ఇంత బాగా ఇక ఆడలేనేమో..!
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా
హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఈ ఏడాది అద్భుతంగా కలిసి వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండు గ్రాండ్‌స్లామ్స్‌తో పాటు తొమ్మిది టైటిళ్లు సాధించడమే కాకుండా డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకును సైతం సొం తం చేసుకుంది. అయితే మున్ముందు ఇలాంటి ఫీట్‌ను పునరావృతం చేయడం కష్టమేనని భావిస్తోంది. ‘వచ్చే ఏడాది కూడా ఇలాంటి ఆటతీరునే కనబరుస్తానని ఆశిస్తున్నాను. అయితే ఇంతకన్నా మెరుగైన ఫలితాలు సాధించడం కష్టమే. అయితే ఈ ఏడాది కూడా ఇలాంటి విజయాలు వస్తాయని ఎవరూహించారు? హింగిస్‌తో కలిసి మరో స్లామ్ గెలిస్తే అద్భుతంగా ఉంటుంది. నిజానికి ఈ ఏడాదే కాకుండా మొత్తం నా కెరీర్ కూడా ఆసక్తికరమే. గత కొన్నేళ్లుగా అంతా మంచే జరుగుతోంది. కొన్నేళ్ల కఠోర శ్రమ ఇప్పుడు ఫలితాలనిస్తోంది. అభిమానులు, మీడియా కూడా చాలా ప్రోత్సాహాన్ని అందించారు’ అని సానియా మీర్జా గుర్తుచేసుకుంది.
సానియా అకాడమీలో ఎగ్జిబిషన్ మ్యాచ్
భారత్‌లో టెన్నిస్‌కు మరింత ఖ్యాతిని తీసుకొచ్చేందుకు దిగ్గజ ఆటగాళ్లు కలిసి ఆడనున్న మూడు ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల్లో ఒకటి హైదరాబాద్‌లోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలో జరుగుతుంది. ఈనెల 25న తొలి మ్యాచ్ కోల్‌కతాలో జరుగుతుం డగా 26న జరిగే రెండో మ్యాచ్‌కు స్థానిక సానియా అకాడమీ వేదిక కానుంది. ఈ మ్యాచ్‌ల్లో లియాండర్ పేస్-నవ్రతిలోవా ఓ జంటగా.. మహేశ్ భూపతి-సానియా మరో జంటగా ఆడనున్నారు.