నేడే భద్రాద్రి రామయ్య కల్యాణం
సీఎం కేసీఆర్ రాక అనుమానమే..
సాక్షి, కొత్తగూడెం: దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్స వానికి సర్వం సిద్ధం చేశారు. ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. దాదాపు 3 లక్షల మంది భక్తులు కల్యాణ మహోత్సవాన్ని తిలకిస్తారని అంచనా వేసిన అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. భద్రాచలం లోని మిథిలా స్టేడియంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే సీతారాముల కల్యాణ ప్రక్రియ 12.30 గంటలకు ముగుస్తుంది. కల్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ముత్యాల తలం బ్రాలు, పట్టువస్త్రాలు తీసుకురావడం సంప్రదాయంగా వస్తోంది.
అయితే, ఈసారి సీఎం పర్యటన చివరి నిమిషంలో రద్దయినట్లు తెలుస్తోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్న భద్రాద్రి సరిహద్దుల్లో పోలీసులు ఇప్పటికే భారీ గాలింపు చర్యలు చేపట్టారు. స్వామివారి కల్యాణం తిలకించేందుకు వచ్చిన భక్తులు ఇప్పటికే గోదావరి తీరంలో స్నానాలు ఆచరించడానికి కరకట్టల వద్దకు భారీగా చేరుకుంటున్నారు. సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.