యాపిల్‌బెరీ.. డిమాండ్ మెనీ..!
• ప్రయోగాత్మకంగా సాగుచేస్తున్న చిమనగుంటపల్లి రైతు
• బంగ్లాదేశ్ నుంచి మొక్కల దిగుబడి
• మూడేళ్ల క్రితం తెలంగాణలో సాగుకు బీజం
• వనపర్తి జిల్లాలో సాగుచేస్తున్న రైతులు
యాపిల్‌బెరీ సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. యాపిల్ పండులా కనిపించే ఈ రేగిపండుకు మార్కెట్‌లో భలే డిమాండ్ ఉంది. దీన్ని గమనించిన రైతులు, మొక్కలను బంగ్లాదేశ్ నుంచి తెప్పించుకుని అంతరపంటగా సాగు చేస్తున్నారు. తక్కువ నీటితో.. ఏడాది పొడవునా దిగుబడి ఇవ్వడం గమనార్హం.
వనపర్తి :
ఆకారంలో సైజు చిన్నగా ఉన్నా.. యాపిల్ పండులా కనిపించే రేగిపండు, యాపిల్‌బెరీ పేరుతో మార్కెట్‌లో భలే డిమాండ్‌ను సంతరించుకుంటోంది. మార్కెట్‌లో కేజీ రూ.80 చొప్పున విక్రయిస్తున్న ఈ పండ్లకు వచ్చే గిరాకీని చూసి వనపర్తి జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పలువురు రైతులు బంగ్లాదేశ్ నుంచి యాపిల్‌బెరీ సీడ్ మొక్కలను తెచ్చి మామిడి తోటలో అంతరపంటగా సాగు చేస్తున్నారు. కొద్దిపాటి సాగునీటి లభ్యత ఉన్న రైతులు బిందుసేద్యంతో సాగు చేసుకోవచ్చనని పలువురు రైతులు నిరూపించారు. వనపర్తి మండలం చిమనగుంటపల్లికి చెందిన సుధాకర్‌రెడ్డి అనే రైతు మూడెకరాల్లో 1100, గోపాల్‌పేట మండలం మున్ననూరు గ్రామానికి చెందిన తిరుపతయ్య రెండెకరాల్లో 600యాపిల్‌బెరీ మొక్కలను నాటారు. ప్రస్తుతం ఆ మొక్కలు పూతదశలో ఉన్నాయి. ఆత్మకూరు, వీపనగండ్ల, చిన్నంబావి తదితర ప్రాంతాల్లో కాయలు కాస్తున్నాయని హార్టికల్చర్ అధికారులు వెల్లడిస్తున్నారు.
థాయిలాండ్ శాస్త్రవేత్తల ప్రయోగ ఫలితమే..
థాయిలాండ్ వ్యవసాయ శాస్త్రవేత్తలు యాపిల్ పండ్లపూత, రేగిపండ్ల పూతతో క్రాస్ మ్యాచింగ్ ప్రయోగం చేసి ఈ యాపిల్‌బెరీ మొక్కను పుట్టించినట్లు ప్రచారంలో ఉంది. థాయిలాండ్ నుంచి ప్రస్తుతం వ్యవసాయ రంగంలో దూసుకుపోతున్న అన్ని దేశాలను ఈ యాపిల్‌బెరీ ఆకర్శిస్తోంది. ఐదారేళ్ల క్రితం శాస్త్రవేత్తలు ఈ మొక్కకు ప్రాణం పోసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఈ మొక్కలను బంగ్లాదేశ్‌లో ఎక్కువగా విక్రయిస్తున్నట్లు సమాచారం. కోల్‌కతా మీదుగా ఇండియాలోని ఇతర ప్రాంతాలకు ఈమొక్కలను సరఫరా చేస్తున్నారు.
మూడేళ్ల క్రితమే..
తెలంగాణ ప్రాంతంలోని పలువురు రైతులు మూడేళ్ల క్రితమే యాపిల్‌బెరీ మొక్కలను ఇండియాకు తెచ్చారని, వారిని చూసి తాము కోల్‌కతాకు వెళ్లి బంగ్లాదేశ్ నుంచి యాపిల్‌బెరీ మొక్కలను తెప్పించుకున్నట్లు రైతులు పేర్కొన్నారు.
పాంపాండ్, బిందుసేద్యంతో..
ఇదివరకు మామిడి, చెరుకు, ఇతర తోటల కోసం తెచ్చుకున్న పాంపాండ్, బిందుసేద్యం పరికరాలు ప్రస్తుతం ఉపయోగపడుతున్నాయని చిమనగుంటపల్లి రైతు సుధాకర్‌రెడ్డి తెలిపారు. విద్యుత్ ఉన్న సమయంలో పాంపండ్ (నీరు నిల్వ చేసే ట్యాంకు)లో నీటిని నింపి కావాల్సినప్పుడు మొక్కలకు నీరు ఇస్తామన్నారు. ప్రస్తుతం తన పొలంలో 2.50లక్షల లీటర్ల పాంపాండ్‌ను నిర్మించుకొని ఎనిమిదేళ్లుగా ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఈ మొక్కలు నాటి 60రోజులు కావస్తుందని తాము మొక్కలు కొనుగోలు చేసిన సమయానికే ఐదునెలల వయస్సు ఉండవచ్చునన్నారు. తొమ్మిది నెలల తర్వాత కాపుకు వచ్చే ఈ మొక్కలు ఏడాది పొడవునా.. దిగుబడినిస్తాయని చెప్పారు. ఒక మొక్క రూ.50 ఖరీదు ఉంటుందన్నారు.
పెట్టుబడి తక్కువే..
మామిడితోటలో అంతరపంటగా వేసిన యాపిల్‌బెరీ సాగు చేస్తే బాగుంటుంది. ఇదివరకు తెలం గాణ ప్రాంతంలో సాగుచేసిన వారు సా«ధించిన దిగుబడులను చూసి ఆకర్శితులమై తన మిత్రుడితో కలిసి కోల్‌కతా వెళ్లి మొక్కలు తీసుకొచ్చి సాగుచేస్తున్నాము. మూడెకరాల్లో 1100ల మొక్కలు నాటేందుకు రూ.50వేల పెట్టుబడి పెట్టాం. ఏడాది పొడవునా.. దిగుబడి వస్తే ఆరు నెలల్లోపే పెట్టుబడి వస్తుంది. – సుధాకర్‌రెడ్డి, రైతు, చిమనగుంటపల్లి
ఆసక్తి చూపిస్తున్నారు
యాపిల్‌బెరీసాగు చేసిన రైతులకు దిగుబడి బాగా వస్తుంది. వనపర్తిలో విక్రయిస్తున్న యాపిల్‌బెరీ పండ్లు వీపనగండ్ల మండలం సంగినేనిపల్లి తోటలోనుంచి తీసుకువచ్చినవే. ఎక్కువ మంది రైతులు యాపిల్‌బెరీ సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. తక్కువనీరు, పెట్టుబడితో ఇదివరకు ఉన్న మామిడి, బత్తాయి తదితర తోటల్లో అంతరపంటలుగా ఏర్పాటు చేసుకోవచ్చు.
– రాజేంద్రకృష్ణ, హార్టికల్చర్ అధికారి