నేడే భద్రాద్రి రామయ్య కల్యాణం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: శ్రీ సీతారాముల కల్యాణానికి భద్రాచలం ముస్తాబైంది. మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన కల్యాణ మంటపంలో అభిజిత్ లగ్నంలో సీతారాములు ఒక్కటి కానున్నారు. ఈ వేడుకను చూసేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాచలానికి చేరుకుంటున్నారు. వారికి ఇబ్బంది తలెత్తకుండా దేవస్థానం, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పెళ్లి తంతు ఇలా..
ఉదయం 9:30 గంటల తర్వాత శంఖ, చక్ర, ధనుర్బాణాలను ధరించి సీతతో కూడిన శ్రీరాముడి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకీలో మిథిలా స్టేడియంలోని కల్యాణ మంటపానికి తీసుకొస్తారు. వేదికపై సీతారామ లక్ష్మణులను వేంచేపు చేస్తారు. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం గావిస్తారు. ఆ తర్వాత యోద్వాహం నిర్వహించి అప్పటివరకు మంటపంలోనే ఉన్న సీతమ్మను శ్రీరాముడికి ఎదురుగా కూర్చోబెడతారు. ఆ తర్వాత సీతమ్మకు యోక్త్ర బంధనం చేస్తారు. ఆపై సీతారాముల వంశగోత్రాల ప్రవరలు ఉంటాయి. అనంతరం కల్యాణం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వ్రస్తాలను సీతారాములకు ధరింపజేస్తారు. అదే విధంగా భక్త రామదాసు చేయించిన చింతాకు పతకం సీతమ్మకు, పచ్చల హారం రామయ్యకు అలంకరిస్తారు. లక్ష్మణుడికి రామమాడను ధరింపజేస్తారు.
అభిజిత్ లగ్నంలో
చైత్రశుద్ధ నవమి, అభిజిత్ లగ్నం మధ్యాహ్నం 12 గంటలకు కాస్త అటుఇటుగా రావడం పరిపాటి. ముహూర్త సమయం కాగానే వధూవరులైన సీతారాముల తలలపై జీలకర్ర, బెల్లం ఉంచుతారు. ఆ తర్వాత శ్రీరామదాసు చేయించిన మూడు బొట్లు ఉన్న మంగళసూత్రానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మూడు సూత్రాలు ఉన్న తాళిని సీతమ్మ వారి మెడలో కట్టడంతో కల్యాణ వేడుకలో కీలక ఘట్టం ముగుస్తుంది. ముత్యాలు కలిపిన, గోటితో ఒలిచిన తలంబ్రాలను వధూవరులైన సీతారాములపై పోస్తారు. తలంబ్రాల కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామి, అమ్మవార్లకు తాత్కాలిక నివేదన అనంతరం బ్రహ్మముడి వేసి మంగళ హారతి అందిస్తారు. కల్యాణం ముగించుకున్న సీతారాములను వేడుకగా పల్లకీలో భద్రాచల వీధుల్లో ఊరేగిస్తూ ఆలయంలోనికి తీసుకెళ్తారు.
పూర్తయిన ఏర్పాట్లు
సీతారాముల కల్యాణానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానంతో పాటు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మిథిలా స్టేడియాన్ని సెక్టార్లుగా విభజించి వేర్వేరు ధరల్లో టికెట్లను ఇప్పటికే విక్రయించారు. శ్రీరామ నవమికి ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. వేసవి కావడంతో ప్రధాన రహదారి నుంచి ఆలయ ప్రాంగణం వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ పెరిగిపోవడంతో భద్రాద్రితో భక్తులకు వసతి లభించడం దుర్లభంగా మారింది. లాడ్జీల్లో రేట్లు రెండు, మూడింతలు పెంచేశారు. పెరిగే ట్రాఫిక్కు తగ్గట్టుగా గోదావరిపై రెండో వంతెనను అందుబాటులోకి తెచ్చారు. నవమి వేడుకల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 238 బస్సులను నడిపిస్తోంది. నవమి ప్రత్యేక బస్సుల్లోనూ మహాలక్ష్మీ పథకం చెల్లుబాటు అవుతుందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
ఘనంగా ఎదుర్కోలు వేడుక
శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆలయంలో మంగళవారం రాత్రి ఎదుర్కోలు వేడుకను కనుల పండువగా నిర్వహించారు. రామయ్య తరఫున కొందరు, సీతమ్మవారి తరఫున కొందరు అర్చకులు విడిపోయి ‘మా వంశమే గొప్పదంటే..కాదు కాదు.. మా వంశమే గొప్ప’అంటూ సంవాదం చేసుకుంటూ కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు పాల్గొన్నారు.