ఈసారి ఘనమేనా!
* రూ.కోటి నిధులపైనే కోటి ఆశలు
* ఏర్పాట్లలో అధికారులు
* 17 నుంచి ఏడుపాయల జాతర
పాపన్నపేట: వెయ్యేళ్ల చరిత్ర గల ఏడుపాయల ఒకప్పుడు కీకారణ్యం. ప్రస్తుతం లక్షలాది భక్తులతో జనారణ్యంగా మారుతోంది. ఆదాయం ఘనంగా ఉన్నా సౌకర్యాలు అంతంత మాత్రమే. ఎంతో ఇష్టంగా వచ్చే భక్తులు తీవ్ర అసౌకర్యాల మధ్య దైవ దర్శనం చేసుకొని వెళ్తున్నారు. నదిలో పడి ప్రాణాలు విడుస్తున్న సందర్భాలు అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. ఈసారి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి రూపాయలు విడుదల చేశారు. కొంతలో కొంత బెటరేనని పలువురు అంటున్నారు. మాస్టర్ ప్లాన్ అమలైతేనే ఏడుపాయల రూపురేఖలు పూర్తి స్థాయిలో మారే అవకాశం ఉంది.
ఇప్పటివరకు ఇలా..
ఏడుపాయల దుర్గా భవానీ మాత ఆలయ బడ్జెట్ గత ఏడాది రూ.1,82,42,201. ఇందులో రూ.1,72,38,084 ఖర్చు చేశారు. 46 మంది ఉద్యోగులుండగా సుమారు 42 శాతం ఆదాయం వారి జీతభత్యాలకే ఖర్చువుతోంది. సీజీఎఫ్, ఈఏఎఫ్, ఏడబ్ల్యుఎఫ్, అడిట్ ఫీ కలిసి సుమారు 21.5 శాతం వ్యయమవుతోంది. జాతర కోసం రూ.37 లక్షలు వెచ్చిస్తుంటారు. అమ్మవారి ఆదాయాన్ని పరిశీలిస్తే ఇప్పటివరకు రూ.85 లక్షల ఫిక్స్ డిపాజిట్లు ఉన్నాయి. కిలో 362 గ్రాముల బంగారు ఆభరణాలు, 102 కిలోల వెండి ఆభరణాలున్నాయి. వీటికితోడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇచ్చిన బంగారు కిరీటం, హారాలు ఉన్నాయి. భక్తుల సౌకర్యాల విషయానికొస్తే అంతంత మాత్రమే.
సత్రాలన్నీ దాతలవే..
ఏడుపాయల్లో మొత్తం 46 సత్రాలు ఉండగా, అందులో 40 దాతలవే కావడం గమనార్హం. జాతర సమయంలో ఆ సత్రాలన్నీ దాతలతోనే నిండిపోతాయి. భక్తులు తలదాచుకోవడానికి బండరాళ్లు, చలువ పందిళ్లు, చెట్ల నీడలే దిక్కవుతున్నాయి. గత ఏడాది జాతర సమయంలో వర్షం పడటంతో భక్తుల అనేక అవస్థలు పడ్డారు. తలదాచుకోవడానికి చోటులేక చెట్టుకొకరు, పుట్టకొకరుగా పరుగులు తీశారు. స్నానఘాట్లు లేకపోవడంతో గత ఐదేళ్లలో సుమారు 60 మంది భక్తులు మంజీర నదిలో స్నానం చేస్తూ నీట మునిగి చనిపోయారు. తాగు నీటి పైప్‌లైన్లు మురికి నీటిలోనే తేలియాడుతున్నాయి.
సత్రాల చుట్టూ చెత్తా చెదారం పేరుకుపోయింది. మహిళలకు సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో జాతర సమయంలో అవస్థలు పడుతున్నారు. ఇటీవల హుండి లెక్కింపులో కిందిస్థాయి ఉద్యోగులు చేతివాటాన్ని ప్రదర్శించి సుమారు రూ.3 వేలు నొక్కేశారు. జాతర సమయంలో సైతం సిబ్బంది అక్రమాలకు పాల్పడుతుంటారనే ఆరోపణలున్నాయి. టెండర్ హక్కులు పొందిన వారు కూడా పరిమితికి మించి రుసుం వసూలు చేస్తారని భక్తులు ఆరోపిస్తున్నారు. మద్యం సైతం జోరుగా విక్రయిస్తుంటారు.
ఈసారి రూ.కోటితో ధూంధాంగా..
ఈనెల 17న ఏడుపాయల జాతర ప్రారంభం కానుంది. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా వచ్చిన జాతర కోసం మునుపెన్నడూ లేని రీతిలో ధూంధాంగా జరిపించేందుకు అధికారులు, పాలకవర్గం ప్రత్యేక కృషి చేస్తోంది. భక్తులు స్నానాలు చేసేందుకు ఫౌంటెయిన్లు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని స్నానఘాట్లను నిర్మిస్తున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి వసతులు కల్పించేందుకు తాత్కాలిక చర్యలు చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపట్టడానికి 500 మంది సిబ్బందిని నియమిస్తున్నారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో ఏడుపాయలను సుందరంగా అలంకరించి జనం మెచ్చే జాతరగా నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈసారి హరిత రెస్టారెంట్‌తోపాటు టూరిజం డార్మెటరీలు భక్తులకు కొంత ఉపయోగపడనున్నాయి.
ఏడుపాయలకు సింగూర్ నీరు
సంగారెడ్డి అర్బన్: ఏడుపాయల జాతరను పురస్కరించుకొని 0.30 టీఎంసీల నీటిని సింగూర్ ప్రాజెక్ట్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసినట్టు సంగారెడ్డి నీటి పారుదల శాఖ ఈఈ రాములు తెలిపారు. దిగువకు నీటిని వదిలినందున నది పరీవాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఈ నీరు ఘనపూర్ ఆనకట్టకు ఆదివారం రాత్రికి చేరే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.