర్రీ, బ్లూ బెర్రీ, క్రాన్బెర్రీ... పంటలను మన నేల మీద పండించి చూపించాలనుకుంది. ఆ పంటలకు అనుగుణమైన ఉష్ణోగ్రతలను మెయింటెయిన్ చేసింది. మంచి దిగుబడిని సాధిస్తోంది. హై బుష్ కౌన్సిల్ ప్రకటన! ‘‘మన దేశం నుంచి ఇండియా దిగుమతి చేసుకున్న కూరగాయలు, పండ్ల విలువ ఏడాదికి ముప్పై శాతం చొప్పున తగ్గిపోతోంది. మనకిది ఏ మాత్రం అభిలషణీయమైన లావాదేవీ కానేరదు. ఇండియా మార్కెట్ అవసరాలను పెంచడానికి ప్రయత్నించడం వల్ల ప్రయోజనం కూడా ఉండదు. ఎందుకంటే ఇండియా తనంతట తానుగా ఈ పంటలను పండించుకుంటోంది. స్థానికంగా పండించుకోవడం వల్ల బయటి దేశాలనుంచి దిగుమతి చేసుకుంటే అయ్యే ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువ ధరకు దొరుకు తున్నాయి’’ అని యూఎస్ హైబుష్ బ్లూ బెర్రీ కౌన్సిల్ ప్రతినిధి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పంటలను పండించడంలో కేయా సాలోత్, ఆమె బాటలో మరికొంత మంది చిన్నరైతులు విజయవంతమైనట్లు చెప్పడానికి ఈ ప్రకటనే నిదర్శనం. దిగుబడికి ముందే ఆర్డర్లు! ఇంతకీ కేయాసాలోత్ అనతికాలంలోనే సక్సెస్ సాధించడానికి ఆమెకు వ్యవసాయ నేపథ్యం ఏ మాత్రం లేదు. ఆమె ముంబయిలో పుట్టి పెరిగింది. న్యాయశాస్త్రం చదివి లాయర్‌గా ప్రాక్టీస్ చేసింది. తన జ్ఞానాన్ని క్లయింట్లను కాపాడడం కోసం వినియోగించడం కంటే అంతకంటే మెరుగైన కారణం కోసం పని చేస్తే బావుణ్నని కోరుకుంది. అప్పుడు ఆమె దృష్టి మనదేశంలోకి అమెరికా, రష్యా, పోలండ్, మెక్సికో, సెర్బియా వంటి శీతల దేశాల నుంచి మనదేశానికి వస్తున్న రాస్ప్బెర్రీ, బ్లూ బెర్రీల మీద కేంద్రీకృతమైంది. మనం తినడానికి ఇష్టపడుతున్న పండ్లను మనం పండించుకోలేమా అని ప్రయోగం మొదలు పెట్టింది. ఇందుకోసం ఆమె మహారాష్ట్రలో ఏ ప్రదేశమైతే ఈ పంటలకు అనువుగా ఉంటుందోనని అధ్యయనం చేసింది. ఈ పంటలు పండే దేశాలకు వెళ్లి వారు అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించింది. తిరిగి ఇండియాకి వచ్చి ఇరవై ఎకరాల పొలంలో వ్యవసాయం మొదలుపెట్టింది. ఎండ, వర్షాలను తట్టుకునే విధంగా తెల్లటి పై కప్పుతో షెడ్ వేసింది. మొదటగా మైక్రోగ్రీన్స్‌తో మార్కెట్లోకి ప్రవేశించింది. కొత్తిమీర, మెంతి ఆకు వంటి స్పల్పకాల పంటలను రసాయన ఎరువులు లేకుండా పండించి రెస్టారెంట్లకు సప్లయ్ చేయడంతో అనతికాలంలోనే 50 మంది క్లయింట్లు వచ్చారు. రాబోయే కాలంలో తమ పొలం నుంచి ఫలానా పంటలు అందుబాటులోకి వస్తాయని క్లయింట్లకు సమాచారం ఇవ్వడంతో ఆమెకు అడ్వాన్స్ బుకింగ్‌లు మొదలయ్యాయి. ఈ పండ్లు దిగుబడి సాధించేలోపు ఆమె మార్కెట్ వేదికను ఏర్పాటు చేసుకుందన్నమాట. రైతులందరూ వ్యవసాయం చేస్తారు. పంట పండించి కొనుగోలు దారుల కోసం ఎదురు చూస్తారు. దళారుల చేతిలో మోస పోతుంటారు. 32 ఏళ్ల కేయా సాలోత్ అనుసరించిన సక్సెస్ ఫార్ములా రైతులకు మార్గదర్శనం. -
యాపిల్‌బెరీ.. డిమాండ్ మెనీ..!
• ప్రయోగాత్మకంగా సాగుచేస్తున్న చిమనగుంటపల్లి రైతు • బంగ్లాదేశ్ నుంచి మొక్కల దిగుబడి • మూడేళ్ల క్రితం తెలంగాణలో సాగుకు బీజం • వనపర్తి జిల్లాలో సాగుచేస్తున్న రైతులు యాపిల్‌బెరీ సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. యాపిల్ పండులా కనిపించే ఈ రేగిపండుకు మార్కెట్లో భలే డిమాండ్ ఉంది. దీన్ని గమనించిన రైతులు, మొక్కలను బంగ్లాదేశ్ నుంచి తెప్పించుకుని అంతరపంటగా సాగు చేస్తున్నారు. తక్కువ నీటితో.. ఏడాది పొడవునా దిగుబడి ఇవ్వడం గమనార్హం. వనపర్తి : ఆకారంలో సైజు చిన్నగా ఉన్నా.. యాపిల్ పండులా కనిపించే రేగిపండు, యాపిల్‌బెరీ పేరుతో మార్కెట్లో భలే డిమాండ్‌ను సంతరించుకుంటోంది. మార్కెట్లో కేజీ రూ.80 చొప్పున విక్రయిస్తున్న ఈ పండ్లకు వచ్చే గిరాకీని చూసి వనపర్తి జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పలువురు రైతులు బంగ్లాదేశ్ నుంచి యాపిల్‌బెరీ సీడ్ మొక్కలను తెచ్చి మామిడి తోటలో అంతరపంటగా సాగు చేస్తున్నారు. కొద్దిపాటి సాగునీటి లభ్యత ఉన్న రైతులు బిందుసేద్యంతో సాగు చేసుకోవచ్చనని పలువురు రైతులు నిరూపించారు. వనపర్తి మండలం చిమనగుంటపల్లికి చెందిన సుధాకర్‌రెడ్డి అనే రైతు మూడెకరాల్లో 1100, గోపాల్పేట మండలం మున్ననూరు గ్రామానికి చెందిన తిరుపతయ్య రెండెకరాల్లో 600యాపిల్‌బెరీ మొక్కలను నాటారు. ప్రస్తుతం ఆ మొక్కలు పూతదశలో ఉన్నాయి. ఆత్మకూరు, వీపనగండ్ల, చిన్నంబావి తదితర ప్రాంతాల్లో కాయలు కాస్తున్నాయని హార్టికల్చర్ అధికారులు వెల్లడిస్తున్నారు. థాయిలాండ్ శాస్త్రవేత్తల ప్రయోగ ఫలితమే.. థాయిలాండ్ వ్యవసాయ శాస్త్రవేత్తలు యాపిల్ పండ్లపూత, రేగిపండ్ల పూతతో క్రాస్ మ్యాచింగ్ ప్రయోగం చేసి ఈ యాపిల్‌బెరీ మొక్కను పుట్టించినట్లు ప్రచారంలో ఉంది. థాయిలాండ్ నుంచి ప్రస్తుతం వ్యవసాయ రంగంలో దూసుకుపోతున్న అన్ని దేశాలను ఈ యాపిల్‌బెరీ ఆకర్శిస్తోంది. ఐదారేళ్ల క్రితం శాస్త్రవేత్తలు ఈ మొక్కకు ప్రాణం పోసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఈ మొక్కలను బంగ్లాదేశ్‌లో ఎక్కువగా విక్రయిస్తున్నట్లు సమాచారం. కోల్‌కతా మీదుగా ఇండియాలోని ఇతర ప్రాంతాలకు ఈమొక్కలను సరఫరా చేస్తున్నారు. మూడేళ్ల క్రితమే.. తెలంగాణ ప్రాంతంలోని పలువురు రైతులు మూడేళ్ల క్రితమే యాపిల్‌బెరీ మొక్కలను ఇండియాకు తెచ్చారని, వారిని చూసి తాము కోల్‌కతాకు వెళ్లి బంగ్లాదేశ్ నుంచి యాపిల్‌బెరీ మొక్కలను తెప్పించుకున్నట్లు రైతులు పేర్కొన్నారు. పాంపాండ్, బిందుసేద్యంతో.. ఇదివరకు మామిడి, చెరుకు, ఇతర తోటల కోసం తెచ్చుకున్న పాంపాండ్, బిందుసేద్యం పరికరాలు ప్రస్తుతం ఉపయోగపడుతున్నాయని చిమనగుంటపల్లి రైతు సుధాకర్‌రెడ్డి తెలిపారు. విద్యుత్ ఉన్న సమయంలో పాంపండ్ (నీరు నిల్వ చేసే ట్యాంకు)లో నీటిని నింపి కావాల్సినప్పుడు మొక్కలకు నీరు ఇస్తామన్నారు. ప్రస్తుతం తన పొలంలో 2.50లక్షల లీటర్ల పాంపాండ్‌ను నిర్మించుకొని ఎనిమిదేళ్లుగా ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఈ మొక్కలు నాటి 60రోజులు కావస్తుందని తాము మొక్కలు కొనుగోలు చేసిన సమయానికే ఐదునెలల వయస్సు ఉండవచ్చునన్నారు. తొమ్మిది నెలల తర్వాత కాపుకు వచ్చే ఈ మొక్కలు ఏడాది పొడవునా.. దిగుబడినిస్తాయని చెప్పారు. ఒక మొక్క రూ.50 ఖరీదు ఉంటుందన్నారు. పెట్టుబడి తక్కువే.. మామిడితోటలో అంతరపంటగా వేసిన యాపిల్‌బెరీ సాగు చేస్తే బాగుంటుంది. ఇదివరకు తెలం గాణ ప్రాంతంలో సాగుచేసిన వారు సా«ధించిన దిగుబడులను చూసి ఆకర్శితులమై తన మిత్రుడితో కలిసి కోల్‌కతా వెళ్లి మొక్కలు తీసుకొచ్చి సాగుచేస్తున్నాము. మూడెకరాల్లో 1100ల మొక్కలు నాటేందుకు రూ.50వేల పెట్టుబడి పెట్టాం. ఏడాది పొడవునా.. దిగుబడి వస్తే ఆరు నెలల్లోపే పెట్టుబడి వస్తుంది. – సుధాకర్‌రెడ్డి, రైతు, చిమనగుంటపల్లి ఆసక్తి చూపిస్తున్నారు యాపిల్బెరీసాగు చేసిన రైతులకు దిగుబడి బాగా వస్తుంది. వనపర్తిలో విక్రయిస్తున్న యాపిల్‌బెరీ పండ్లు వీపనగండ్ల మండలం సంగినేనిపల్లి తోటలోనుంచి తీసుకువచ్చినవే. ఎక్కువ మంది రైతులు యాపిల్‌బెరీ సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. తక్కువనీరు, పెట్టుబడితో ఇదివరకు ఉన్న మామిడి, బత్తాయి తదితర తోటల్లో అంతరపంటలుగా ఏర్పాటు చేసుకోవచ్చు. – రాజేంద్రకృష్ణ, హార్టికల్చర్ అధికారి