నాణ్యమైన విద్యనందిస్తేనే మనుగడ
సాక్షి, హైదరాబాద్: సుశిక్షితులైన టీచర్లున్నా అనేక కారణాలవల్ల ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు, ఇంగ్లిష్ మీడియం లేవని, టీచర్లు బడికి సరిగ్గా రారన్న అపోహ కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఈ క్రమంలో టీచర్లు నాణ్యమైన విద్యను అందిస్తేనే ప్రభుత్వ స్కూళ్లకు మనుగడ ఉంటుందన్నారు.
ఇందులో భాగంగా ప్రభుత్వం తన బాధ్యతను పక్కాగా నిర్వర్తిస్తోందని, ఉపాధ్యాయులు కూడా తమ కర్తవ్యాన్ని నెరవేర్చాలన్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 73 మంది టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లకు గురువారం రవీంద్రభారతిలో కడియం అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... అవార్డీలు స్ఫూర్తిదాయకంగా పనిచేస్తేనే అవార్డుకు సార్థకతని, అదే సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నిజమైన నివాళని అన్నారు.
వచ్చే జూన్ నాటికి హైస్కూళ్లలో కంప్యూటర్లు
‘సమస్యలంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం కాకుండా సమన్వయంతో పనిచేయాలి. 5 వేలకు పైగా స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించాం. స్కూల్ గ్రాంటు పెంచాం. రూ.1,500 కోట్లతో అదనపు తరగతి గదులు, టాయిలెట్లు, రన్నింగ్ వాటర్, ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో నియోజకవర్గంలో రూ.5 కోట్ల చొప్పున 119 నియోజకవర్గాల్లో దాదాపు రూ.600 కోట్లతో అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఇందుకు 40 మంది ఎమ్మెల్యేలు ముందుకు వచ్చారు. ఏకీకృత సర్వీసు రూల్స్ పై కేంద్రం నుంచి నిర్ణయం రాగానే పదోన్నతులు కల్పిస్తాం. కొత్త జిల్లాలు కాగానే హేతుబద్ధీకరణ చేపట్టి, పీఈటీలు, భాషా పండితులకు పదోన్నతులిస్తాం. 2017 జూన్‌లో స్కూ ళ్లు తెరిచేనాటికి అన్ని హైస్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్‌లను అందుబాటులోకి తెస్తాం’ అని కడియం శ్రీహరి చెప్పారు.
విలువలు ముఖ్యం...
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... విలువలు, విజ్ఞానం ఉన్న టీచర్లను ఎవరూ మరిచిపోరని, రామయ్యసార్ కనిపిస్తే తాను పాదాభివందనం చేస్తానన్నారు. కేంద్రం ఏర్పాటు చేయతలపెట్టిన 8 నైపుణ్య విద్య వర్సిటీల్లో ఒకటి తెలంగాణలో నెలకొల్పేందుకు కృషి చేస్తానన్నారు. ఎంపీ కె.కేశవరావు మాట్లాడుతూ నాణ్యమైన విద్య మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలన్నా రు. తాను మంత్రిగా ఉన్నపుడు ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి పాఠాలు చెప్పగా చూసింది లేదన్నారు. ఎప్పుడూ సమస్యల గురించే మాట్లాడేవారన్నారు. మండలి చీఫ్‌విప్ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ టీచర్స్ డే నిర్వహణ గందరగోళంగా మారిందని, దీనిని పాఠశాల విద్యకే పరిమితం చేయాలన్నారు.
దరఖాస్తులు లేకుండానే ఎంపిక
‘ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపికలో పారదర్శకత లోపించింది. నిజంగా పనిచేసే వారిలో తాము దరఖాస్తు చేసుకోవడం ఏమిటన్న అభిప్రాయం ఉంది. అందుకే వచ్చే ఏడాది దరఖాస్తుల విధానం లేకుండా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తాం’ అని కడియం శ్రీహరి వెల్లడించారు.