Bethaludu
-
నికారుసైనోడు
‘‘ఏమిటోయి భేతాళా విశేషాలు?’’ రిలాక్స్డ్గా అడిగాడు విక్రమార్కుడు.‘‘నా దగ్గర విశేషాలుండవండీ... ప్రశ్నలే ఉంటాయండి’’ గంభీరంగా బదులిచ్చాడు భేతాళుడు.‘‘నీ బుద్ది పోనిచ్చుకున్నావు కాదు. ఎప్పుడూ ప్రశ్నలేనా? ఈరోజు సరదాగా జోక్ ఏదైనా చెప్పొచ్చుకదా’’ అడిగాడు విక్రమార్కుడు.‘‘ఇవ్వాళ రేపు దారినపోయే దానయ్యను టచ్ చేసినా బోలెడు జోకులు చెబుతున్నాడు. మరి నా కంటూ ఒక స్పెషాలిటీ ఉండాలి కదా’’ అన్నాడు భేతాళుడు.‘‘నీ స్పెషాలిటీ ఏమిటి?’’ ఆసక్తిగా అడిగాడు విక్రమార్కుడు.‘‘నువ్వు ఒక లైన్ చెబితే... దాని మీదే జోక్ చెబుతా’’ అన్నాడు భేతాళుడు.‘‘మనిషి అనేవాడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఎక్కువైతే ఇక అంతే!’’ లైన్ చెప్పాడు విక్రమార్కుడు.అప్పుడు విక్రమార్కుడి భుజం మీద ఉన్న భేతాళుడు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు...అది చలికాలం రాత్రి.పంజగుట్ట ఫ్లైవోవర్ సమీపంలో ఒకడు వేగంగా కారు నడుపుతున్నాడు. వాడిని కానిస్టేబుల్ ఆపాడు.‘‘ఏమిటండీ మీ ప్రాబ్లం?’’ కళ్లద్దాలు చేతుల్లోకి తీసుకుంటూ అడిగాడు కారువాడు.‘‘మీరు చాలా స్పీడ్‌గా డ్రైవ్ చేస్తున్నారు సార్. డ్రైవింగ్ వచ్చిన వాళ్లెవరూ ఇలా డ్రైవ్ చేయరు. అసలు మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఒకసారి చూపించండి’’ విండోలోకి తొంగి చూస్తూ అడిగాడు కానిస్టేబుల్.‘‘చూపిస్తే మీరేమైనా కొరుక్కుతింటారా? అదేమన్నా యాపిల్ పండా!’’ నవ్వుతూ అన్నాడు కారువాడు.‘‘అయితే చూపించండి సార్’’ వీలైనంత వినయంగా అడిగాడు కానిస్టేబుల్.‘‘ఉండీ ఛస్తేగా నీకు చూపించడానికి’’ కొండ చెరియలు కూలిపడ్డట్టు భళ్లున నవ్వాడు కారువాడు.‘‘ఏమిటీ డ్రైవింగ్ లైసెన్స్ లేదా?’’ గట్టిగా అరిచాడు కానిస్టేబుల్.నిజంగా చెప్పాలంటే ఆ అరుపులో అరుపు మాత్రమే లేదు. కొండంత ఆవేదన ఉంది. రెండు కొండలంత ఆగ్రహం ఉంది!‘‘డ్రైవింగ్ లైసెన్స్ లేదా?’’ అనే కానిస్టేబుల్ ఆవేదనను, ఆగ్రహాన్ని పట్టించుకోకుండా...‘‘లేదంటే లేదని కాదు. ఉందిగానీ...’’ నసిగాడు కారువాడు.‘‘మరి ఉంటే చూపించరేం?’’ కనుబొమ్మలెగరేస్తూ అడిగాడు కానిస్టేబుల్.‘‘ఉండి ఛస్తేగా’’ అన్నాడు తాపీగా కారువాడు.‘‘అదేంటీ సార్. ఉందంటారు. లేదంటారు. ఉందంటారు. లేదంటారు. మీ మాటలేమీ నాకు బోధ పడడం లేదు’’ అని బుర్ర గోక్కున్నాడు కానిస్టేబుల్.‘‘నీకు డాండ్రాఫ్ ఎక్కువగా ఉన్నట్లుంది. మంచి షాంపువాడు’’ అని సలహా ఇచ్చాడు కారువాడు.‘‘షాంపు సంగతి తరువాత.... ముందు మీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించండి’’ బతిమిలాడుతున్నట్లు అడిగాడు కానిస్టేబుల్. ‘‘నిన్నటి వరకు ఉండేది. ఇవ్వాళ మందు కొట్టాను కదా. ఎక్కడో పోగొట్టుకున్నాను’’ చెప్పాడు కారువాడు.‘‘మందు కొట్టి కారు డ్రైవింగ్ చేస్తున్నారా?’’ అతిపెద్దగా ఆశ్చర్యపోయాడు కానిస్టేబుల్.‘‘నేను పెద్దగా తాగనండీ. నా బిజినెస్ పాట్నర్‌తో గొడవ జరిగింది. ఒరేయ్ నిన్ను చంపేస్తా అని అరిచాను. ఏది చంపు చూద్దాం అన్నాడు. చూపాను. నా దగ్గర నాటు తుపాకి ఉన్న మాటేగానే ఏరోజు చిన్నపిట్టను కాల్చిన పాపాన పోలేదు. అలాంటిది ఆరుడుగుల వ్యక్తిని అరనిమిషంలో కాల్చి పారేశాను.సరే, దురదృష్టమో అదృష్టమో వాడిని కాల్చాను.ఆ తరువాత దడ మొదలైంది.గుండెల్లో మెట్రోరైలు పరుగులు తీస్తుంది.ఇక తట్టుకోలేక పోయాను. దగ్గరలో ఉన్న బార్లోకి దూరి పూటుగా తాగేశాను. అప్పుడుగానీ దడ కంట్రోల్లోకి రాలేదంటే నమ్మండి’’ వివరంగా చెప్పాడు కారువాడు.‘‘ఒకర్ని చంపి, పూటుగా తాగి డ్రైవింగ్ చేస్తున్నారా!!!!! వామ్మో! అసలు మీ కారు రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయా?’’ ఆందోళనగా అడిగాడు కానిస్టేబుల్.‘‘అసలు కారు నాదైతేగా’’ ఫ్లైవోవర్ కూలినట్లు మరోసారి భళ్లుమని నవ్వాడు కారువాడు.‘‘కారు మీది కాదా? మరెవరిది?’’ గుండెలు అరచేతిలో పెట్టుకొని అడిగాడు కానిస్టేబుల్.‘‘పూటుగా తాగిన మత్తులో నా కారు అనుకొని ఎవడిదో కారెక్కి డ్రైవింగ్ స్టార్ట్ చేశాను. దారి మధ్యలో ఇది నా కారు కాదు వేరెవరిదో అనే విషయం అర్థమైంది. కానీ, కారులు వేరైనా దారులు ఒక్కటే...అని మన పెద్దలు అన్నారు కాబట్టి... కారు ఏదైతేనేం అనుకొని ఇలా కంటిన్యూ అయిపోయాను...’’ అని పండ్లు ఇకిలించాడు కారువాడు.కారువాడి మాటలకు కానిస్టేబుల్ మైండ్ బ్లాకైంది. వైట్ అయింది. రెడ్ కూడా అయింది. ‘‘వామ్మో... వీడు మామూలుడో కాదయ్యో’’ అని గుండెలు బాదుకుంటూ పై అధికారికి ఫోన్ చేశాడు.పెద్ద ఆఫీసర్ రంగంలోకి దిగాడు. ‘‘సర్, మీ కారును రోడ్డు పక్కన ఆపుతారా!’’ రిక్వెస్ట్ స్వరంతో అడిగాడు సీనియర్ ఆఫీసర్.‘‘అలాగే’’ అని రోడ్డుకు ఒక పక్కన కారు ఆపాడు కారువాడు.‘‘మీరు ఒకరిని కాల్చి చంపారని, అంతేకాదు...’’ అని పోలీస్ ఆఫీసర్ ఏదో చెప్పబోతుండగానే మధ్యలోనే అడ్డుపడి...‘‘ఏమిటండీ మాటిమాటికీ కాల్చాను కాల్చాను అంటున్నారు. అసలు వాడు ఏంచేశాడో తెలుసా?’’ అని అరిచాడు కారువాడు.‘‘ఏంచేశాడు?’’ కళ్లు పెద్దవి చేసి అడిగాడు ఆఫీసర్.‘‘వాడు నేను కలిసి గంజాయి బిజినెస్ మొదలుపెట్టామండీ. ఐడియా నాదే. బ్రహ్మాండంగా వర్కవుటైంది. నాకు రావల్సిన కోటిరూపాయలను ఎగ్గొట్టాడు. మరి నేను ఎలా ఊరుకుంటానండి. వ్యాపారం అన్నాక న్యాయం, ధర్మం ఉండనక్కర్లేదా? మీరే చెప్పండి’’ గాద్గదిక స్వరంతో అన్నాడు కారువాడు.‘‘ఏమిటీ? గంజాయి వ్యాపారం చేశావా?’’ సన్నగా వణుకుతూ అడిగాడు ఆఫీసర్.‘‘బిజినెస్‌లో లాస్ వస్తే మరేం చేస్తామండీ’’ అమాయకంగా ముఖం పెట్టాడు కారువాడు.‘‘ఇంతకీ ఏం బిజినెస్ చేశారు?’’ గుండెను చిక్కబట్టుకుంటూ అడిగాడు ఆఫీసర్. ‘‘కట్ఫండ్ బిజినెస్ చేశానండీ’’ అన్నాడు కారువాడు.‘‘చిట్‌ఫండ్ గురించి విన్నాంగానీ కట్ఫంట్ ఏమిటండీ నా బొందా’’ అని కళ్లనీళ్ల పర్యంతమయ్యాడు ఆఫీసర్.‘‘కష్టాలన్నీ కట్ అయిపోయి... ఫండ్ చేతికందడమే కట్ఫండ్ బిజినెస్. ఒక్క రూపాయితో మా కంపెనీ షేర్ కొంటే... సంవత్సరం తిరిగేసరికల్లా లక్షరూపాయాలు చేతికందిలే ప్లాన్ చేశాను. బిజినెస్ సూపర్‌హిట్ అయింది. కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగి, మా విషయం వినియోగదారులకు తెలిసిపోయి... మొదట కాల్ చేసి బెదిరించారు. ఆ తరువాత కత్తులతో ఆఫీసు ముందు క్యూ కట్టారు. ‘మా రూపాయి మాకు ఇవ్వాల్సిందే’ అని గట్టిగా అరిచారు. ‘మీ రూపాయి మీకు ఇవ్వడమే కాదు... మీకు ఇస్తానన్న లక్షరూపాయలు కూడా పువ్వులో పెట్టి ఇస్తాను అని చెప్పాను. ఇచ్చిన మాట కోసం గంజాయి దందా చేశాను. ఇప్పుడు చెప్పండి యవరారనర్. నేను చేసింది తప్పా... తప్పా... తప్పా... తప్పా.....’’ అని గట్టిగా అరిచాడు కారువాడు.రకరకాల ఏమోషన్స్ తట్టుకోలేక ఉన్నచోటునే కుప్పకూలిపోయాడు పూర్... పోలీస్ ఆఫీసర్! – యాకుబ్ పాషా -
తెలుగు సినిమా చేస్తున్న 'బిచ్చగాడు'
చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం సాధించిన బిచ్చగాడు, హీరో విజయ్ ఆంటోనికి ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ తీసుకువచ్చింది. గతంలో నకిలీ, సలీం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఆంటోని, బిచ్చగాడు సినిమాతో స్టార్ గా మారిపోయాడు. దీంతో విజయ్ ఆంటోని తాజా చిత్రం భేతాలుడు తెలుగు రైట్స్ ను 30 కోట్ల పెట్టి సొంతం చేసుకున్నారు. ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా.. వసూళ్లు మాత్రం బాగానే సాధించింది. తనను ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకుల కోసం ఓ స్ట్రయిట్ తెలుగు సినిమా చేసేందుకు అంగీకరించాడు విజయ్ ఆంటోని. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాను రాధిక శరత్ కుమార్ రాడన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. విజయ్ ఆంటోనిని సంగీత దర్శకుడిగా పరిచయం చేసింది కూడా ఇది బ్యానర్. అందుకే తెలుగులో అదే బ్యానర్ లో పరిచయం అయితే సెంటిమెంట్ పరంగా కలిసొస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు బిచ్చగాడు. -
'భేతాళుడు' మూవీ రివ్యూ
టైటిల్ : భేతాళుడు జానర్ : సైకలాజికల్ థ్రిల్లర్ తారాగణం : విజయ్ ఆంటోని, అరుంధతి నాయర్, చారు హాసన్, మీరా కృష్ణన్ సంగీతం : విజయ్ ఆంటోని దర్శకత్వం : ప్రదీప్ కృష్ణమూర్తి నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమాతో తెలుగునాట సంచలనం సృష్టించిన విజయ్ ఆంటోని మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారిన విజయ్ ఆంటోని, తొలి సినిమానుంచే వైవిధ్యమైన కథాంశాలను ఎన్నుకుంటూ విజయాలు సాధిస్తున్నాడు. తాజాగా భేతాళుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిచ్చగాడు.. మరో విజయం సాధించాడా..? కథ : దినేష్( విజయ్ ఆంటోని), ఓ తెలివైన సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన తల్లితో కలిసి హైదరాబాద్‌లో ఉండే దినేష్, మెట్రీమోని సైట్లో చూసి అనాథ అయిన ఐశ్వర్య(అరుంధతి నాయర్)ను పెళ్లి చేసుకుంటాడు. అంతా సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో విజయ్ విచిత్రంగా ప్రవర్తించటం మొదలు పెడతాడు. ప్రతీ దానికి భయపడటం, తనకు ఏదో గొంతు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటూ కంగారు పడుతుంటాడు. ఆ గొంతు తనని, జయలక్ష్మీ చంపేసిందని ఆమె మీద పగ తీర్చుకొమ్మని చెపుతుంటుంది. దినేష్ పరిస్థితి చూసి అతన్ని ఓ మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళతారు. డాక్టర్ ట్రీట్ మెంట్‌తో తన గత జన్మ స్మృతులు దినేష్‌కు గుర్తుకు వస్తాయి. గత జన్మలో తన పేరు శర్మ అని తెలుసుకుంటాడు. బ్రహ్మచారి అయిన శర్మ అనాథ పిల్లాడు గోపాలాన్ని దత్తత తీసుకొని పెంచుకుంటుంటాడు. ఆ సమయంలో తన స్కూల్లో పనికోసం వచ్చిన జయలక్ష్మీ, గోపాలంతో ప్రేమగా ఉండటం గమనించి ఆమె గోపాలానికి తల్లి అయితే బాగుంటుందని భావిస్తాడు. తనకీ, జయలక్ష్మికి ఎంతో వయసు తేడా ఉన్నా.. గోపాలం కోసం ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కానీ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్‌గా జాయిన్ అయిన నటరాజ్, జయలక్ష్మీకి దగ్గరవుతాడు. అదే సమయంలో జయలక్ష్మి ఓ మగ బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డ అనుకోకుండా శర్మ చేతిలో చనిపోతాడు. దీంతో శర్మ కావాలనే తన బిడ్డను చంపేశాడన్న పగ పెంచుకున్న జయలక్ష్మీ, నటరాజ్‌తో కలిసి శర్మను, అతడి కొడుకు గోపాలాన్ని చంపేస్తుంది. ఇవన్నీ తెలుసుకున్న దినేష్ కొన్ని నెలల తరువాత మామూలు మనిషిగా హాస్పిటల్ నుంచి బయటికి వస్తాడు. కానీ దినేష్ హాస్పిటల్లో ఉన్న సమయంలో, తన వల్లే దినేష్ ఇలా అయిపోయాడని లెటర్ రాసిపెట్టి దినేష్ భార్య ఐశ్వర్య వెళ్లిపోతుంది. అనాథ అయిన ఐశ్వర్య ఎక్కడి వెళ్లింది...? అసలు దినేష్‌కు గత జన్మ గుర్తుకు రావడానికి ఐశ్వర్యకు సంబంధం ఏంటి...? శర్మ జయలక్ష్మీ మీద పగ తీర్చుకున్నాడా..? చివరకు జయలక్ష్మీ ఏం అయ్యింది..? దినేష్ మామూలు మనిషి అయ్యాడా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన విజయ్ ఆంటోని, భేతాళుడుగా తన మార్క్ చూపించాడు. గత జన్మ స్మృతులతో ఇబ్బంది పడే వ్యక్తిగా, పగతో రగిలిపోయే భేతాళుడుగా రెండు విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సినిమా అంతా విజయ్ ఆంటోని వన్మన్ షోగా నడిచినా.. ఎక్కడా బోర్ కొట్టించకుండా మెప్పించాడు. హీరోయిన్ పాత్రలో కనిపించిన అరుంధతి నాయర్ మంచి నటన కనబరిచింది. అందంగా కనిపిస్తూనే ఎమోషనల్ సీన్స్‌లో ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో చారు హాసన్, మీరా కృష్ణన్, వైజీ మహేంద్రలు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : బిచ్చగాడుతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్ ఆంటోనిని.. భేతాళుడుగా చూపించిన దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి మంచి విజయం సాధించాడు. తొలి 20 నిమిషాలు కాస్త స్లోగా నడిచినట్టుగా అనిపించినా.. అసలు కథ మొదలైన తరువాత ప్రతీ సీన్‌ను ఆసక్తి కరంగా తెరకెక్కించాడు. కథా పరంగా భాగానే ఉన్నా.. అక్కడక్కడా గత జన్మ విశేషాలను హీరో నిజంగా వెళ్లి తెలుసుకున్నాడా..? లేక కలలోనే అవన్ని తెలిశాయా..? అన్న క్లారిటీ మిస్ అయ్యింది. విజయ్ ఆంటోని అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలు పెద్దగా అలరించకపోయినా.. నేపథ్యం సంగీతంతో మాత్రం సినిమా స్థాయిని పెంచాడు విజయ్. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథ విజయ్ నటన నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : స్లో నారేషన్ క్లైమాక్స్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం ఓవరాల్‌గా భేతాళుడు.., ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ను అలరించే సైకలాజికల్ థ్రిల్లర్ - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
రచయితలూ మేమూ మారాలి
- బోయపాటి శ్రీను ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా సెటిల్డ్ పెర్ఫార్మ్ చేసే కథానాయకులున్నారు. అయితే రచయితలు, దర్శకులమైన మేము మారాల్సి ఉంది. సినిమా అన్నది స్టేజ్‌పై మాట్లాడకూడదు. స్క్రీన్‌పైనే మాట్లాడాలని నేను నమ్ముతా. అలా తెరపై మాట్లాడిన చిత్రం ‘బిచ్చగాడు’. అదే తరహాలో విజయ్ ఆంటోని ‘భేతాళుడు’ కూడా హిట్ అవ్వాలి’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. విజయ్ ఆంటోని, అరుంధతీ నాయర్ జంటగా ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన ‘సైతాన్’ చిత్రాన్ని కె.రోహిత్, ఎస్.వేణుగోపాల్ తెలుగులోకి ‘భేతాళుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. విజయ్ ఆంటోని స్వరపరచిన ఈ చిత్రం పాటలను హీరో నిఖిల్ విడుదల చేశారు. విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ-‘‘తెలుగులో నాకు ఇటువంటి గుర్తింపు ఏ పాతిక చిత్రాలకో వస్తుందనుకున్నా. కానీ, మూడో సినిమాకే ఇంత మంచి గుర్తింపు రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు. -
ఘనంగా బేతాళుడు ఆడియో రిలీజ్
-
భేతాళుడుగా బిచ్చగాడు
టాలీవుడ్ మార్కెట్ మీద పట్టు కోసం తమిళ స్టార్ హీరోలు కూడా తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పటికే రజనీకాంత్, కమల్ హాసన్ తెలుగు హీరోల స్థాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకోగా.. సూర్య, విక్రమ్ లాంటి స్టార్లు కూడా మంచి బిజినెస్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో హీరో చేరిపోయాడు. డాక్టర్ సలీం, నకిలీ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోని.. బిచ్చగాడు సినిమాతో రికార్డ్ సృష్టించాడు. తెలుగునాట చిన్న సినిమాగా విడుదలైన ఈ డబ్బింగ్ సినిమా భారీ కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా మరో డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు విజయ్ ఆంటోని. కథల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా ఉండే విజయ్ ఆంటోని ప్రస్తుతం సైతాన్ పేరుతో సినిమా చేస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు వర్షన్‌కు భేతాళుడు అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. సెప్టెంబర్‌లో రిలీజ్ అవుతోన్న ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తే తెలుగులో విజయ్ ఆంటోనికి ఇక తిరుగుండదంటున్నారు విశ్లేషకులు.