హరితహారం పేరుతో హక్కుల ఉల్లంఘన
భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య విమర్శ
సీపీఎం ఆధ్వర్యంలో పోడు రైతుల ర్యాలీ
గూడూరు : హరితహారం పేరుతో ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తోందని భద్రాచలం ఎమ్మెల్యే, సీపీఎం శాసనసభా పక్ష నేత సున్నం రాజయ్య అన్నారు. వరంగల్ జిల్లా గూడూరులో ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో పోడు రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. 2005 ముందు నుంచి సాగు చేస్తున్న పోడు రైతులందరికీ పత్రాలు ఇస్తున్నట్లు గత పాలకులు ప్రకటించారని, ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతో ఆ భూములను ఆక్రమిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ శాఖాధికారి లక్ష్మీకాంతరెడ్డి పోడు రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దని సీఎం కేసీఆర్ సూచించినా, అధికారులు సీఎం, మంత్రుల మాటలు వినకుండా హక్కుపత్రాలు ఉన్న పోడు రైతుల భూములను ఆక్రమించడం బాధాకరమన్నారు. పోడు సమస్యపై వచ్చే అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతానన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకుడు సూడి క్రిష్ణారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు సాదుల శ్రీనివాస్, కుర్ర మహేశ్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఆంగోతు వెంకన్ననాయక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి స్వామి, రిజర్వేషన్ సాధన సమితి కన్వీనర్ దస్రూనాయక్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు పాషం సాంబయ్యమాదిగ తదితరులు పాల్గొన్నారు.