న్యాయవాద వృత్తిని వదిలేసి మరీ వ్యవసాయంలోకి
రాస్ప్‌బెర్రీ, బ్లాక్‌బెర్రీ, బ్లూ బెర్రీ, క్రాన్‌బెర్రీ పంట
దిగుబడికి ముందే ఆర్డర్ల వెల్లువ
విదేశీయుల వ్యాపా రహస్యం మార్కెట్ మాయాజాలం ఒకటి ఉంటుంది. ఒక ఉత్పత్తి మార్కెట్‌లోకి విడుదలయ్యే లోపు దాని గురించి ఒక సదభిప్రాయాన్ని కలిగించే ప్రచారం మొదలవుతుంది. ఆ ప్రమోషన్ ఆధారంగా సదరు ఉత్పత్తికి మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ పెరిగిపోతుంది. వాళ్ల బుట్టలో పడేవరకు మనకు ఆ మాయాజాలం అర్థం అయ్యేది కాదు. అర్థమయ్యేలోపు సదరు ఉత్పత్తిని వాడడానికి అలవాటు పడిపోయేవాళ్లం. ఆలా ఆయా ఉత్పత్తుల దిగుమతికి రహదారి పడుతుంటుంది.
నిజానికి భారతదేశం నేల మీద పండని పంట ఉంటుందా అనుకుంది కేయా సాలోత్. అమెరికా, రష్యా, మెక్సికో, పోలండ్ దేశాల్లో పండే రాస్ప్‌బెర్రీ, బ్లాక్‌బెర్రీ, బ్లూ బెర్రీ, క్రాన్‌బెర్రీ... పంటలను మన నేల మీద పండించి చూపించాలనుకుంది. ఆ పంటలకు అనుగుణమైన ఉష్ణోగ్రతలను మెయింటెయిన్ చేసింది. మంచి దిగుబడిని సాధిస్తోంది.
హై బుష్ కౌన్సిల్ ప్రకటన!
‘‘మన దేశం నుంచి ఇండియా దిగుమతి చేసుకున్న కూరగాయలు, పండ్ల విలువ ఏడాదికి ముప్పై శాతం చొప్పున తగ్గిపోతోంది. మనకిది ఏ మాత్రం అభిలషణీయమైన లావాదేవీ కానేరదు. ఇండియా మార్కెట్ అవసరాలను పెంచడానికి ప్రయత్నించడం వల్ల ప్రయోజనం కూడా ఉండదు. ఎందుకంటే ఇండియా తనంతట తానుగా ఈ పంటలను పండించుకుంటోంది. స్థానికంగా పండించుకోవడం వల్ల బయటి దేశాలనుంచి దిగుమతి చేసుకుంటే అయ్యే ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువ ధరకు దొరుకు తున్నాయి’’ అని యూఎస్ హైబుష్ బ్లూ బెర్రీ కౌన్సిల్ ప్రతినిధి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పంటలను పండించడంలో కేయా సాలోత్, ఆమె బాటలో మరికొంత మంది చిన్నరైతులు విజయవంతమైనట్లు చెప్పడానికి ఈ ప్రకటనే నిదర్శనం.
దిగుబడికి ముందే ఆర్డర్‌లు!
ఇంతకీ కేయాసాలోత్ అనతికాలంలోనే సక్సెస్ సాధించడానికి ఆమెకు వ్యవసాయ నేపథ్యం ఏ మాత్రం లేదు. ఆమె ముంబయిలో పుట్టి పెరిగింది. న్యాయశాస్త్రం చదివి లాయర్‌గా ప్రాక్టీస్ చేసింది. తన జ్ఞానాన్ని క్లయింట్‌లను కాపాడడం కోసం వినియోగించడం కంటే అంతకంటే మెరుగైన కారణం కోసం పని చేస్తే బావుణ్నని కోరుకుంది. అప్పుడు ఆమె దృష్టి మనదేశంలోకి అమెరికా, రష్యా, పోలండ్, మెక్సికో, సెర్బియా వంటి శీతల దేశాల నుంచి మనదేశానికి వస్తున్న రాస్ప్‌బెర్రీ, బ్లూ బెర్రీల మీద కేంద్రీకృతమైంది. మనం తినడానికి ఇష్టపడుతున్న పండ్లను మనం పండించుకోలేమా అని ప్రయోగం మొదలు పెట్టింది.
ఇందుకోసం ఆమె మహారాష్ట్రలో ఏ ప్రదేశమైతే ఈ పంటలకు అనువుగా ఉంటుందోనని అధ్యయనం చేసింది. ఈ పంటలు పండే దేశాలకు వెళ్లి వారు అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించింది. తిరిగి ఇండియాకి వచ్చి ఇరవై ఎకరాల పొలంలో వ్యవసాయం మొదలుపెట్టింది. ఎండ, వర్షాలను తట్టుకునే విధంగా తెల్లటి పై కప్పుతో షెడ్ వేసింది. మొదటగా మైక్రోగ్రీన్స్‌తో మార్కెట్‌లోకి ప్రవేశించింది. కొత్తిమీర, మెంతి ఆకు వంటి స్పల్పకాల పంటలను రసాయన ఎరువులు లేకుండా పండించి రెస్టారెంట్‌లకు సప్లయ్ చేయడంతో అనతికాలంలోనే 50 మంది క్లయింట్‌లు వచ్చారు.
రాబోయే కాలంలో తమ పొలం నుంచి ఫలానా పంటలు అందుబాటులోకి వస్తాయని క్లయింట్‌లకు సమాచారం ఇవ్వడంతో ఆమెకు అడ్వాన్స్ బుకింగ్‌లు మొదలయ్యాయి. ఈ పండ్లు దిగుబడి సాధించేలోపు ఆమె మార్కెట్ వేదికను ఏర్పాటు చేసుకుందన్నమాట. రైతులందరూ వ్యవసాయం చేస్తారు. పంట పండించి కొనుగోలు దారుల కోసం ఎదురు చూస్తారు. దళారుల చేతిలో మోస పోతుంటారు. 32 ఏళ్ల కేయా సాలోత్ అనుసరించిన సక్సెస్ ఫార్ములా రైతులకు మార్గదర్శనం.
Comments
Please login to add a commentAdd a comment